ఫిట్నెస్ ఉండాల్సిందే...
ABN , Publish Date - Jun 08 , 2025 | 12:40 AM
ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ఎంత ముఖ్యమో తిరిగి భద్రంగా ఇంటికి చేరడం అంతే ప్రధానంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

జగిత్యాల, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడం ఎంత ముఖ్యమో తిరిగి భద్రంగా ఇంటికి చేరడం అంతే ప్రధానంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలల యాజమాన్యాలు విధిగా విద్యార్థులకు భద్రతపై భరోసా కల్పించాలని సూచిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసం తల్లి దండ్రులు లక్షల రూపాయల్లో వ్యయం చేస్తూ ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తుంటే అంతే బాధ్యతగా పాఠశాలల యాజమాన్యాలు ఉండాలని, ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోవద్దని వివరిస్తున్నారు. విధిగా పాఠశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని, వాహనాలు రహదారులపైకి వచ్చే లోపు ఫిట్నెస్ చేయించుకోకుంటే ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
వాహన ఫిట్నెస్ పరీక్షలు విస్మరించే వారిపై దృష్టి....
విద్యార్థులను తరలించడానికి వినియోగిస్తున్న వాహనాలకు చేయించాల్సిన ఫిట్నెస్ పరీక్షలపై యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. విద్యాసంస్థల బస్సులకు ప్రతీ సంవత్సరం ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. కానీ కొందరు పాఠశాలల యాజమాన్యాలు విస్మరిస్తున్నారు. కొన్ని పాఠశాల బస్సుల భద్రత ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులను ఇంటి నుంచి పాఠశాలకు తరలించే బస్సులు ఫిట్లెస్గా మారుతున్నాయి. ఈనెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. పలు ప్రైవేటు పాఠశాలల యజామాన్యాలు విద్యార్థుల అడ్మిషన్లపై దృష్టి సారించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులను తరలించే వాహనాలను పట్టించుకోవడం లేదు. పాఠశాలలను తెరిచి బస్సులను రోడ్డుపైకి తీసుకోచ్చేలోపు విద్యా సంస్థల వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రతీ విద్యాసంస్థ నియమాన్ని పాటించాల్సి ఉంటుంది. నిబంధనలు విస్మరించే పాఠశాల వాహనాలపై చర్యలు తీసుకోవడంపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు.
జిల్లాలో పాఠశాల వాహనాల పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా రవాణాశాఖ ఆధ్వర్యంలో రిజిస్టర్ అయిన బస్సులు 462 ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 292 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకున్నారు. మరో 170 వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు చేయించలేదు. అయితే జిల్లాలో 220 పాఠశాల వాహనాలు 15 సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకొని కాలం చెల్లి ఉండడంతో వాటికి ఫిట్నెస్ పరీక్షలు చేయడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. కాగా ఒక్కో ఫిట్నెస్ పరీక్షకు సంవత్సరానికి ఒకసారి ఐదు వేల రూపాయలు ఖర్చవుతుంది. ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి నెలకు సుమారు వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తాయి. ఈ లెక్కన ఒక బస్ సీటింగ్ కెపాసిటీ ఆధారంగా 40 మందికి నెలకు 40 వేల రూపాయలు వసూలు చేస్తారు. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేసే స్కూలు యాజమాన్యాలు కేవలం ఫిట్నెస్ కోసం ఐదు వేల రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే విద్యార్థులను తరలించే వాహనాలకు యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంది. పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో యాజమాన్యాలు ఫిట్నెస్ విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
- 293 ప్రైవేటు పాఠశాలలు..
జిల్లావ్యాప్తంగా 293 వివిధ ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 15 ప్రాథమిక పాఠశాలలు, 149 ప్రాథమికోన్నత పాఠశాలలు, 129 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో సుమారు 68,019 మంది విద్యార్థులు ప్రతీ యేటా ప్రవేశాలు పొంది విద్యను అభ్యసిస్తున్నారు. సుమారు 3,689 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. పిల్లలను పాఠశాలల నుంచి తీసుకువెళ్లి, తిరిగి ఇళ్లకు చేర్చేందుకు అవసరమైన ప్రైవేటు పాఠశాలల బస్సుల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. వేలకువేలు ఫీజులు గుంజుతున్న స్కూళ్ల యజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలను నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో కళ్లముందే ప్రమాదాలు కనిపిస్తున్నప్పటికీ యాజమాన్యాలు మాత్రం నిర్లక్ష్యం వీడడంలేదు.
- తనిఖీలు చేస్తున్నా...తప్పించుకుంటూ..
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు, పోలీసులు పాఠశాలల బస్సుల తనిఖీలు చేస్తున్నారు. అయితే ముందుగానే సమాచారం తెలుసుకుంటున్న పాఠశాల యాజామాన్యాలు తప్పించుకుంటూ వాహనాలను ఇతర మార్గాల్లో వినియోగిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బస్సులను ఎటువంటి ఫిట్నెస్ లేకుండానే యథేచ్ఛగా తిప్పుతుండడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఇవీ నిబంధనలు....
వాహనాలకు ఫిట్నెస్ పరీక్ష చేయించాలనుకుంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు, డిజిగ్నేషన్, సెల్ నంబర్, బస్సు మోడల్, డ్రైవర్ వివరాలు, అటెండర్, ఫొటోలు, బస్సు నడిచే మార్గం, సీట్ల పరిమితి తదితర విషయాలను నమోదు చేయాలి. ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా వాహనంలో మెడికల్ కిట్లు, గాలి, వెలుతురు వచ్చేలా కిటికీలు, సీట్ల మధ్య రాడ్లు అమర్చి ఉండాలి. విద్యార్థులు బస్సులో ఎక్కేందుకు, దిగేందుకు అనుకూలంగా 325 మిల్లీమీటర్ల ఎత్తు ఉండేలా బస్సు మెట్లు ఉండాలి. ఆపద సమయంలో బయటకు దిగేందుకు అత్యవసర ద్వారం తప్పకుండా ఏర్పాటు చేసి ఉండాలి.
విద్యార్థులు బస్సు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు డ్రైవర్‌కు కనబడేలా రెండు వైపులా సైడ్ అద్దాలు, అన్ని కిటికీలను కలుపుతూ ఇనుప జాలి అమర్చి ఉండాలి. వాహనం టైర్లు, బ్రేకులు నాణ్యతతో ఉండేలా చూసుకోవాలి. బస్సుపై ఏ పాఠశాలకు చెందినదో తెలిపేలా పూర్తి వివరాలు రాసి ఉండాలి. పాఠశాల వాహనాలు నడిపే డ్రైవర్లకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. రాత్రివేళల్లో బస్సులను గుర్తుపట్టేలా నాలుగు వైపులా రేడియం స్టిక్కర్లను ఏర్పాటు చేయాలి.
ఫిట్ నెస్ లేకుంటే చర్యలు
- భద్రునాయక్, జిల్లా రవాణ శాఖాధికారి
అనుమతులు లేకుండా పాఠశాల యజమానులు స్కూల్ బస్‌లు నడిపితే చర్యలు తీసుకుంటాం. స్కూల్ యజమాన్యాలు వారి వాహనాలకు ఫిట్నెస్ చేయించుకోవాలి. అనుభవం ఉన్న వారిని డ్రైవర్‌గా నియమించుకోవాలి. నిబంధనలు పాటించకుంటే కేసులు నమోదు చేస్తాం. పాఠశాలలు పునః ప్రారంభించి బస్సులను రహదారులపైకి తీసుకవచ్చే లోపు ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలి.