Share News

Commission Report Reveals: కర్త కర్మ క్రియ కేసీఆరే

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:20 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత్ర కీలకమని జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని తెలిపింది.

Commission Report Reveals: కర్త కర్మ క్రియ కేసీఆరే

బ్యారేజీల నిర్మాణ నిర్ణయం, వైఫల్యానికి కారణం ఆయనే

  • పరీక్షలు జరపకుండా నిర్మాణం ‘బ్లండర్‌ మిస్టేక్‌’

  • కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు

  • ముందే నిర్ణయాలు తీసుకొని సీడబ్ల్యూసీ నివేదికను సాకుగా చూపించారు

  • హరీశ్‌రావు అడ్డగోలుగా ఆదేశాలు ఇచ్చారు

  • నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి

  • కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని

  • తెలిసినా ఆర్థిక మంత్రిగా ఈటల మౌనం వహించారు

  • స్మితా సబర్వాల్‌, ఎస్‌కే జోషి, మాజీ ఈఎన్‌సీలంతా బాధ్యులే!

  • జస్టిస్‌ పీసీ ఘోష్‌ సంచలన నివేదిక.. సీఎంకు అందజేత

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, వైఫల్యాల్లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాత్ర కీలకమని జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ తేల్చింది. ఈ విషయంలో ఆయన పాత్ర విస్మరించలేనిదని తెలిపింది. ఆయనతోపాటు ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అంతేకాకుండా.. అప్పటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌, ఈఎన్‌సీలుగా పనిచేసినవారు, మరికొందరు అధికారులను కూడా వైఫల్యాలకు బాధ్యులుగా పేర్కొంది. బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదమే తీసుకోలేదని తెలిపింది. బ్యారేజీలపై ముందుగానే నిర్ణయం తీసుకొని.. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదన్న సీడబ్ల్యూసీ నివేదికను కేవలం సాకుగా చూపించారని వెల్లడించింది. పైగా బ్యారేజీల నిర్మాణానికి ముందు భూ భౌతిక పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో జరపలేదని పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ జరిపిన కమిషన్‌ గురువారం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. దానిని శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తీసుకోలేదని, మంత్రివర్గ ఉపసంఘం వేసినా.. దీనికి, ఆ బ్యారేజీలకు సంబంధ మే లేదని పీసీ ఘోష్‌ కమిషన్‌ తేల్చింది. మంత్రివర్గ ఆమోదంతోనే బ్యారేజీలు నిర్మించినట్లు కమిషన్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ చెప్పగా.. అవన్నీ అవాస్తవాలేనని కమిషన్‌ నివేదికతో తేలింది. ఇక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కట్టకుండా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలన్న నిర్ణయానికి కర్మ, కర్త, క్రియ కేసీఆరేని కమిషన్‌ వెల్లడించింది.

15.jpg


అది ఒక సాకు మాత్రమే!

తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యతపై కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) నివేదికను ఒక సాకుగా మాత్రమే వాడుకున్నారని కమిషన్‌ తెలిపింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం ముందే తీసుకొని నీటి లభ్యత లేదని సాకుగా మాత్రమే చూపించారని తప్పుపట్టింది. ఏ బ్యారేజీలు/డ్యామ్‌లు కట్టాలన్నా విధిగా ఇన్వెస్టిగేషన్‌లు జరగాలని, జియో టెక్నికల్‌/జియో ఫిజికల్‌ పరీక్షలు చేయాలని పేర్కొంది. కానీ.. కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ఈ పరీక్షలను శాస్త్రీయ ప్రమాణాలతో చేయలేదని, కొన్నిచోట్ల పూర్తిస్థాయిలో కూడా జరపలేదని తెలిపింది. ఇలాంటి లోపాలతో బ్యారేజీలు నిర్మించడం ‘బ్లండర్‌ మిస్టేక్‌’ అని కమిషన్‌ వ్యాఖ్యానించింది. బ్యారేజీల నిర్మాణ క్రమంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిబంధనలేవీ పాటించకుండా అడ్డగోలుగా మౌఖిక ఆదేశాలు జారీ చేశారని కమిషన్‌ పేర్కొంది. ఆ ఆదేశాల అమలు కూడా బ్యారేజీల నిర్మాణాన్ని ప్రభావితం చేసిందని తెలిపింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగా లేకపోయినా.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తుందని తెలిసినా.. నాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ (2014 జూన్‌ 2 నుంచి 2018 దాకా) మౌనం వహించారని కమిషన్‌ తప్పుబట్టింది. ఇది నేరపూరిత నిర్లక్ష్యమే అవుతుందని వ్యాఖ్యానించింది. ఇక ప్రతి నిర్ణయంలోనూ, కాళేశ్వరంతో ముడిపడిన ప్రతి సమావేశంలోనూ ఆనాటి సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ పాత్ర ఉందని తెలిపింది. బ్యారేజీల నిర్మాణ నిర్ణయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా/ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శైలేంద్రకుమార్‌ జోషి (ఎస్‌కే జోషి) కూడా బాధ్యుడేనని పేర్కొంది.


నేరపూరిత నిర్లక్ష్యం!

‘‘బ్యారేజీల నిర్మాణం 2016లో చేపట్టగా.. 2019 మే నెలలో ప్రారంభించారు. అదే సంవత్సరం బ్యారేజీల్లో నీటిని నిల్వ చేశారు. ఆ ఏడాది నవంబరులో బ్యారేజీల గేట్లు మూయగానే వాటి దిగువ భాగంలో అప్రాన్లు దెబ్బతిని.. సిమెంట్‌ కాంక్రీట్‌ బ్లాకులు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహ ఉధృతిని సరిగా అంచనా వేయలేదు. ఇక బ్యారేజీల నుంచి దిగువకు వచ్చే నీటి శక్తిని నిర్వీర్యం చేసే విధంగా బ్యారేజీల దిగువ భాగంలో వ్యవస్థలను డిజైన్‌ చేయలేదు. దెబ్బతిన్న రక్షణ వ్యవస్థలను సరిచేయడానికి తగిన డిజైన్లు ఇవ్వాలని నిర్మాణ సంస్థ లేఖ రాసినా.. నాలుగేళ్లపాటు (2019 నవంబరు నుంచి 2023 అక్టోబరు 21న మేడిగడ్డ కుంగేదాకా) ఎటువంటి డిజైన్లు ఇవ్వకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమే. మెయింటెనెన్స్‌ పనులు కూడా చేయలేదు. బ్యారేజీలు పూర్తికాకుండానే పూర్తయినట్లు కంప్లీషన్‌ సర్టిఫికెట్లు జారీ చేశారు. బ్యారేజీల వైఫల్యానికి నాటి ఈఎన్‌సీలు సి.మురళీధర్‌, నల్లా వెంకటేశ్వర్లు, బి.హరిరామ్‌, రామగుండం సీఈ సుధాకర్‌రెడ్డి, పలువురు అధికారులు కారకులు’’అని కమిషన్‌ వివరించినట్లు తెలిసింది.


ఒక చోట ప్రతిపాదించి.. మరోచోట నిర్మాణం

అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాన్ని ఒకచోట ప్రతిపాదించి.. మరో చోటికి గుడ్డిగా తరలించారని కమిషన్‌ వెల్లడించింది. ఈ క్రమంలో భూ భౌతిక/సాంకేతిక పరీక్షలను సరిగా జరపలేదని తేల్చింది. బ్యారేజీల డిజైన్లు/డ్రాయింగ్‌లకు పరీక్షలే కీలకమని, కానీ.. వాటిని శాస్త్రీయ ప్రమాణాలతో చేయలేదని గుర్తు చేసింది. బ్యారేజీల వైఫల్యానికి డిజైన్ల లోపం, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ లోపం, నిర్మాణ లోపం, నాణ్యత లోపాలున్నాయని వివరించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం షీట్‌పైల్స్‌ వినియోగించాలని డిజైన్లు ఇవ్వగా.. సీకెంట్‌ పైల్స్‌ వినియోగించారని తెలిపింది. సీకెంట్‌ పైల్స్‌ అమరికలో లోపాలతో ఇసుక మైనింగ్‌ జరిగి.. బ్యారేజీ కుంగిపోయిందని వెల్లడించింది. దేశంలోని బ్యారేజీలన్నింటినీ నీటి మళ్లింపు కోసమే వినియోగిస్తారని, కాళేశ్వరంలో మాత్రం నీటిని నిల్వ చేశారని తప్పుబట్టింది. ఇది కూడా బ్యారేజీలు దెబ్బతినడానికి కారణమైందని పేర్కొంది. అయితే బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్‌దేనని, ఆయన అనుమతి లేకుండా బ్యారేజీల్లో నీటిని ఖాళీ చేసే అవకాశం కూడా లేదని వివరించింది. ‘‘కానీ, 2021లో జాతీయ ఆనకట్టల భద్రత చట్టం వచ్చిన తర్వాత ఈ బ్యారేజీల నివేదికలేవీ సిద్ధం చేయలేదు. నిర్మాణంలో భారతీయ ప్రమాణాల కోడ్‌ను పాటించలేదు. గేట్ల ఆపరేషన్‌ షెడ్యూల్‌ను అమలు చేయలేదు’’ అని కమిషన్‌ వెల్లడించినట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 09:37 AM