Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల నిర్ణయం కేసీఆర్‌దే!
ABN , Publish Date - Jun 18 , 2025 | 04:42 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం మంత్రివర్గం తీసుకోలేదని, ఆ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ స్థాయిలోనే తీసుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మంత్రివర్గం, ఉప సంఘానికి సంబంధం లేదు.. కేసీఆర్, హరీశ్, ఈటల చెప్పినవన్నీ కల్పితాలే
13న జస్టిస్ ఘోష్‌కు ఆధారాలు ఇచ్చిన ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలనే నిర్ణయం మంత్రివర్గం తీసుకోలేదని, ఆ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్ స్థాయిలోనే తీసుకున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల 11న హాజరైన మాజీ సీఎం కేసీఆర్.. బ్యారేజీల నిర్ణయం తానొక్కడిని తీసుకోలేదని, ఆ నిర్ణయం మొత్తం మంత్రివర్గానిదని చెప్పిన విషయం విదితమే. ఈ నెల 6న హాజరైన ఈటల రాజేందర్, 9న హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు బ్యారేజీలపై నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటల రాజేందర్ సభ్యులుగా వేసిన మంత్రి వర్గ ఉపసంఘం బ్యారేజీల నిర్మాణాలపై సిఫార్సు చేసిందని కూడా విచారణలో వీరంతా వివరించారు. అయితే అదంతా అవాస్తవమని తుమ్మల ఖండించారు. కాగా, ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి రూ.2,591 కోట్లతో పరిపాలనా అనుమతినివ్వాలని అప్పటి ఈఎన్‌సీ(ఇరిగేషన్) సి.మురళీధర్ 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దానికి అనుమతినిస్తూ సర్కారు 2016 మార్చి 1న జీవో.231 జారీ చేసింది. 14 రోజుల తర్వాత అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చైర్మన్‌గా, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావులను సభ్యులుగా నియమిస్తూ మార్చి 15న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జీవో.655 ఇచ్చారని ప్రభుత్వం కమిషన్‌కు గుర్తు చేసింది.
మంత్రివర్గ సమావేశం లేకుండానే నిర్ణయాలు..
కేసీఆర్, హరీశ్, ఈటల ఒకే వాదన వినిపించడంతో వాస్తవాలేంటో మరోమారు తెలుసుకోవాలని నిర్ణయించిన జస్టిస్ ఘోష్ ఈనెల 13న ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో అదే రోజు ఆ ముగ్గురు చెప్పినవన్నీ కల్పితాలే అని నిరూపించే పత్రాలన్నీ కమిషన్‌కు ప్రభుత్వం అందించింది. ఆయా పత్రాలతో పీసీ ఘోష్ అదే రోజు కోల్‌కతాకు వెళ్లిపోయారు. 2015 ఏప్రిల్ 2న మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించేందుకు అవసరమైన డీపీఆర్ తయారీ బాధ్యతలు
వ్యాప్కోస్‌కు అప్పగించడానికి అనుమతి కోరుతూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి చీఫ్ ఇంజనీర్ లేఖ రాయగా.. 2015 ఏప్రిల్ 13న డీపీఆర్ తయారీ బాధ్యతలు వ్యాప్కో్‌సకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలనే నిర్ణయాలకు అప్పటిదాకా ఏ మంత్రివర్గ సమావేశం జరగలేదని ప్రభుత్వం కమిషన్‌కు ఆధారాలతో వివరించింది. ఈ నిర్ణయాలన్నీ అప్పటి సీఎం కేసీఆర్ తీసుకున్నవేనని, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం వేసినా.. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధం లేదని, ఇతర ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ కోసం ఈ కమిటీ వేశారని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానం ప్రతులను కూడా కమిషన్‌కు ప్రభుత్వం అందించింది. సీఎం స్థాయిలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం కోసం నిర్ణయాలు తీసుకుని, ఆ ప్రాంతంలోనే బ్యారేజీలు కట్టడానికి అనువుగా డీపీఆర్ ఇవ్వాలని వ్యాప్కో్‌సను ప్రభుత్వం కోరిందని పేర్కొంది. బ్యారేజీలు ఎక్కడ కట్టాలనే నిర్ణయాన్ని వ్యాప్కోస్ తీసుకోలేదని, ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో కట్టడానికి అనుకూలంగా మాత్రమే వ్యాప్కోస్ డీపీఆర్ ఇచ్చిందని ప్రభుత్వం కమిషన్‌కు నివేదించింది. వాస్తవానికి ఈ పత్రాలన్నీ ఏడాది కిందటే కమిషన్ విచారణ ప్రారంభం కావడానికి ముందే ఇవ్వగా.. తాజాగా కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లు వాంగ్మూలాలు ఇచ్చిన నేపథ్యంలో మరోమారు పత్రాలను కమిషన్‌కు ఇచ్చారు. ఆధారాలన్నీ అందడంతో నివేదికకు తుదిరూపు ఇచ్చే పనిలో కమిషన్ ఉంది.
ఇవి కూడా చదవండి
సంచలనం.. షర్మిల కాల్స్ రికార్డ్.. అన్నకు సమాచారం
ఇది హేయమైన చర్య.. కేటీఆర్ సిగ్గుతో తలదించుకో: మహేష్ కుమార్
Read Latest Telangana News And Telugu News