Share News

Ramchander Rao: కమలం కొత్త సారథి రాంచందర్‌రావు

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:22 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. ....

Ramchander Rao: కమలం కొత్త సారథి రాంచందర్‌రావు
N. Ramchander Rao

  • సంఘ్‌తో పాటు బీజేపీ సీనియర్ల మద్దతు

  • దాదాపు ఖరారైన పేరు.. రేపు ప్రకటన

  • అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ

  • ఏకగ్రీవం కావాలనుకుంటున్నా: కిషన్‌రెడ్డి

  • 10 రాష్ట్రాల్లో కొత్త చీఫ్‌ల కోసం కసరత్తు

  • వారంలో పూర్తి కానున్న ఎన్నికల ప్రక్రియ

  • ఆ వెంటనే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక?

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టడం సముచితమన్న అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, రాంచందర్‌ వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపినట్లు సమాచారం. మంగళవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు, పార్టీ ఎంపీ ఈటల రాజేందర్‌ పేరు కూడా తుది జాబితాలో ఉంది. బీసీ ఎంపీనే కొత్త అధ్యక్షుడు అవుతారన్న ప్రచారం ఒకవైపు సాగుతుండగా, మరోవైపు జాతీయ స్థాయి సమీకరణాల నేపథ్యంలో ఇతర సామాజిక వర్గానికి అధ్యక్ష కిరీటం దక్కవచ్చన్న ప్రచారం కూడా ఉంది.


తాము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తామని పార్టీ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా మరో సామాజిక వర్గం నేత ఉండాలన్న అభిప్రాయం తాజాగా తెరపైకి వచ్చింది. దీంతో, రాంచందర్‌రావు వైపు పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తుది జాబితాలో ఈటల, రాంచందర్‌రావు పేర్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయని.. చివరి నిమిషంలో ఏవైనా సమీకరణాలు మారితే తప్ప రాంచందర్‌రావుకే అధ్యక్ష పీఠం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో పాటు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పేరు కూడా ప్రచారంలోకి వచ్చినా.. తుది జాబితాలో వారి పేర్లు లేవని వివరించాయి. కాగా, బీజేపీ రాష్ట్ర శాఖ కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవం కావాలనే కోరుకుంటున్నానని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారని, మంగళవారం అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని చెప్పారు. నామినేషన్‌ ఒకటే దాఖలయ్యే అవకాశం ఉందా..? అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. చూద్దాం.. ఏమవుతుందో అని అన్నారు.


అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ..

బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఆదివారం నోటిఫికేషన్‌ జారీ అయింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. కాగా, అధ్యక్ష ఎన్నికకు సంబంధించి బీజేపీ సంస్థాగత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీ, ఇన్‌చార్జ్‌ అభయ్‌ పాటిల్‌ ఆదివారం పార్టీ సీనియర్‌ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

వీఐపీ ప్రెసిడెంట్‌ వద్దు: రాజాసింగ్‌

బీజేపీకి వీఐపీ ప్రెసిడెంట్‌ వద్దని ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. అన్నా అని కార్యకర్తలు ఆత్మీయంగా పిలుచుకునే నేత అధ్యక్షుడిగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కార్యకర్తల ఒత్తిడి మేరకు తాను కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. తాను అధ్యక్షుడిని కాకుండా చూసేందుకు పార్టీలో ఒక బృందం ఉందని అన్నారు. తాను అధ్యక్షుడినైతే పార్టీలో గో రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే యూపీ సీఎం యోగి తరహా పాలన ఉంటుందన్నారు.


ఇతర రాష్ట్రాలకూ కొత్త అధ్యక్షులు..

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ వేగం పుంజుకుంది. వారం పది రోజుల్లో దాదాపు 10 రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను ఎన్నుకునేందుకు అధినాయకత్వం కసరత్తులు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కొత్త అధ్యక్షులు రానున్నారు. ఇందులో కొన్ని రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్‌ రాగా, మరికొన్నింటికి రేపో మాపో ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది చివరిలో బిహార్‌, వచ్చే ఏడాది బెంగాల్‌, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అధ్యక్ష ఎన్నికను పూర్తి చేయాలని అధినాయకత్వం నిర్ణయానికి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెండింగ్‌ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలను వారంలోపు పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం ఆదేశించిందని ఆ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీవీఎన్‌ మాధవ్‌, సుజనాచౌదరి, విష్ణువర్దన్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరిని కొనసాగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది.

నడ్డా తర్వాత ఎవరు?

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం 2023 జనవరిలో ముగిసినప్పటికీ లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పొడిగిస్తూ వస్తున్నారు. బీజేపీ నియమావళి ప్రకారం సగానికిపైగా రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించిన తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 37 యూనిట్లలో 14 రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను నియమించింది. 19 రాష్ట్రాల పార్టీ చీఫ్‌లను ఎన్నుకున్న తర్వాత జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. జూలై రెండో వారంలో విదేశీ పర్యటనల నుంచి ప్రధాని మోదీ తిరిగొచ్చాక కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌ఎ్‌సఎ్‌సతో ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్లే ఎంపిక ఆలస్యమైందని పార్టీలోని ఒక వర్గం చెబుతుండగా.. వయస్సు, ప్రాంతం వంటి అంశాలతో పాటు బిహార్‌ ఎన్నికలకు సంబంధించిన లెక్కలు కూడా దీనికి కారణమని మరో వర్గం అంటోంది. అధ్యక్ష పదవికి వినిపిస్తున్న పేర్లలో ఎక్కువ కేంద్ర మంత్రులవే కావడంతో, మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Updated Date - Jun 30 , 2025 | 01:41 PM