Gachibowli: అది ప్రభుత్వ పోరంబోకు భూమి
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:41 AM
కంచ గచ్చిబౌలిలో ఉన్నది అటవీ భూమి కాదని, అది ప్రభుత్వ పోరంబోకు భూమి మాత్రమేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ అనుకూల ఐటీ పార్కు నిర్మించాలని భావించామని వివరించింది.

1955 నుంచి అనేక సంస్థలకు కేటాయించారు ఏనాడూ అటవీ భూమిగా నమోదు కాలేదు
165 చిన్న, మధ్యస్థాయి చెట్లనే తొలగించాం
భారీ యంత్రాలను వాడలేదు అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ ఐటీ పార్కు
జంతువులు, జలాశయాలను పరిరక్షిస్తూనే ఏర్పాటు చేస్తాం
నకిలీ వీడియోలతో దుష్ప్రచారం
వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోండి
సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): కంచ గచ్చిబౌలిలో ఉన్నది అటవీ భూమి కాదని, అది ప్రభుత్వ పోరంబోకు భూమి మాత్రమేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం నివేదించింది. అక్కడ 400 ఎకరాల్లో పర్యావరణ అనుకూల ఐటీ పార్కు నిర్మించాలని భావించామని వివరించింది. అక్కడి జంతువులు, జలాశయాలను పరిరక్షిస్తూనే ప్రాజెక్టును అమలు చేస్తామని తెలిపింది. కంచ గచ్చిబౌలికి సంబంధించి నకిలీ చిత్రాలు, వీడియోలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.
వర్సిటీ నుంచి జంతువులు, పక్షులు..
ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన 400 ఎకరాల భూమి కంచ గచ్చిబౌలి గ్రామంలో ఉన్న 2,374.02 ఎకరాల్లో భాగమని ప్రభుత్వం వివరించింది. 2003లో అప్పటి ప్రభుత్వం ఈ భూమిని క్రీడల కోచింగ్ అకాడమీ నెలకొల్పడం కోసం ఐఎంజీ భారత్ అకడమిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అమ్మిందని తెలిపింది. తర్వాత ఏడాదిలో ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం ఈ కేటాయింపును రద్దు చేసిందని వివరించింది. దీనిపై హైకోర్టులో విచారణ కొనసాగిందని, చివరికి 2024 మేలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపింది. ఈ క్రమంలో 2003 నుంచి 2024 మధ్య ఆ ప్రాంతంలో చెట్లు, పొదలు పెరిగాయని వెల్లడించింది. దానికి పక్కనే ఉన్న హెచ్‌సీయూలో భారీగా హరిత ప్రాంతం ఉందని, అందులో జింకలు, పక్షులు విహరించేవని పేర్కొంది. వర్సిటీ భూమికి, ప్రస్తుత భూమికి మధ్య కంచె లేకపోవడంతో జింకలు, నెమళ్లు, ఇతర పక్షులు అప్పుడప్పుడూ అటూ ఇటూ వచ్చేవని తెలిపింది. ఈ మొత్తం ప్రాంతంలో నాలుగు చెరువులను గుర్తించామని.. అందులో మూడు ప్రభుత్వానికి చెందిన 400 ఎకరాల్లో లేవని వివరించింది. మిగతా ఒక్క చిలుకల కుంట నైరుతి ప్రాంతంలో ఉందని, దాన్ని సురక్షితంగా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపింది.
కూల్చినవి చిన్న, మధ్యతరహా చెట్లే..
టీజీఐఐసీ అనుమతులు తీసుకుని 165 చిన్న, మధ్య తరహా చెట్లను భారీ యంత్రాలు ఉపయోగించకుండా కూల్చివేసిందని ప్రభుత్వం అఫిడవిట్‌లో వివరించింది. ఈ 400 ఎకరాల్లో పర్యావరణ అనుకూల ఐటీ పార్కును అభివృద్ధి చేయాలని భావించినట్టు తెలిపింది. భూమిని వివిధ పరిమాణాల్లో ప్లాట్లుగా విభజించి, ఐటీ సంబంధిత వాణిజ్య ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు తగిన డెవలపర్లను గుర్తించాలని అనుకున్నామని వెల్లడించింది. ప్రతీ ప్రాపర్టీ డెవలపర్ తమ ప్రాజెక్టుల కోసం పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంటుందని.. హరిత ప్రాంతం కోసం పలు ప్లాట్లను గుర్తించి అక్కడ ప్రభుత్వం చెట్లను నాటుతుందని వివరించింది.
కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబర్ 25లో భాగమైన ఈ 400 ఎకరాల భూమిని ఏనాడూ రికార్డుల్లో అటవీ భూమిగా గుర్తించలేదని.. ప్రభుత్వ పోరంబోకుగా మాత్రమే గుర్తించామని అఫిడవిట్‌లో తెలిపింది. 1975లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌కు, 1990లో ఎమ్మార్వో కార్యాలయానికి, 1991లో ఆర్టీసీ డిపోకు, నవోదయ స్కూలుకు, 1992లో బీఎ్‌సఎన్‌ఎల్‌కు, 1997లో విద్యుత్ సబ్ స్టేషన్‌కు, 2006లో ట్రిపుల్ ఐటీకి, 2017లో అప్రోచ్ రోడ్డుకు ఇదే ప్రాంతంలో అనుమతులు లభించాయని వివరించింది. అంతేగాకుండా ఒక క్రీడల సంస్థ స్టేడియంతోపాటు టీఎన్‌జీవో సహా ఇతర హౌసింగ్ సొసైటీలకు ఇక్కడే భూమి లభించిందని తెలిపింది. మొత్తం భూమి 1955, 1956 నుంచే కంచ పోరంబోకు సర్కారీ భూమిగా.. అంటే ప్రభుత్వ భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉందని గుర్తు చేసింది. అంతేగాక అనేక ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నందున దాన్ని అటవీ భూమిగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
నకిలీ చిత్రాలతో దుష్ప్రచారం.
పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని అఫిడవిట్‌లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతమంది టెక్నాలజీని దుర్వినియోగం చేసి నకిలీ చిత్రాలు, వీడియోల ద్వారా కంచ గచ్చిబౌలి భూములపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని వివరించింది. ఇందుకు తమవద్ద నిర్దిష్ట సాక్ష్యాలున్నాయని తెలిపింది.నకిలీ ఫొటోలు, వీడియోల సాక్ష్యాలను కోర్టుకు సమర్పించింది. వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అభ్యర్థించింది. ఇప్పటికే ఉన్న చెట్లను పరిరక్షిస్తున్నామని, ఏప్రిల్ 3 నాటి కోర్టు ఆదేశాల తర్వాత ఎలాంటి కార్యకలాపాలను అనుమతించడం లేదని తెలిపింది. ఈ అంశంలో కోర్టు ఆదేశాలను పాటిస్తామని తెలిపింది.