పాఠశాలల్లో మొదలైన ఫేస్ రికగ్నిషన్
ABN , Publish Date - Aug 02 , 2025 | 12:42 AM
ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పక్కాగా ఉండే దిశగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ప్రవేశపెట్టింది.

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాష్ట్రంలో పారదర్శక పాలన అందించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించేలా చర్యలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు పక్కాగా ఉండే దిశగా ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నుంచి ప్రారంభమైన ఫేస్ రికగ్నిషన్ విధానంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి రోజు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడ్డారు. సర్వర్ డౌన్ ఉండడంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఫేస్ రికగ్నిషన్ కోసం ప్రయత్నాలు చేశారు. ఉపాధ్యాయులు సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించే విధంగా తీసుకొచ్చిన ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో జిల్లాలో అనేక స్కూల్లో ఉపాధ్యాయుల ఫేస్ రికగ్నిషన్‌లో ఇబ్బందులు పడ్డారు. సిరిసిల్లలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 31 మంది ఉండగా మధ్యాహ్నం వరకు 24 మంది ఉపాధ్యాయులు సిబ్బందికి సంబంధించి ఫేస్ రికగ్నిషన్ పూర్తి చేసుకోగలిగారు. ఎల్లారెడ్డిపేటలో ఒక పాఠశాలలో 19 మంది ఉండగా ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే రికగ్నిషన్ పూర్తి అయింది. ఇలా అనేక స్కూల్లో ఉపాధ్యాయులు రికగ్నిషన్ కోసం మధ్యాహ్నం వరకు ఫోన్లతోనే కుస్తీ పట్టారు. ఇప్పటికే 2023 సెప్టెంబర్ పాఠశాలలో విద్యార్థుల కోసం ఫేస్ రికగ్నిషన్ యాప్‌ను ఉపయోగిస్తున్న ప్రస్తుతం ఉపాధ్యాయులకు వర్తింపు చేయడంతో తొలి రోజు సాంకేతికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇలా..
ప్రభుత్వం పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు సమయపాలన ఉండే విధంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌ను ఉపాధ్యాయుడి స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తారు. మొదట యాప్‌లో సంబంధిత ఉపాధ్యాయుడి వివరాలతో రిజిస్టర్ చేసుకొని లాగిన్ కావలసి ఉంటుంది. యాప్ ఇన్‌స్టాలేషన్ సమయంలోనే సంబంధిత స్కూల్ ఆవరణ లాంగిట్యూడ్,లాటి ట్యూడ్‌లను అప్లోడ్ చేస్తారు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత నిరంతరం వినియోగించవచ్చు. ఉపాధ్యాయుడు వచ్చిన సమయంలో క్లాక్‌ఇన్ అనే ఆప్షన్ నొక్కితే ఆన్‌లైన్‌లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. అలాగే పాఠశాలలో పని సమయం ముగిసిన తర్వాత క్లాక్ అవుట్ అనే ఆప్షన్‌పై టచ్ చేస్తే ఉపాధ్యాయుడు పాఠశాల విడిచి వెళ్లే సమయాన్ని పనిచేసిన గంటలను లెక్కించి తిరిగి ఆన్‌లైన్‌లో పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. యాప్‌ను పకడ్బందీగా రూపొందించారు. ఉపాధ్యాయుడు ఎవరైనా నిర్దేశిత సమయానికి ఇంటి నుంచి గానీ మరేదైనా ప్రదేశం నుంచి యాప్‌ని ఓపెన్ చేస్తే సంబంధిత పర్యవేక్షణ అధికారికి స్కూల్ బయట ఉన్నారని సంక్షిప్త సందేశాన్ని కూడా ఇస్తుంది. క్లాక్ ఇన్, క్లాక్ అవుట్ అనే ఆప్షన్లు పాఠశాల ఆవరణలోనే యాప్‌లో పని చేస్తాయి.
జిల్లాలో 489 పాఠశాలలు...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 489 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 337 ప్రాథమిక పాఠశాలలు, 38 ప్రాథమికోన్నత పాఠశాలు, 114 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో 2073 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలో 31,536 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటివరకు పాఠశాలలో రిజిస్టర్ అటెండెన్స్ కొనసాగుతోంది. ఈ విధానం వల్ల ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోయినా, ఆలస్యంగా వచ్చిన రిజిస్టర్‌లో సంతకాలు చేసుకునే వారనే అపవాదు ఉండేది. కొత్తగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్‌తో ఆ పరిస్థితులు తొలగిపోనున్నాయి. యాప్ ద్వారా అటెండెన్స్ పారదర్శకంగా ఉండడమే కాకుండా ఆలస్యం అయితే ఆబ్సెంట్ కూడా పడుతుంది. దీంతో ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించక తప్పదు.
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ద్వారా మెరుగైన విద్యను అందించే దిశగా అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా పాఠశాల భవనాలకు రంగులు వేయడమే కాకుండా విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పించారు. దీంతోపాటు తొలిరోజే విద్యార్థులకు కావలసిన పుస్తకాలు యూనిఫామ్‌లను అందించారు. జిల్లాలో విద్యార్థులకు 2.70 లక్షల పుస్తకాలు, 307765 నోటు పుస్తకాలు అందించారు. ప్రత్యేకంగా అకడమిక్ క్యాలెండర్ కూడా విద్యా శాఖ అమలకు పూనుకుంది. కానీ పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్‌పై నిర్లక్ష్యమే చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. ప్రతి విద్యార్థితో 30 నిమిషాల పాటు చదివించడం చేయాలి. రీడింగ్ యాక్టివిటీస్ పాఠ్య పుస్తకాలతో పాటు దినపత్రికలు, కథల పుస్తకాలు చదివించాలి. ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. వీటిని చాలా పాఠశాలలు పాటించడం లేదని విమర్శలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఫేస్ రికగ్నిషన్ యాప్‌తో సకాలంలో పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో అకడమిక్ క్యాలెండర్ కూడా పాటిస్తారని భావిస్తున్నారు.