Share News

Telangana High Court Chief Justice: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఏకే సింగ్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 02:10 AM

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

Telangana High Court Chief Justice: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఏకే సింగ్‌
Telangana High Court Chief Justice

  • గవర్నర్‌ సమక్షంలో దైవసాక్షిగా ప్రమాణ స్వీకారంసీఎం రేవంత్‌, పలువురు మంత్రులు హాజరు

హైదరాబాద్‌, జూలై 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ జస్టిస్‌ అపరేశ్‌తో ప్రమాణం చేయించారు. జస్టిస్‌ ఏకే సింగ్‌ దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అనంతరం గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు హైకోర్టు సీజేకు పుష్పగుచ్ఛాలిచ్చి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసన సభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌, డీజీపీ జితేందర్‌, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, హైకోర్టు న్యాయమూర్తులు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జస్టిస్‌ సింగ్‌ త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి, బదిలీ మీద తెలంగాణకు వచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన తెలంగాణ హైకోర్టుకు ఏడో ప్రధాన న్యాయమూర్తి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ సుజోయ్‌ పాల్‌ ఇటీవల బదిలీల్లో కలకత్తా హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందిన జస్టిస్‌ ఏకే సింగ్‌ 1965లో జన్మించారు. ఆయన దశాబ్ధం పాటు 1990 నుంచి 2000 వరకు ఉత్తరప్రదేశ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత 2001 నుంచి జార్ఖండ్‌ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తూ 2012లో జార్ఖండ్‌ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2022 నుంచి 2023 వరకు జార్ఖండ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. పదోన్నతిపై త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 2023 ఏప్రిల్‌ 17న వచ్చారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 02:10 AM