జూనియర్ కళాశాలలపై ఫోకస్
ABN , Publish Date - Nov 15 , 2025 | 12:44 AM
జిల్లాలోని జూనియర్ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ కళాశాలలను ఇప్పటికే ప్రక్షాళన చేయగా, క్షేత్రస్థాయిలో ఆచరణ, పరిస్థితులు అధ్యయనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
జగిత్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జూనియర్ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ కళాశాలలను ఇప్పటికే ప్రక్షాళన చేయగా, క్షేత్రస్థాయిలో ఆచరణ, పరిస్థితులు అధ్యయనానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో విద్యా బోధన, మౌలిక వసతులు తదితర అంశాలపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల వివరాలను రోజువారీగా ఆనలైనలో నమోదు చేస్తున్నారు. జీపీఎస్ ఆధారంగా తనిఖీలు చేపడుతుండడంతో కళాశాల యాజమాన్యాల్లో గుబులు పుడుతోంది. తనిఖీలతో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోని వాస్తవ పరిస్థితులు ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసే అవకాశం ఏర్పడింది. దీంతో నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలకు ఉపక్రమించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇంటర్ విద్యాధికారి నారాయణ నేతృత్వంలో ఒక బృందం ఈనెల 11వ తేదీ నుంచి తనిఖీలు ప్రారంభించాయి. రాష్ట్ర స్థాయి అధికారులతో కూడిన మరో రెండు బృందాలు సైతం కళాశాలలను తనిఖీ చేయనున్నాయి. జిల్లాలో ప్రతీరోజూ రెండు నుంచి నాలుగు కళాశాలలను ఒక్కో బృందం తనిఖీ చేయాల్సి ఉంటుంది.
మూడు బృందాలుగా తనిఖీలు...
జిల్లాలో 75 జూనియర్ కళాశాలలున్నాయి. ఇందులో 16 ప్రభుత్వ కళాశాలలు, 19 ప్రైవేటు జూనియర్ కళాశాలలు, 40 కేజీబీవీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల కలాశాలలు, రెసిడెన్షియల్ కళాశాలలున్నాయి. వీటిని తనిఖీ చేసేందుకు ఇంటర్ బోర్డు మూడు బృందాలను ఏర్పాటు చేసింది. మొదటి బృందంలో డిసి్ట్రక్ట్ ఇంటర్ ఎడ్యూకేషన ఆఫీసర్ (డీఐఈవో) బొప్పరాతి నారాయణ, మరో బృందంలో ప్రత్యేకాధికారి (ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ) రమణారావు, ఇంకో బృందంలో డిప్యూటీ సెక్రెటరీ రాఘవలతో తనిఖీలు చేపడుతున్నారు. తొలి విడతలో డీఐఈవో నేతృత్వంలోని బృందానికి 44 కళాశాలలు, మరో రెండు బృందాలకు 12 కళాశాలల చొప్పున 24 కళాశాలల్లో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా జిల్లాలో 75 కళాశాలలుండగా 68 కళాశాలకు మాత్రమే షెడ్యూల్ వారీగా తనిఖీలకు కేటాయింపులు జరిపారు. ఏడు కళాశాలలకు షెడ్యూల్ కేటాయింపులో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం చూపింది. అయితే దానిని సరిదిద్దుకోవడానికి మిగిలిన ఏడు కళాశాలలను సైతం డీఐఈవో బృందంతో తనిఖీలు చేయిచండానికి నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి.
కళాశాల పేరు..కోడ్..
కళాశాల పేరు, కళాశాల కోడ్, తనిఖీ చేసిన సమయం, తేదీ, కళాశాల గుర్తింపు వివరాలు, అకాడమిక్ యాక్టివిటీస్ అడ్మిషన్స వివరాలు, కోచింగ్ తరగతుల నిర్వహణ వంటి వాటిని పరిశీలిస్తున్నారు. ఎంత శాతం సిలబస్ పూర్తి చేశారు..? ఒకవేళ చేయకుంటే కారణాలు ఏమిటీ అన్న వివరాలు సేకరిస్తున్నారు. రోజూ వారీగా యాక్షన ప్లాన అమలు ఎలా ఉంది.. స్టాఫ్ వివరాలు, డిప్యూటేషన ఉద్యోగుల పరిస్థితి, కళాశాలకు కేటాయించిన బడ్జెట్‌ను ఎంతవరకు ఉపయోగించుకున్నారు..? స్పోర్ట్స్ మెటీరియల్ సేకరించారా..? తల్లిదండ్రులతో సమావేశాల నిర్వహణ, షానిటేషన యుటిలైజేషన సర్టిఫికేట్ పరిస్థితి ఎలా ఉంది, రికార్డుల నిర్వహణ ఎలా ఉంది..? తదితర వివరాలను తనిఖీల్లో పరిశీలిస్తున్నారు. సంబంధిత పత్రాలను సేకరించి ఆనలైనలో అప్‌లోడ్ చేస్తున్నారు.
- పరిశీలించే అంశాలివే..
కళాశాలల్లో టైం టేబుల్ అమలు, సబ్జెక్టుల వారీగా సిలబస్ ఎంత వరకు చేశారు.. కళాశాలకు వచ్చే విద్యార్థులు, లెక్చరర్ల హాజరు శాతం, కళాశాలలో మౌలిక వసతులు ఉన్నాయా..? లేదా...? అనే అంశాలను పరిశీలిస్తారు. వసతులు లేకుంటే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో తీసుకునే చర్యలతో పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే అంశాలపై వాకబు చేస్తున్నారు. కళాశాల పరిధిలో ఏఏ గ్రామాలు నుంచి అడ్మిషన్లు వస్తున్నాయి... మిగితా ప్రాంతాల నుంచి అడ్మిషన్లు రాకపోవడానికి కారణాలను లెక్చరర్లను అడిగి తెలుసుకుంటున్నారు. లెక్చరర్ల బోధనపై సైతం ఆరా తీస్తున్నారు.