Share News

ఫే(క్‌)స్‌ గుర్తింపు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:49 AM

పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, డుమ్మాలకు చెక్‌ పెట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ యాప్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. సుమారు రెండు నెలలుగా జిల్లాలో ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ కొనసాగుతోంది.

 ఫే(క్‌)స్‌ గుర్తింపు

జగిత్యాల, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శులు సమయపాలనకు, డుమ్మాలకు చెక్‌ పెట్టేందుకు పంచాయతీరాజ్‌శాఖ ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ యాప్‌ను అమల్లోకి తీసుకువచ్చింది. సుమారు రెండు నెలలుగా జిల్లాలో ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ కొనసాగుతోంది. కార్యదర్శులు విధులు నిర్వర్తించే గ్రామంలో లొకేషన్‌కు వెళ్లి ఫొటో తీసి పంచాయతీ యాప్‌లో నమోదు చేసి అటెండెన్స్‌ వేసుకోవాలి. అయినా కొందరు పంచాయతీ కార్యదర్శులు ముఖ హాజరుతో మాయాజాలం చేస్తూ విధులకు ఎగనామం పెడుతున్నారు. లొకేషన్‌లో ఫొటో తీసినట్లు అటెండెన్స్‌ వేసుకుంటూ గ్రామపంచాయతీకి వెళ్లకుండానే సొంత కార్యకలాపాలను చక్క బెట్టుకుం టున్నారు. బుగ్గారం మండలంలోని చందయ్యపల్లి పంచాయతీ కార్యదర్శి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసి ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈయనతో పాటు జిల్లాలో మరో 24 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ఇచ్చినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి 25 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ వేశారు. ఇటీవల వారిని జిల్లాపంచాయతీ అధికారి గుర్తించారు. దీంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో అప్‌లోడ్‌ చేసిన చందయ్యపల్లి కార్యదర్శిని సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశించారు.

ఐ ఫోన్‌తో అటెండెన్స్‌ ట్యాంపరింగ్‌?

గ్రామ పంచాయతీల్లో పనిచేసే కొందరు కార్యదర్శులు ఐ ఫోన్‌ ద్వారా ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ట్యాంపరింగ్‌ చేస్తున్నట్లు అధికారులు పరిశీలనలో వెల్లడైనట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు పంచాయతీ కార్యదర్శులు గ్రామ పంచాయతీలకు ఎన్ని గంటలకు వెళ్లినా వారి వద్ద ఉన్న ఐ ఫోన్‌లో సమయం ఏ విధంగా నమోదు చేసుకొని ఉంటారో ఆ విధంగానే ఫేస్‌ అటెండెన్స్‌ తీసుకుంటుంది. ఉదాహరణకు ఒక పంచాయతీ కార్యదర్శి ఉదయం 10 గంటలకు పంచాయతీ కార్యలయానికి వెళ్లాల్సి ఉంటే ఆయన ఉదయం 11 గంటలకు వెళ్లి ఐఫోన్‌ ద్వారా ఫేస్‌ అటెండెన్స్‌ వేస్తే అందులో ఉదయం 10 గంటలకు ఉంటే అదే సమయంలో హాజరైనట్లు నమోదు అవుతుంది. ఈ విషయాన్ని పంచాయతీ శాఖ ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. తదనుగుణంగా జిల్లా వ్యాప్తంగా పరిశీలన చేసి ట్యాంపరింగ్‌ చేసిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ట్లు తెలిసింది.

డీపీవోలకు యాక్సెస్‌ లేకపోవడంతో...

జిల్లా వ్యాప్తంగా 385 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో 370 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. పలువురు పంచాయతీ కార్యదర్శులకు మరో గ్రామపంచాయతీ సైత ఇన్‌చార్జి కేటాయించారు. వీరు ప్రతీ రోజు ఉదయం 10 గంటల వరకు గ్రామ పంచాయతీకి చేరుకొని ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ ద్వారా అటెండెన్స్‌ను ఫోన్‌లో నమోదుచేయాలి. పలువురు పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మాలు కొట్టి... గ్రామ పంచాయతీ సిబ్బందికి యాప్‌ లాగిన్‌ను ఇచ్చి ఫొటోతో.. ఫోటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. సుమారు నెలరోజులుగా పలువురు ఇదే విధంగా హాజరు వేసుకుంటూ డుమ్మా కొడుతున్నారు. అటెండెన్స్‌ను తనిఖీ చేయడానికి డీపీవోలకు యాక్సెస్‌ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.

ఎంపీవోలు, డీపీవోలకు లాగిన్‌...

నాలుగు రోజుల క్రితం ఎంపీవోలు, డీపీవోలకు ప్రత్యేక లాగిన్‌ ఇచ్చారు. దీంతో యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న ఫొటో వ్యక్తిదేనా? నేరుగా దిగి అప్‌లోడ్‌ చేశారా.. ఫొటోను ఫొటో తీసి అప్‌లోడ్‌ చేశారా..? అని పరిశీలించాలని డీపీవోలను ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా డీపీవో నేతృత్వంలో జూలై 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అధికారులు పరిశీలన జరిపారు. జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ వేస్తున్నారని తేటతెల్లమైంది. తప్పుడు ఫొటోలు అప్‌లోడ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శులకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాలతో షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీంతో పాటు సాలరీ డిడక్ట్‌ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

కింది స్థాయి ఉద్యోగి నిర్వాకం వల్లే..

జిల్లాలోని బుగ్గారం మండలం చందయ్యపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన ఫేక్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ వ్యవహారంలో కిందిస్థాయి ఉద్యోగి నిర్వాకం వల్లే సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో అప్‌లోడ్‌ అయినట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. సదరు కార్యదర్శి సిరికొండ పంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యత లు నిర్వర్తిస్తున్నారు. అయితే అటెండెన్స్‌ కోసం తన మొబైల్‌ను ఓ కిందిస్థాయి ఉద్యోగికి ఇచ్చినట్లు ప్రచా రం జరుగుతోంది. సదరు కిందిస్థాయి ఉద్యోగి పంచా యతీ కార్యాలయంలో గల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ యాప్‌లో అప్‌లో డ్‌ చేసినట్లుగా జిల్లా పంచాయతీ కార్యాలయ అధికా రులు అనుమానిస్తున్నారు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి, లొకేషన్‌ రిజిస్ట్రర్‌ చేసిన మొబైల్‌ను కిందిస్థాయికి ఇవ్వ డంవల్లే సంఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

బయోమెట్రిక్‌ అటెండెన్స్‌ సైతం..

జిల్లాలోని బుగ్గారం మండలంలో చందయ్యపల్లి పంచాయతీలో చోటుచేసుకున్న సంఘటనను రాష్ట్ర పంచాయతీశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నా రు. ఈనేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌తో పాటు పంచాయతీ కార్యదర్శులు బయో మెట్రిక్‌ అటెండెన్స్‌ సైతం వేసేలా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా పంచా యతీ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయి తే పంచాయతీల్లో బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చే యడం, లేదా మొబైల్‌లో బయోమెట్రిక్‌ యాప్‌ను ఇన్‌ స్టాల్‌ చేయడం వంటి వాటిపై పరిశీలన చేస్తున్నారు.

సీఎంవో కార్యాలయ అధికారులు ఆరా..

జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చందయ్యపల్లి గ్రామపంచాయతీలో జరిగిన ఘటనపై సీఎంవో కార్యా లయ అధికారులు ఆరా తీస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ అటెండెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫొటోను అప్‌లోడ్‌ చేసిన వ్యవహారంపై సీఎంవో కార్యాలయ అధికారులు సీరియస్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది. సంఘట నకు గల కారణాలు, వ్యవహారంపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యలు, ఇతర వివరాలను సేకరించినట్లు సమాచారం. జిల్లా అధికారులను సంప్రందించి ఘటనపై ఆరా తీసి తీవ్రంగా పరిగణించినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

కార్యదర్శుల్లో ఆందోళన...

జిల్లాలో 25 మంది పంచాయతీ కార్యదర్శులు అటెండెన్స్‌ ట్యాంపరింగ్‌ చేసిన వారిలో ఉన్నారు. వీరిలో చందయ్యపల్లి కార్యదర్శి సైతం ఉన్నారు. వారందరికీ షోకాజ్‌ నోటీసులను ఉన్నతాధికారులు జారీ చేశారు. అయితే రాష్ట్ర స్థాయిలోనే ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ నమోదు అక్రమాలను గుర్తించడంతో పంచాయతీ కార్యదర్శుల్లో భయాందోళ నలు నెలకొన్నాయి. ఉన్నతాధికారులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందింస్తున్నట్లు సమాచారం.

Updated Date - Aug 02 , 2025 | 12:49 AM