రైతులకు సకాలంలో ఎరువులు అందించాలి
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:29 AM
రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, ఎవరైన రైతులు పాస్‌బుక్ తీసుకురాకుండా వస్తే సాగు ఎక్కడ చేస్తున్నారో వివరాలు తెలుసుకొని ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు.

సుల్తానాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, ఎవరైన రైతులు పాస్‌బుక్ తీసుకురాకుండా వస్తే సాగు ఎక్కడ చేస్తున్నారో వివరాలు తెలుసుకొని ఇవ్వాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన మండలంలో విస్తృతంగా పర్యటించారు. చిన్నకల్వలలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు, ఎంపియూపిఎస్, ప్యాక్స్ ఎరువుల గోడౌన్, నారాయణపూర్‌లోని ఎంపిపిఎస్, జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్ వాడి కేంద్రం, పట్టణంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి కనీస విద్యా ప్రమాణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నారాయణపూర్ పాఠశాలల వద్ద శిథిలావస్థలో ఉన్న భవనాల తొలగింపు చర్యలు తీసుకోవాలని సూచించారు. సుల్తానాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించి రాబోయే ఐదేళ్లకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. సుల్తానాబాద్ మండలంలో 526 ఇందిరమ్మ ఇండ్లు మంజూర య్యాయని, 94 ఇండ్లు బేస్మెంట్ వరకు పూర్తయ్యాయన్నారు. చిన్నకల్వలలో మంజూరైన 15 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని, లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైతే మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణాలు అందించాలని కలెక్టర్ తెలిపారు. సుల్తానాబాద్ ఆసుపత్రిలో పలు వార్డులను పరిశీలించారు. నెలకు 29 ప్రసవాలు జరుగుతున్నాయని, అదనపు సిబ్బంది, స్కాన్‌మిషన్ మంజూరు చేస్తామని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ బషీరుద్దిన్, మండల పంచాయతీ అధికారి సమీర్ రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి, పంచాయతీరాజ్ ఏఈ సచిన్, మండల విద్యాశాఖ అధికారి రాజయ్య , మండల వ్యవసాయ అధికారి నాగార్జున పాల్గొన్నారు. చిన్నకల్వల సింగిల్ విండో గోదాంను కలెక్టర్ తనిఖీ చేశారు. యూరియా బస్తాలు వివరాలను తెలుసుకున్నారు. సీఈవో వల్లకొండ రమేష్, ఏవో నాగార్జున పాల్గొన్నారు.