Kaleshwaram Project: అన్నీ తానే.. అంతా తందానే!
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:59 AM
కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ మాత్రమే కాదు.. ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది.

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆరే
నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి. కానీ, పాలనలో, ప్లానింగ్‌లో, సాంకేతిక, ఆర్థిక క్రమశిక్షణలో సుస్పష్ట నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజా ధనం వృథా కావడానికి కారణమయ్యారు.
బ్యారేజీలను నీటిని మళ్లించడానికే కట్టాలి. నిల్వ చేయడానికి కాదు. కానీ, బ్యారేజీల్లో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. బ్యారేజీలు విఫలం కావడానికి ఇది ప్రధాన కారణం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ఎక్కడ కట్టాలో నిర్దేశించింది కేసీఆర్! బ్యారేజీలను ఎలా కట్టాలో చెప్పింది కేసీఆర్! వాటిని ఎప్పుడు పూర్తి చేయాలో.. ఎలా నిర్వహించాలో స్పష్టం చేసిందీ ఆయనే! అంతేనా.. ప్రాజెక్టు అంచనాలను మార్చిందీ.. కాంట్రాక్టులను సవరించిందీ ఆయనే! ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రతి చిన్న విషయంలోనూ ఆయన జోక్యం చేసుకోవడమే కాదు.. పనులు ఎలా చేయాలో నిర్దేశమూ ఇచ్చారు! మూడు బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలకు.. చివరికి అవి బీటలు వారి, కుంగిపోయి, విఫలం కావడానికి కారణం ఇదే!
.. కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ నివేదిక సారాంశమిదే!
బ్యారేజీలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా కట్టాలో ఆయనే చెప్పారు
నీటి నిల్వ నిర్ణయమూ ఆయనదే.. ఓఅండ్‌ఎం చేయించలేదు
అంచనాలు పెంచిందీ.. కాంట్రాక్టులను సవరించిందీ ఆయనే
బ్యారేజీలు కూలడానికి, అవకతవకలకు కారణం కేసీఆరే
బ్యారేజీలు ఎక్కడ కట్టాలన్నది కేసీఆర్, హరీశ్ సొంత నిర్ణయమే
వీళ్లు నిర్ణయం తీసుకుని, ఆ తర్వాత వ్యాప్కో్‌సకు బాధ్యతలు
హైపవర్ కమిటీ నిర్ణయాన్నీ తుంగలో తొక్కేశారు
భారీఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు
మేడిగడ్డ ఏడో బ్లాకు పునరుద్ధరణ బాధ్యత ఎల్ అండ్ టీదే
అన్నారం, సుందిళ్ల లోపాలు సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే
కమిషన్‌కు కేసీఆర్, హరీశ్ తప్పుడు సాక్ష్యాలిచ్చారు
నిగ్గుతేల్చిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంప్లీషన్, ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్ మాత్రమే కాదు.. ధరలు, కాంట్రాక్టుల సవరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని జస్టిస్ ఘోష్ కమిషన్ తేల్చింది. అధికారులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. రాజకీయ నాయకులు బాధ్యతా రహితంగా పని చేశారని తప్పుబట్టింది. అంతేనా.. నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీపైనా ఘాటుగానే స్పందించింది. మేడిగడ్డలోని ఏడో బ్లాకును ఆ సంస్థ సొంత ఖర్చులతో పునర్నిర్మించాలని తేల్చి చెప్పింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవలే తన నివేదికను ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కమిషన్ పలు అంశాలను ఎత్తిచూపింది. ప్రాజెక్టు నిర్మాణంలో పాలన పరమైన, ఆర్థిక అవకతవకలు జరిగాయని, నిర్మాణానికి సరైన ప్లానింగ్ లేదని, డిజైన్లోనూ లోపాలున్నాయని స్పష్టం చేసింది. నిర్మాణంలో లోపాలు ఉండడమే కాకుండా నిర్వహణ పూర్తిగా లోపించిందని తేల్చింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కిందిస్థాయి ఇంజనీర్ వరకూ ఎవరెవరు ఏ స్థాయిలో బాధ్యులో కూడా తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నారని, విధివిధానాలను తుంగలో తొక్కారని, ఫలితంగా భారీగా ప్రజాధనంతోపాటు బ్యారేజీలూ కుంగుబాటుకు గురయ్యాయని పేర్కొన్నారు.
కేసీఆర్, హరీశ్‌లదే నిర్ణయం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు నిర్మించాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, సాగునీటి శాఖ మంత్రి హరీశ్ రావు సొంతంగా తీసుకున్నారని, అది వారి వ్యక్తిగత నిర్ణయమని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి లాంఛనంగా ఎటువంటి నిర్ణయం లేదని స్పష్టం చేసింది. బ్యారేజీల నిర్మాణానికి 2016 జూలై/ఆగస్టులో నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగిందని, కానీ, వ్యాప్కో్‌సతో సంప్రదింపులు జరపకుండా 2016 అక్టోబరు 22న హైపవర్ కమిటీ నిర్ణయం పేరుతో బ్యారేజీల నిర్మాణ ప్రదేశాలను మార్చారని తెలిపింది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణ ప్రతిపాదనను నిపుణుల కమిటీ నిర్ద్వంద్వంగా తిరస్కరించిందని, ప్రత్యామ్నాయంగా వేమనపల్లిని సూచించిందని, కేసీఆర్, హరీశ్ రావులు ఉద్దేశపూర్వకంగానే దానిని పట్టించుకోలేదని, పూర్తిగా పక్కనపడేశారని తప్పుబట్టింది. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదనేది సాకుగా చూపారని, కానీ, ఆ వాదనలో నిజాయితీ, చిత్తశుద్ధి కనిపించడం లేదని పేర్కొంది. మూడు బ్యారేజీల నిర్మాణానికి ప్రాథమికంగా పాలనపరమైన అనుమతులు తీసుకున్నారని, ఇందుకు జీవోలు 231, 232, 233 జారీ చేశారని, కానీ, వాటిని క్యాబినెట్ ముందు ఉంచలేదని, మంత్రివర్గ ఆమోదం తీసుకోలేదని, ఇది ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ.71,436 కోట్లని ప్రధాన మంత్రికి 21.2.2016న అప్పటి సీఎం రాసిన లేఖలో పేర్కొన్నారని, విచిత్రం ఏమిటంటే, అప్పటికి వ్యాప్కోస్ తుది డీపీఆర్‌ను ప్రభుత్వానికి సమర్పించలేదని తప్పుబట్టింది. అలాగే, తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టు ప్రదేశాన్ని తరలించవద్దన్న నిపుణుల కమిటీ సూచనను అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదని, ఎటువంటి జవాబుదారీతనం లేకుండా అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, పాలన ప్రక్రియను తుంగలో తొక్కారని తప్పుబట్టింది. ఇక, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఆర్థికంగా సంరక్షించడంలో అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చిత్తశుద్ధి ప్రదర్శించలేదని నివేదిక తప్పుబట్టింది. ఆర్థిక జవాబుదారీతనం తన బాధ్యత కాదనుకున్నారని, ఆర్థిక శాఖ కూడా కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లిమిటెడ్ (కేఐపీసీఎల్)లో భాగమైనా, దానిని పూర్తిగా ఆ సంస్థ మీదకే తోసేశారని స్పష్టం చేసింది.
రెండుసార్లు అంచనాల సవరణ
బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ టర్న్‌కీ పద్ధతిలో జరగాలని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) సూచించగా.. గంపగుత్త (లంప్సమ్) పద్ధతిలో నిర్మాణ సంస్థలకు పనులు కట్టబెట్టారని నివేదిక తప్పుబట్టింది. ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచేశారని పేర్కొంది. తొలుత ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.38,500 కోట్లు కాగా.. ఆ తర్వాత దానిని రూ.71,436 కోట్లకు; చివరికి రూ.1,10,248.48 కోట్లకు పెంచేశారని పేర్కొంది. నిర్మాణ సంస్థలకు అనుచితంగా లబ్ధి చేకూర్చడానికి రెండు దఫాలుగా అంచనాలను సవరించారని తప్పుపట్టింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ స్థలాలను మార్చారని, ఆ పేరిట బ్యారేజీల పొడవు, ఫ్లడ్ బ్యాంకులు, డిజైన్లలో మార్పులు చేశారని నివేదిక పేర్కొంది. వాటిని అడ్డం పెట్టుకుని ప్రాజెక్టు వ్యయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేశారని తప్పుబట్టింది. నిర్మాణ సంస్థలకు అనుచితంగా లబ్ధి చేకూర్చడానికి దురుద్దేశంతోనే ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నారని, ప్రభుత్వ ఖజానా నుంచి నిధులను తప్పుదారి పట్టించారని తప్పుబట్టింది. మేడిగడ్డ నిర్మాణం పూర్తి కాకుండానే పూర్తయినట్లు నిర్మాణ సంస్థకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, బ్యారేజీల్లో లోపాలు బయటపడినా.. లీకేజీలు కనిపించినా పట్టించుకోకుండా వీటిని జారీ చేయడాన్ని నివేదిక తప్పుబట్టింది. నిజానికి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి జీవనాడి అని, కానీ, పాలనలో, ప్లానింగ్‌లో, సాంకేతిక, ఆర్థిక క్రమశిక్షణలో సుస్పష్ట నిర్లక్ష్యంతో భారీ ఎత్తున ప్రజా ధనం వృథా కావడానికి కారణమయ్యారని తప్పుబట్టింది. ఎవరికి వారు వ్యక్తిగత నిర్ణయాలకు తోడు రాజకీయ నాయకత్వం అనవసర జోక్యం ఇందుకు ప్రధాన కారణమని తప్పుబట్టింది.
బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయం కేసీఆర్‌దే
బ్యారేజీలను నీటిని మళ్లించడానికే కట్టాలని, నిల్వ చేయడానికి కాదని, కానీ, బ్యారేజీల్లో నిత్యం నీటిని పూర్తి సామర్థ్యంతో నిల్వ చేయాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, బ్యారేజీలు విఫలం కావడానికి ఇది ప్రధాన కారణమని నివేదిక తేల్చి చెప్పింది. బ్యారేజీలను 2019లో ప్రారంభించారని, మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు 2023 అక్టోబరు 21న కుంగిందని, ప్రారంభం నుంచి అప్పటి వరకూ వాటి నిర్వహణ (ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్) పనులు చేయలేదని నివేదిక తప్పుబట్టింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీలు బయటపడేదాకా ఈ పనులు చేయలేదని, వానాకాలానికి ముందు, తర్వాత బ్యారేజీలు ఏ విధంగా ఉన్నాయనే నివేదికలు కూడా సిద్ధం చేయలేదని తెలిపింది. బ్యారే జీల డిజైన్‌ను తేలియాడే విధంగా (పర్‌మియబుల్ ఫౌండేషన్)తో చేసి, వాటిని రిజర్వాయర్లుగా వినియోగించారని, నియమావళికి ఇది విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇక, బ్యాక్ వాటర్ అధ్యయనాలు, టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్‌లు, జీ-డీ కర్వ్‌లు, జియో ఫిజికల్ పరీక్షలేవీ చేయకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం చేపట్టారని తప్పుబట్టింది. బ్యారేజీల డిజైన్లు తయారు చేసే ముందు నమూనా అధ్యయనాలు జరగాల్సి ఉందని, కానీ, అవేవీ చేయకుండానే డిజైన్లు చేశారని పేర్కొంది. నిర్మాణంలో నాణ్యత లోపించిందని, థర్డ్ పార్టీతో పరిశీలన చేయించలేదని పేర్కొంది. ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత 2019లో తొలిసారి వరదలు వచ్చాయని, అదే ఏడాది నవంబరులో గేట్లు మూశారని, అప్పుడు దిగువ భాగం (డౌన్ స్ట్రీమ్)లో రక్షణ వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఆఫ్రాన్లు దెబ్బతినడం, సిమెంట్ కాంక్రీట్ బ్లాకులు చెల్లాచెదురయ్యాయని, నాలుగేళ్లపాటు ఓ అండ్ ఎం పనులు చేయకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం వరదకు ముందు, తర్వాత బ్యారేజీల పరిస్థితిపై నివేదికలు సమర్పించాల్సి ఉంటుందని, వాటిని తెప్పించుకునే బాధ్యత ఈఎన్‌సీ (ఓ అండ్ ఎం- డ్యామ్ సేఫ్టీ )దేనని, ఆయన ఈ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేదని తప్పుబట్టింది. మేడిగడ్డ నిర్మాణ సంస్థతో అధికారులు కుమ్మక్కై భారీ మొత్తంలో ప్రజాధనం దోచుకోవడానికి దురుద్దేశపూర్వకంగా వ్యవహరించారని కమిషన్ తప్పుపట్టింది. బ్యారేజీలపై వ్యాప్కోస్ నివేదికను పక్కనపెట్టినందున.. ఆ సంస్థకు చెల్లించిన రూ.6.77 కోట్లను బాధ్యులైన అధికారుల నుంచి రికవరీ చేయాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ లోపాలు సరిచేయడం, మరమ్మతులు చేయాల్సిన బాధ్యత నిర్మాణ సంస్థలదేనని తేల్చిచెప్పింది.
కమిషన్ ముందు తప్పుడు సాక్ష్యాలు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో బ్యారేజీలు కట్టాలని తొలుత నిర్ణయం తీసుకున్నాకే.. ఆయా చోట్ల బ్యారేజీలు కట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసే బాధ్యతను వ్యాప్కో్‌సకు అప్పగించారని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ధారించింది. వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా బ్యారేజీలు కట్టామని కేసీఆర్, హరీశ్ రావు కమిషన్ ముందు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారని పేర్కొంది.
త్రిసభ్య కమిటీతో నేడు మంత్రి సమీక్ష
కాళేశ్వరం బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికపై అధ్యయనం చేసి, నివేదిక సారాంశం (జిస్ట్)ను సిద్ధం చేయడానికి వీలుగా వేసిన త్రిసభ్య కమిటీతో ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు సచివాలయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం కానున్నారు. నీటి పారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముఖ్య కార్యదర్శి నవీన్‌మిట్టల్, న్యాయ శాఖ కార్యద ర్శి రెండ్ల తిరుపతి సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం విదితమే. ఈ కమిటీ నివేదిక ను అసాంతం పరిశీలించి... సారాంశం (జిస్ట్) సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించగా శనివారం కమిటీ సమావేశమై ముసాయిదాను తయారు చేసింది.
నివేదికపై రేపే క్యాబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 4న జరగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలోని ఆరో అంతస్తులో గల క్యాబినెట్ మీటింగ్ హాల్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. అందువల్ల అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రూపొందించిన నివేదికను రెండు రోజుల క్రితం జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వానికి అందజేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికలోని అంశాలను రాష్ట్ర మంత్రిమండలి కూలంకుషంగా చర్చించనుంది. తదుపరి దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశముంది. నివేదికపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై అసెంబ్లీలో చర్చించి, ఆమోదం పొందవచ్చని తెలుస్తోంది. ఈ నివేదికతో పాటు ఇతర అంశాలూ క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్నాయని సమాచారం.
అధికారుల తప్పిదాలివే..
ఎస్‌కే జోషి, అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టవద్దన్న నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టడంలో ఈయన పాత్ర ఉంది. అనుమతుల్లోనూ నిబంధనలు పాటించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యంలో ఈయనకు బాధ్యత ఉంది.
స్మితా సబర్వాల్
నాటి సీఎం అదనపు కార్యదర్శి
కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన ఫైళ్లను మంత్రివర్గం ముందు ఉంచకుండా నిబంధనల్ని ఉల్లంఘించారు. తన విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అశ్రద్ధ, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారు.
సి.మురళీధర్, నాటి ఈఎన్‌సీ
నిపుణుల నివేదికను తొక్కి పెట్టడంలో, కేంద్ర జలవనరుల సంఘానికి తప్పుడు సమాచారం అందించడంలో ఈయన పాత్ర ఉంది. దురుద్దేశంతో సవరించిన అంచనాలను ప్రతిపాదించడంలో, నిర్వహణలో వైఫల్యానికి బాధ్యులు.
బి.హరిరామ్, నాటి సీఈ
నిపుణుల నివేదికను తొక్కిపెట్టడంలో బాధ్యుడు. సీడబ్య్లూసీకి తప్పుడు సమాచారం అందించడంలోనూ ఈయన పాత్ర ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎండీగా ఉన్నప్పటికీ.. బ్యారేజీల గురించి తనకు తెలియదని చెప్పారు.
ఎన్.వెంకటేశ్వర్లు, కె.సుధాకర్‌రెడ్డి, ఓంకార్‌సింగ్
నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నిజాయితీగా పనిచేయకపోవడంతోపాటు విచారణ కమిషన్ ఎదుట తప్పుడు సాక్ష్యాలు చెప్పారు. హరిరామ్, నరేందర్‌రెడ్డి, కేఎ్‌సఎస్ చంద్రశేఖర్, బసవరాజు, టి.శ్రీనివాస్, ఓంకార్ సింగ్‌లను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలి.