Share News

ఐటీ బ్రదర్‌.. ఫ్యాటీ లివర్‌!

ABN , Publish Date - Feb 26 , 2025 | 03:54 AM

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారిలో కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 54 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తుండగా.. వారిలో 84 శాతం మందికి పైగా ఫ్యాటీ లివర్‌ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

ఐటీ బ్రదర్‌.. ఫ్యాటీ లివర్‌!

  • దేశంలోని 84% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్‌ బాధితులే

  • ఏఐజీ వైద్యులు, హెచ్‌సీయూ రిసెర్చ్‌ స్కాలర్ల అధ్యయనంలో వెల్లడి

  • చిరుతిండ్లు, నిద్రలేమి, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న వారిలో కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 54 లక్షల మంది ఐటీ రంగంలో పని చేస్తుండగా.. వారిలో 84 శాతం మందికి పైగా ఫ్యాటీ లివర్‌ సహా పలు కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. 71 శాతం మంది ఐటీ ఉద్యోగుల్లో ఊబకాయం సమస్య ఉండగా, వీరిలో 34 శాతం మంది జీవక్రియ సిండ్రోమ్‌తో సతమతమవుతున్నట్లు తేలింది. ఈ పరిణామాలు ఫ్యాటీ లివర్‌, అధిక రక్తపోటు, మధుమేహం వంటి ప్రమాదకర పరిస్థితులకు ఆస్కారమిస్తాయి. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రి హెపటాలజిస్ట్‌ డాక్టర్‌ పీఎన్‌ రావు బృందం, హెచ్‌సీయూ రిసెర్చ్‌ స్కాలర్ల బృందం సంయుక్తంగా చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం దేశ వ్యాప్తంగా 758 మంది ఐటీ ఉద్యోగులను ఎంపిక చేయగా.. వారిలో 363 మంది పరిశోధకులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.


345 మంది కాలేయ ఆరోగ్యం తెలుసుకునేందుకు అవసరమైన వివిధ వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కూడా ముందుకొచ్చారు. కాగా, జీవక్రియపై ఒత్తిడి కారణంగా కాలేయంలో ఐదు శాతం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోయినప్పుడు అది ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. అధిక పని గంటలు, ఒత్తిడి, రకరకాల పని వేళలు, ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోని ఉండడం వంటివి కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. అంతేకాక, నిద్రలేమి, అనారోగ్యకరమైన చిరుతిళ్లు, శారీరక శ్రమ లేకపోవడం కూడా సమస్యకు కారణాలని పేర్కొన్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్యను గుర్తించకపోతే అది తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుందని, కాలేయ మార్పిడి దాకా వెళ్లే ముప్పు ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఐటీ సంస్థలే తమ ఉద్యోగుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ అధ్యయనంలో హెచ్‌సీయూ స్కూల్‌ ఆఫ్‌ మెడిసన్‌ ప్రొఫెసర్లు కల్యాణ్కర్‌ మహదేవ్‌, అనిత, రీసెర్చ్‌ స్కాలర్లు బారం భార్గవ, నందితా ప్రమోద్‌ పాల్గొన్నారు. తమ అధ్యయనాన్ని పీర్‌ రివ్యూడ్‌ జన్నల్‌లో ప్రచురించేందుకు నేచర్‌ పబ్లిషర్స్‌ నుంచి ఆమోదం లభించిందని ప్రొఫెసర్‌ కల్యాణ్కర్‌ మహదేవ్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - Feb 26 , 2025 | 03:54 AM