Share News

పత్తి పంట.. సీసీఐ తంటా

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:49 AM

మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర లభించేలా చూడాల్సిన సీసీఐ (కాటన కార్పొరేషన ఆఫ్‌ ఇండియా) ఆ కొనుగోళ్ల విషయంలో తిరకాసుపెడుతున్నది. ఎకరాకు ఎంత దిగుబడి వచ్చినా 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు మిగతా దిగబడిని ప్రైవేట్‌ వ్యాపారులకు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవలసిన దుస్థితిని కలిగిస్తున్నది.

పత్తి పంట.. సీసీఐ తంటా

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌ )

మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర లభించేలా చూడాల్సిన సీసీఐ (కాటన కార్పొరేషన ఆఫ్‌ ఇండియా) ఆ కొనుగోళ్ల విషయంలో తిరకాసుపెడుతున్నది. ఎకరాకు ఎంత దిగుబడి వచ్చినా 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో రైతులు మిగతా దిగబడిని ప్రైవేట్‌ వ్యాపారులకు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవలసిన దుస్థితిని కలిగిస్తున్నది. మద్దతుధర పెద్దగా లాభసాటిగా లేకున్నా కనీస తోడ్పాటుగానైనా ఉంటుందని, సీసీఐ కొనుగోలు చేస్తుండడంతో ప్రైవేట్‌ వ్యాపారులు మరికొంత ఎక్కువ ధర చెల్లించి పత్తి కొనుగోలు చేస్తారని ఆశించిన రైతులకు ఈ సీజనలో నిరాశే మిగులుతున్నది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని జిన్నింగ్‌ మిల్లుల యజమానులు తేమ పేరిట కొంత ధర తగ్గిస్తూ రంగు మారిందని మరికొంత కోత విధిస్తూ కనీస మద్దతు ధర కంటే వేయి నుంచి రెండు వేల రూపాయల తక్కువ ధర చెల్లిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు.

జిల్లాలో 50వేల ఎకరాల్లో పత్తి సాగు

జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజనలో రైతులు సుమారు 50వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఎకరానికి 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసి ఆ మేరకు పత్తి కొనుగోళ్ల కోసం జిన్నింగ్‌ మిల్లులను ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా 13 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 8 నుంచి 12శాతం తేమ ఉన్న పత్తికి క్వింటాల్‌కు 8,110 రూపాయల కనీస మద్దతు ధర చెల్లించి సీసీఐ కొనుగోలు చేపట్టింది. ప్రతి సంవత్సరం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను అక్టోబరు మొదటి వారంలోనే ప్రారంభిస్తుంది. ఈసారి వర్షాల కారణంగా ఈ కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అకాల వర్షాల కారణంగా పత్తిలో తేమశాతం ఎక్కువ ఉందని కొనుగోళ్లు ఆలస్యంగా ప్రారంభించారు. అంతేకాకుండా తేమ ఎక్కువ ఉన్న పత్తి రంగు మారుతుందని భావించి కొనుగోళ్లు ముమ్మరం చేయలేదు. సీసీఐ ఎకరాకు ఒక్కో రైతు నుంచి 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసేది. దీనితో సగటు దిగుబడి మొత్తం సీసీఐ కొనుగోలు చేసే నేపథ్యంలో రైతులు కనీస మద్దతు ధర పొందే అవకాశముండేది. ఈ సంవత్సరం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన తొలి రోజుల్లో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని కొనుగోలు చేసినా ఇప్పుడు తాజాగా 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసేందుకు సీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో రైతులు ఒక్కో ఎకరంలో పండిన పత్తి పంటను 3 నుంచి 5 క్వింటాళ్ళ మేరకు ప్రైవేట్‌ జిన్నింగ్‌ మిల్లుల యజమానులకు తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తోంది. దీంతో రైతులు ఎకరంపై 6 నుంచి 10వేల రూపాయల మేరకు నష్టపోతున్నారు.

తేమ శాతం రాక ఇబ్బందులు

కపాస్‌ కిసాన యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకొని రైతులు తమ పత్తిని తీసుకొని కొనుగోలు చేసే జిన్నింగ్‌ మిల్లుకు తీసుకొని వెళ్తుండగా తేమశాతం ఎక్కువ ఉందని దానిని కొనడానికి అంగీకరించక పోవడంతో విధిలేక వారికే తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తున్నది. చాలా మంది రైతులు యాప్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకునే అవకాశం లేక ఇదంతా సమస్య ఏమిటని ప్రైవేట్‌లోనే అమ్ముకుని నష్టపోతున్నారు. వ్యవసాయాధికారుల నిర్లక్ష్యం మూలంగా సాగు చేసిన పత్తి విస్తీర్ణం తక్కువ నమోదు కావడంతో ఎక్కువ పంట కొనుగోలు చేయడానికి సీసీఐ అంగీకరించకపోవడంతో రైతులు జిన్నింగ్‌ మిల్లులకు అమ్ముకుని నష్టపోతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాల్‌కు 8,110 రూపాయలు ఉండగా ప్రైవేట్‌లో 5,500 నుంచి 6,000 రూపాయల వరకు మాత్రమే చెల్లిస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుండగా జిన్నింగు మిల్లుల యజమానులు తమ సమస్యలు పరిష్కరించకపోతే సోమవారం నుంచి నిరవధికంగా పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తామని ప్రకటించారు. వీరు ఈ నెల 6 నుంచే కొనుగోళ్లు బంద్‌ చేస్తామని ప్రకటించినప్పటికీ మార్కెటింగ్‌ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ అందుబాటులో లేని కారణంగా సోమవారం వరకు వేచి చూస్తామని చెబుతున్నారు. దీంతో కొనుగోళ్లు నిలిచిపోతాయని రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:49 AM