Kaleshwaram Project: మేడిగడ్డ ఏడో బ్లాక్‌లో రోజూ రీడింగ్
ABN , Publish Date - Jul 15 , 2025 | 04:10 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో ప్రతిరోజూ లెవల్స్ రీడింగ్ తీసుకుంటున్నారు. మిగతా బ్లాకుల్లో రెండు వారాలకు ఒకసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు.

రెండు వారాలకోసారి ఎన్‌డీఎ్‌సఏకు నివేదిక
కుంగిన బ్లాక్‌ను కాపాడుతోంది గ్రౌటింగే!
మహదేవపూర్ రూరల్, జూలై 14 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో ప్రతిరోజూ లెవల్స్ రీడింగ్ తీసుకుంటున్నారు. మిగతా బ్లాకుల్లో రెండు వారాలకు ఒకసారి రీడింగ్ నమోదు చేస్తున్నారు. ఈ రీడింగ్‌లన్నింటినీ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ)కి పంపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రోజువారీ రీడింగ్‌లో ఎలాంటి వ్యత్యాసాలు రావడం లేదని అంటున్నారు. అయితే బ్లాక్-7కు గ్రౌటింగ్ చేయడం వల్లే వరదలను తట్టుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రౌటింగ్ చేపట్టకపోతే ఆ బ్లాక్ మరింత కుంగుబాటుకు గురయ్యేదని అంటున్నారు.
బ్యారేజీ కుంగినప్పటి నుంచి రెండేళ్లలో లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లగా.. అందులో సగానికిపైగా వరద ఏడో బ్లాక్ మీదుగానే వెళ్లినప్పటికీ స్ట్రక్చర్‌లో ఏమాత్రం కదలిక లేకపోవడం గమనార్హం. 2023 అక్టోబరు 21న ఈ బ్లాక్ కుంగుబాటుకు గురికాగా.. ఆ మరుసటి రోజు నుంచే నిల్వ ఉన్న నీటితో పాటు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపిస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో 5657 టీఎంసీల నీరు దిగువకు వెళ్లగా.. సగానికిపైగా నీరు కుంగిన ఏడో బ్లాక్ మీదుగానే వెళ్లింది. ఎన్‌డీఎ్‌సఏ సూచనల మేరకు చేసిన గ్రౌటింగే దాని గట్టెక్కిచ్చిందని అంటున్నారు.