Share News

ఫసల్‌ బీమా.. ఈ‘సారీ’ లేనట్లేనా?

ABN , Publish Date - Jul 20 , 2025 | 12:59 AM

ప్రకృతి వైపరీత్యాలకు రైతులు నిండా మునుగుతున్నారు. రైతులకు కాస్తో కూస్తో ధీమా నిచ్చే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకం నాలుగేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఫసల్‌ బీమాను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయగా, బీమాను అమలుచేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే దారిలో విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి.

ఫసల్‌ బీమా.. ఈ‘సారీ’ లేనట్లేనా?

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ప్రకృతి వైపరీత్యాలకు రైతులు నిండా మునుగుతున్నారు. రైతులకు కాస్తో కూస్తో ధీమా నిచ్చే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) పథకం నాలుగేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఫసల్‌ బీమాను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయగా, బీమాను అమలుచేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే దారిలో విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు గత యాసంగిలోనే ఫసల్‌ బీమా వస్తుందని భావించినా నిరాశే మిగిలింది. ఈసారి వానాకాలం సీజన్‌లో చేస్తారని ప్రచారం జరిగినా అమల్లోకి వచ్చే సూచనలు కనిపించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వానాకాలం సీజన్‌ ఆలస్యం కావడంతో రైతులు బీమా వర్తింపచేయడం ఈసారి కూడా కష్టమే అవుతుందని తెలుస్తోంది. రాష్ట్రంలో 11 క్లస్టర్లుగా విభజించి అమలు చేయాలని బావించారు. కానీ ఆచరణకు రావడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.43 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.80 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రతి సీజన్‌లోనూ వడగండ్ల వర్షాలు, కుంభవృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. పంట చేతికి వచ్చే దశలో రైతులకు నష్టం కలగకుండా 2016లో ఫసల్‌ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకాన్ని 2020లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలిపివేసింది. బీమాపై అవగాహన లేకపోవడంతో రైతులు సద్వినియోగం చేసుకోలేదు. ఏప్రిల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంటల బీమా పథకానికి విధి విధానాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి కదలిక కనిపించడం లేదు.

బీమాతో రైతులకు ధీమా...

వానాకాలం, యాసంగి సీజన్లలో పంటలు వేసుకునే రైతులకు ఫసల్‌బీమా యోజన ధీమాగా ఉంటుంది. పంట నీటమునిగిన వడగండ్ల వాన, ఇసుక మేటలు వేసినా, తుఫాను ప్రభావంతో పంటలకు కలిగే నష్టాలకు బీమా వర్తిస్తుంది. బీమాకు సంబంధించి ప్రీమియంలో రైతు వాటా వానాకాలం సీజన్‌లో 2 శాతం, యాసంగిలో 1.5 శాతం, వాణిజ్య ఉద్యాన వన పంటలకు 5 శాతం ఉంటుంది. మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున భరిస్తాయి. ఇందులో రైతు వాటా ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. వానాకాలంలో ఐదు పంటలు, యాసంగిలో ఆరు పంటలకు వర్తించే యోచన కూడా చేశారు. వానాకాలంలో వరి, కందులు, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న, యాసంగిలో వరి, పప్పుదినుసులు, మొక్కజొన్న, వేరుశెనగ, మినుములు, జొన్న పంటలకు వర్తింపచేస్తారని రైతులు భావించారు. కానీ ఫసల్‌ బీమా యోజనపై మార్గదర్శకాలే జారీ కాలేదు. ఫసల్‌ బీమా యోజన అమలు జరిగితే 2.5 ఎకరాల పంట నష్టంలో 33 నుంచి 50 శాతం వాటిల్లితే వరికి రూ 1.05 లక్షలు, మొక్కజొన్న రూ 90 వేల పరిహారం అందుతుంది. జిల్లా, మండల, గ్రామాల యూనిట్‌లుగా పంటల బీమా వర్తిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 1.10 లక్షల మంది రైతులకు లబ్ధి

ఫసల్‌ బీమా యోజన అమలుచేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.10 లక్షల మంది రైతులతో పాటు 80 వేల మంది కౌలు రైతులకు కూడా ఉపయోగపడనుంది. జిల్లాలో పట్టాదారులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించే హామీలు ఇచ్చిన నేపథ్యంలో కౌలు రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జిల్లాలోని 13 మండలాలు, 171 రెవెన్యూ గ్రామాలు, 260 గ్రామపంచాయతీల పరిధిలో 83 వేల హెక్టార్‌లలో భూకమతాలు ఉన్నాయి. జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా 2.47 ఎకరాకలకు సంబంధించి 81,416 ఎకరాలు 75,931 మంది రైతుల వద్ద ఉంది. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధిచి 25,092 మంది రైతుల వద్ద 86,460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8,346 మంది రైతుల వద్ద 53,560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1,427 మంది రైతుల వద్ద 18,962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2,756 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో వానాకాలంలో 2.40 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.80 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి రెండు సీజన్‌లలోనూ 1.77 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఫసల్‌ బీమా యోజన అమలైతే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 2.43 ఎకరాల్లో వానకాలం సాగు

జిల్లాలో 2.43 లక్షల ఎకరాల సాగు అంచనాలో ఇప్పటి వరకు 1.16 లక్ష ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులతో వరి నాట్లు సగం కూడా పూర్తి కాలేదు. పత్తి సాగు మాత్రం ముందస్తుగానే విత్తనాలు వేసుకోవడంతో చివరి దశకు చేరుకుంది. జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43,783 వేల 766 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. ఇందులో గంభీరావుపేటలో 19,330 ఎకరాలు, ఇల్లంతకుంటలో 38,470 ఎకరాలు, ముస్తాబాద్‌లో 25,250 ఎకరాలు, సిరిసిల్లలో 5,853 ఎకరాలు, తంగళ్లపల్లిలో 22,031 ఎకరాలు, వీర్నపల్లిలో 8,792 ఎకరాలు, ఎల్లారెడ్డిపేటలో 21,130 ఎకరాలు, బోయినపల్లిలో 21,310 ఎకరాలు, చందుర్తిలో 21,610 ఎకరాలు, కోనరావుపేటలో 23,700 ఎకరాలు, రుద్రంగిలో 10105ఎకరాలు, వేములవాడలో 10578 ఎకరాలు, వేములవాడ రూరల్‌లో 15,614 ఎకరాల్లో పంటలు వేస్తున్నారు. వరి సాగు లక్షా 84 వేల 860 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటి వరకు వరి సాగు71,690 ఎకరాలు, మొక్కజొన్న 2,403 ఎకరాలు, పత్తి 41,840 ఎకరాలు, కందులు 391 ఎకరాలు, పెసర 15 ఎకరాలు, ఇతర పంటలు 16 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేశారు.

Updated Date - Jul 20 , 2025 | 12:59 AM