Share News

నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:54 AM

అన్నదాతల ఆశలకు కష్టాలు తోడయ్యాయి. యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రవాణా, కాంటాల జాప్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండల్లో సౌకర్యాలు లేక చెట్ల నీడలో ఉంటూ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.

నత్తనడకన ధాన్యం కొనుగోళ్లు..

(ఆంధ్రజ్యోతి/నెట్‌వర్క్‌)

అన్నదాతల ఆశలకు కష్టాలు తోడయ్యాయి. యాసంగి ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రవాణా, కాంటాల జాప్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భగ్గుమంటున్న ఎండల్లో సౌకర్యాలు లేక చెట్ల నీడలో ఉంటూ ధాన్యం ఎప్పుడు కొనుగోలు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఆవేదనకు గురైన రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం నామామాత్రంగా స్పందిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ‘ఆంధ్రజ్యోతి’ బృందం క్షేత్రస్థాయిలో కేంద్రాలను విజిట్‌ చేసి రైతుల ఆవేదనను తెలుసుకుంది.

జిల్లాలో 244 కేంద్రాలు..

యాసంగిలో రైతులు వరి సాగు వైపు మొగ్గు చూపారు. ఇంట్లో సిరులు కురిపిస్తుందని ఆశపడ్డ రైతులకు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద కుప్పలు పోసుకొని ఎదురుచూస్తున్నారు. కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడం, రైస్‌మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీలు ఇవ్వకపోవడంతో ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టెక్స్‌టైల్‌ వీవింగ్‌ పార్కులో నిర్మించిన షెడ్లను ఉపయోగించుకుంటున్నారు. అయినా జిల్లాలో కొనుగోళ్లలో వేగం మాత్రం పెరగడం లేదు. జిల్లాలో 246 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఐకేపీ ద్వారా 192 కేంద్రాలు, సింగిల్‌ విండోల ద్వారా 46 కేంద్రాలు, డీసీఎంఎస్‌ ఒకటి, మెప్మా 7 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా 244 కేంద్రాలు ప్రారంభించారు. ఇందులో 234 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. జిల్లాలో 1.78 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 3.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో 2.92 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దొడ్డురకం, 8 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సన్న రకం వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో పౌర సరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అంచనా వేసింది. ఏప్రిల్‌ మాసంలో 75 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉండగా 31 వేల 454 మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 25,230 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌విండోల ద్వారా 5,372మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ ద్వారా 312 మెట్రిక్‌ టన్నులు, మెప్మా ద్వారా 539 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యంలో 23,344 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేంద్రాల నుంచి తరలించారు. 4,282 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 31,454 మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో 212 మంది రైతులకు సంబంధించి 1,165 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఆన్‌లైన్‌ చేశారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో 40 మెట్రిక్‌ టన్నుల ధాన్యం డబ్బులు రూ.9 లక్షల వరకు మాత్రమే జమ చేశారు. నత్తనడకన సాగుతున్న కొనుగోళ్లకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

ఫ రోడ్డెక్కుతున్న రైతులు...

కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం, ధాన్యం రవాణాకు లారీలు రాకపోవడం, కాంటా పెట్టకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్న రైతులు ప్రతి రోజు ఏదో ఒక కేంద్రం వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వీర్నపల్లి మండల రైతులు జిల్లా కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. కోనరావుపేట మండలం అజ్మీరా తండా మహిళా రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గంభీరావుపేట, చందుర్తి, ఇల్లంతకుంట ముస్తాబాద్‌, తంగళ్లపల్లి మండలాల్లో రైతులు ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. మరోవైపు వడగళ్లకు వరిపంటతో పాటు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు రైతులు ఽధాన్యాన్ని దళారులకు నష్టానికి విక్రయించుకుంటున్నారు. తేమ ఉన్న ధాన్యం క్వింటాలుకు రూ.1850, తేమ లేని ధాన్యం రూ.2050 నుంచి రూ.2100 వరకు అమ్ముకుంటున్నారు.

ఫ లారీల కొరత.. కనీస వసతులు కరువు

తంగళ్లపల్లి : లారీల కొరత.. వరిధాన్యం ఆరబోసుకోవడానికి స్థలం కొరత.. తాగునీరు కరువు.. నిలువ నీడ లేక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శనివారం తంగళ్లపల్లి మండలంలోని ఐకేపీ ధాన్యం కోనుగోలు కేంద్రాలను పరిశీలించగా, నెల రోజుల క్రితం ధాన్యాన్ని తీసుకువచ్చిన రైతులు పడిగాపులు కాస్తూ కనిపించారు. లారీలు రావడంలో జాప్యం కావడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. జిల్లెల్ల ధాన్యం కొనుగోలు కేంద్రంలో సరిపడా లారీలు రావడం లేదు. ధాన్యాన్ని ఆరబోసుకోవడానికి ఖాళీ స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు నిల్వ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లెల్లలో గతంకంటే ప్రస్తుతం వరిధాన్యం విక్రయంలో ఇబ్బందులు లేవు.

తరుగు పేరిట 2.5 కిలోలు కోత..

ఎల్లారెడ్డిపేట : మండలంలో సెర్ప్‌-ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం 26 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తూకం వేయడంలో జాప్యం వల్ల ధాన్యం పేరుకుపోయింది. హమాలీలు లేకపోవడం, తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించడానికి లారీల కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల నుంచి కేంద్రాల్లోనే నిరీక్షిస్తున్నారు. ఎండ తీవ్రతకు కేంద్రాల్లో టెంట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల చెట్ల కింద కూర్చోవలసి వస్తోందని రైతులు వాపోతున్నారు. తాగేందుకు నీరు లేక ఇళ్ల నుంచి తెచ్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో బస్తాకు 42.5 కిలోల తూకం వేస్తున్నారని పేర్కొన్నారు. తరుగు పేరిట 2.5 కిలోలు కోత విధిస్తున్నారని రైతులు చెబుతున్నారు.

ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం

ఇల్లంతకుట : మండంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం అవుతోంది. మండలంలో 28దాన్యం కొనుగోలు కేంద్రాలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. తొలుత మిల్లర్లు దాన్యం సేకరణకు నిరాకరించడంతో రహీంఖాన్‌పేట గ్రామంలోని గోదాంలకు ధాన్యాన్ని తరలించారు. హమాలీల కొరత, లారీలు రాకపోవడంతో తీవ్రంగా రైతులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం మిల్లులు కేటాయించినా సరిపడా లారీలు రాకపోవడం, సమయానికి గోనె సంచులు ఇవ్వకపోవడంతో కేంద్రాలలో ధాన్యం పేరుకుపోయింది. కొన్ని కేంద్రాల వద్ద తాగునీరు, నీడను సైతం ఏర్పాటు చేయలేదు. వాతావరణంలో మార్పులు వస్తుండటం, తూకం, ధాన్యం తరలింపులో ఆలస్యం కావడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. మండలంలోని వివిధ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 18 వేల క్వింటాళ్ళ ధాన్యాన్ని సేకరించారు.

లారీల కొరతతో నిలిచి కొనుగోళ్లు

వేములవాడ టౌన్‌ : వేములవాడ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రంతో పాటుగా నాంపల్లి, రుద్రవరం సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. పది రోజులుగా ధన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోకి రైతులు తీసుకువచ్చారు. లారీల కొరత ఉండటంతో కొనుగోళ్లు ఆలస్యమవుతోందని రైతులు చెబుతున్నారు. వేములవాడ సింగిల్‌ విండో ఆధ్వర్యంలో మూడు రోజులుగా లారీలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చైర్మన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో శనివారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా రెండు లారీలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను వేగవంతం చేశారు. రుద్రవరం, నాంపల్లి గ్రామంలో లారీల కొరత ఉండటంతో కొనుగోళ్లలో ఆలస్యమవుతోంది.

అకాల వర్షానికి భయపడి..

చందుర్తి : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయకపోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆకాల వర్షాలకు ధాన్యం తడుస్తుందని రైతులు భయపడుతున్నారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వారికి మద్దతు ధర లభించకపోగా బోనస్‌ను కోల్పోతున్నారు. మండలంలో ధాన్యం సేకరణకు ఐకేపీ ఆధ్వర్యంలో 13, సనుగుల సింగిల్‌ విండో ఆధ్యర్యంలో 4 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 25,203 క్వింటళ్ల ధాన్యం కొనుగోలు చేసి 13,806 క్వింటాళ్ల ధాన్యం గోదాంలకు తరలించారు. కొనుగోలు కేంద్రాల్లో 11,397 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. సనుగుల సింగిల్‌ విండో పరిధిలో 8500 క్వింటాళ్ల కొనుగోలు చేయగా 6200 క్వింటాళ్ల ధాన్యం గోదాంలకు తరలించగా, 2300 క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉంది. అకాల వర్షాలు వస్తే ధాన్యం తడిచిపోతుందనే భయంతో ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. శనివారం అన్ని కేంద్రాలకు రైస్‌ మిల్లులు అలాట్‌ అయినట్లు నిర్వాహకులు తెలిపారు.

కల్లాల్లో అన్నదాతల కష్టాలు..

వీర్నపల్లి : వీర్నపల్లి మండలంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదు. తూకంవేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలు రాకపోవడంతో ఎక్కడికక్కడ సంచులు నిల్వ ఉన్నాయి. సెంటర్‌ నిర్వాహకులు రైతులకు కనీసం తాగునీటి వసతి కల్పించడం లేదు. నీడ కోసం టెంట్‌ వేసినా జాడే లేదు. కొన్ని సెంటర్లలో ప్రభుత్వం అందించిన టార్పాలిన్‌ కవర్లను రైతులకు అందించడం లేదు. ఎండలో పనిచేసే హమాలీ కూలీలకు వైద్య సిబ్బంది ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించడం లేదు.

కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం

రుద్రంగి : మండల కేంద్రంలో వ్వవసాయ మార్కెట్‌లో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో, అలాగే సింగిల్‌ విండో ఆధ్వర్యంలో రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. లారీల కొరత వల్ల కొనుగోళ్లలో జాప్యం జరగడంతో ధాన్యం పెరుకుపోతోంది. దీంతో ఽధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాల కారణంగా ఽధాన్యం తడిస్తే మళ్లీ ఆరబెట్టాల్సి వస్తుందేమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు రెండు కొనుగోలు కేంద్రాల నుంచి సూమారు 15 లారీల ధాన్యం వెళ్లింది. కొనుగోళ్లు వేగవంతగా చేయాలని రైతులు కోరుతున్నారు.

విలీన గ్రామాల్లో నిలిచిపోయిన ధాన్యం కొనుగోళ్లు

సిరిసిల్ల రూరల్‌ : సిరిసిల్ల మున్సిపాల్టీలోని విలీన గ్రామాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విలీన గ్రామాలైన రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి, చిన్నబోనాల, పెద్దబోనాల, పెద్దూర్‌ గ్రామాలతోపాటు సర్ధాపూర్‌ గ్రామంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకవచ్చి నెలరోజులు గడుస్తున్నా వారం రోజుల క్రితం ఒక్కసారి తూకం వేసి ధాన్యం కొనుగోలు చేసి ఒక్కో లారీ చొప్పున తరలించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజులుగా సాయంత్రం అకాల వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడవకుండా టార్పాలిన్‌ కవర్లను కప్పుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు.

సగం ధాన్యం దళారుల పాలే..

బోయినపల్లి : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సకాలంలో తూకం వేయకపోవడంతో మండలంలో సగ ధాన్యం దళారులే కొనుగోలు చేస్తున్నారు. ఓవైపు మేఘాలు కమ్ముకోవడంతోపాటు కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేకపోవడంతో రైతులు ఆందోళన గురవుతున్నారు. దీన్ని ఆసరా చేసుకొని దళారులు తేమ అధికమున్న ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.

Updated Date - Apr 27 , 2025 | 12:54 AM