నిర్మించారు.. నిర్లక్ష్యంగా వదిలేశారు
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:58 AM
నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఆరేళ్లు గడిచిపోయినా పేదలకు కేటాయించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చూపడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి.

కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకం పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఆరేళ్లు గడిచిపోయినా పేదలకు కేటాయించడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం చూపడంతో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కరీంనగర్ మండలం మొగ్దుంపూర్‌తో పాటు కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమైన ఆరెపల్లి, తీగలగుట్టపల్లిలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2018లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టింది, ఆరు కోట్ల వ్యయంతో ఒక్కో గ్రామంలో 40 డబుల్ బెడ్రూం ఇళ్ల చొప్పున 120 ఇళ్లను ఏడాదిలో నిర్మించారు. అనంతరం రెవెన్యూ అధికారులు 2021 సంవత్సరంలోనే మొగ్దుంపూర్, ఆరపెల్లిలో పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించగా తీగలగుట్టపల్లిలో స్వీకరించలేదు. రెండేళ్ల క్రితం మొగ్ధుంపూర్‌లో 40 మంది లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించిన అధికారులు ఆరెపల్లి, తీగలగుట్టపల్లిలో విస్మరించారు.
వృథాగా ప్రజాధనం
డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఆరేళ్ల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజాధనం వృథాగా మారింది. ఆరెపల్లి, తీగలగుట్టపల్లిలో ఇళ్ల మధ్య పిచ్చి మొక్కలు మొలిచాయి. గోడలకు పగుళ్లు వచ్చాయి. తలుపులు, కిటికీలు దొంగలపాలయ్యాయి. మరికొన్ని ఇళ్లకు తలుపులు, కిటికీలు విరిగిపోయి ఉన్నాయి. ఈ ఇళ్లు జంతువులకు, మద్యం ప్రియులకు అడ్డాగా మారాయి. మరో వైపు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. తీగలగుట్టపల్లిలోని ఇళ్లను పలుమార్లు పేదలు ఆక్రమించేందుకు ప్రయత్నించగా పోలీసులు, రెవెన్యూ అధికారులు గతంలో అడ్డుకున్నారు. ఇళ్లు నిర్మించి ఆరేళ్లు అవుతున్నా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో ప్రజల సొమ్ము వృథాగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇళ్లకు మరమ్మతులు చేసి ఇందిరమ్మ పథకంలో పేదలకు అందించాలని ప్రజలు కోరుతున్నారు.