Share News

Personalized Chef: జిహ్వకో రుచి.. మనిషికో షెఫ్‌

ABN , Publish Date - Aug 04 , 2025 | 05:41 AM

ఓ సుప్రసిద్ధ నిర్మాత తన కుమారుడిని హీరోగా పెట్టి వచ్చే సంవత్సరం ఓ సినిమా తీయబోతున్నారు. సిక్స్‌ ప్యాక్‌ కోసం న్యూట్రిషియన్లు డైట్‌ చార్ట్‌ ఇచ్చారు.

Personalized Chef: జిహ్వకో రుచి.. మనిషికో షెఫ్‌

సంపన్న వర్గాల ఇళ్లల్లో నయా ట్రెండ్‌.. పర్సనలైజ్డ్‌ షెఫ్‌.. ఇళ్లకు వచ్చి వండుతున్న ‘స్టార్‌’ హోటల్‌ షెఫ్‌లు

  • విభిన్న అవసరాలకు తగినట్లుగా మెనూల రూపకల్పన

  • డైటీషియన్‌, వైద్యుల సూచనలతో ప్రత్యేక వంటకాలు

  • ఒక్కో షెఫ్‌కు నెలకు రూ.3 లక్షల పైనే ఖర్చు

  • ఎగువ మధ్యతరగతి ఇళ్లల్లో వేడుకల్లోనూ షెఫ్‌ల సేవలు

  • ప్లేటుకు రూ.4,500 నుంచి రూ.7,500 దాకా వసూలు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఓ సుప్రసిద్ధ నిర్మాత తన కుమారుడిని హీరోగా పెట్టి వచ్చే సంవత్సరం ఓ సినిమా తీయబోతున్నారు. సిక్స్‌ ప్యాక్‌ కోసం న్యూట్రిషియన్లు డైట్‌ చార్ట్‌ ఇచ్చారు. కానీ, తమ ఇంట్లో వంటకాలతో ఆ డైట్‌ సాధ్యమయ్యేలా అనిపించలేదు. ఏం చేయాలి.. ఆ డైట్‌ను వండిపెట్టడానికి సుప్రసిద్ధ షెఫ్‌ను నియమించుకున్నారు. హైదరాబాద్‌లో సుప్రసిద్ధ రియల్టర్‌ ఆయన. త్వరలోనే పిల్లలను కనాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటి నుంచే తాము తీసుకునే ఆహారపరంగా పూర్తి శ్రద్ధ కనబరిచే క్రమంలో ఓ షెఫ్‌ను నియమించుకున్నారు. ఉదయం అల్పాహారం మొదలు రాత్రి డిన్నర్‌ వరకూ ఆ షెఫ్‌ నిపుణులు సూచించిన వంటలు చేస్తాడు. గతంలో ఓ స్టార్‌ హోటల్‌లో పనిచేసిన ఆ షెఫ్‌.. ఇప్పుడు పూర్తి సమయం ఈ రియల్టర్‌ ఇంట్లోనే ఉంటున్నారు.


అత్యంత సంపన్న వర్గాల ఇళ్లల్లో ఇటీవలి కాలంలో ‘పర్సనలైజ్డ్‌ షెఫ్‌’ల ట్రెండ్‌ పెరుగుతోంది. ఒకప్పుడు మా వంటతను/వంటామె అని చెప్పడం కనిపించేది. ‘మా పర్సనల్‌ షెఫ్‌’ అని సగర్వంగా పరిచయం చేస్తుండటం ధనవంతుల్లో ఇప్పుడు కనిపిస్తున్న నయా ధోరణి. కోరుకున్నదే తడవుగా ఇండియన్‌, ఇటాలియన్‌, చైనీస్‌, కాంటినెంటల్‌ రుచులతో ఆహారాన్ని వండి వడ్డించే ఈ షెఫ్‌లు, వ్యక్తుల ఆరోగ్య అవసరాలకు తగినట్లుగా ప్రత్యేకమైన మెనూలను సృష్టిస్తున్నారు. హోమ్‌ షెఫ్‌, పర్సనలైజ్డ్‌ షెఫ్‌ల ధోరణి హైదరాబాద్‌లో క్రమేపీ విస్తరిస్తోంది. అప్పుడప్పుడు షెఫ్‌ల సేవలను వినియోగించుకుని ఆనందపడిపోయే వారు మాత్రమే కాదు, తమ వ్యక్తిగత అవసరాల కోసం ఆ షెఫ్‌లను తమ ఇంటిలో ఒక సభ్యునిగా మార్చుకుంటున్నవారూ ఎక్కువగానే కనబడుతున్నారు. ఈ షెఫ్‌ల సేవలను నిబద్ధతతో అందించేందుకంటూ ప్రత్యేకంగా కన్సల్టెన్సీలూ హైదరాబాద్‌లో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ తరహా సేవలను అందిస్తున్న కలినరీ లాంజ్‌ సీఈవో గోపి బైలుప్పల మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో తాము అత్యంత సంపన్న వర్గానికి చెందిన 50కి పైగా కుటుంబాలకు సేవలనందిస్తున్నామన్నారు. ‘‘ఓ షెఫ్‌ కావాలని ఎవరైనా అడిగితే మేము ముందుగా వారి అవసరాలను చూస్తాము. వారికి ఎలాంటి అలెర్జీలు ఉన్నాయో తెలుసుకుంటాము. వైద్యుల నివేదికలు, డైటీషియన్‌ సలహాలు తీసుకుంటాము. అవన్నీ పరిశీలించి వారి కోసం ప్రత్యేక మెనూను రూపొందిస్తాం’’ అని చెప్పారు. పిల్లలను ప్లాన్‌ చేసుకుంటున్నామనే వారు అది చెబితే, దానికి తగినట్లుగా మెనూ అందించడమూ తమ సేవలలో భాగమేనని తెలిపారు. కొవిడ్‌ తర్వాత ఆహార అలవాట్లపై శ్రద్ధ పెరిగిందని, తద్వారా ఈ తరహా సేవలకు డిమాండ్‌ పెరిగిందని గోపి వివరించారు.


వేడుకల్లోనూ షెఫ్‌ల సేవలు

ఓ పర్సనలైజ్డ్‌ ఫెఫ్‌కు కనీసం నెలకు రూ.3లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. వంటకు ఉపయోగించే వస్తువులు, పదార్థాలకు అదనంగా చెల్లించాలి. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ జరిగినా, లేదంటే కుటుంబసభ్యులతో వేరే ప్రాంతాలకు వెళ్లి అక్కడ వంట చేయాల్సి వచ్చినా అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అయితే, అంత మొత్తం చెల్లించి షెఫ్‌లను నియమించుకోలేం అనుకునే ఎగుమతి మధ్య తరగతి వాళ్లు, తమ ఇళ్లల్లో ఏదైనా బర్త్‌డే, మ్యారేజ్‌ డే లాంటి వేడుకలు జరిగినప్పుడు షెఫ్‌లతో వైవిధ్యమైన వంటలు చేయించుకుంటున్నారు. షెఫ్‌లు 20-30 మంది కోసం వంట చేస్తారు. వంటల్లో వాడే ఆహార పదార్థాలను దాదాపుగా వారే తీసుకువస్తారు. ఇందుకోసం ప్లేట్‌కు రూ.4,500 నుంచి రూ.7,500వరకు చెల్లించాల్సి ఉంటుందని షెఫ్‌లను సరఫరా చేసే సంస్థలు చెప్తున్నాయి. ఇటీవల ఇలాంటి సేవలను అడుగుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొన్నాయి.

వంటవాళ్లకు.. షెఫ్‌లకు చాలా తేడా ఉంది

‘‘చాలామందికి పర్సనలైజ్డ్‌ షెఫ్‌ అనే భావనే కొత్తగా ఉంటుంది. ఇప్పటికీ వంట చేస్తే వంటోడే అంతే! కానీ, వారికి, పర్సనలైజ్డ్‌ షెఫ్‌లకు చాలా తేడా ఉంటుంది. ఆహార తయారీ, వ్యక్తిగతమైన మెనూలు, ప్లేట్‌ అలంకరణ వీటన్నింటిల్లో వైవిధ్యం కనిపిస్తుంది. దాన్ని గుర్తించగలిగినవాళ్లకే మేం సేవలనందిస్తుంటాం’’ అని షెఫ్‌ వికాస్‌ చెప్పారు. ‘‘కొంతమంది సినీతారలతో పాటుగా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లలో వంటవాళ్లున్నారు. వారు తమకు తోచిన, లేదంటే ఇంటి యజమాని చెప్పిన వంట చేసేస్తుంటారు. అయితే ఇంటిల్లిపాదికీ ఆ వంట నచ్చాలని లేదు. ఇలాంటి వారిప్పుడు పర్సనలైజ్డ్‌ షెఫ్‌ల వైపు చూస్తున్నారు’’ అని వివరించారు.


షెఫ్‌ సేవలు ప్రీమియం కాదు.. లగ్జరీ!

పర్సనలైజ్డ్‌ షెఫ్‌ సేవలు ప్రీమియం కాదు.. లగ్జరీనే. షెఫ్‌లను పనివాళ్లలా చూస్తామంటే కుదరదు. వారూ మన ఇంటిలోని మనిషే అన్నట్లుగా ఉండాలి. షెఫ్‌లు ఎక్కడికి పడితే అక్కడికి, ఎవరికి పడితే వారికి వచ్చి వంట చేయరు. తాము తమ ప్రొఫైల్‌లో ఫలానా వారికి వండామని చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అలాంటి వారికే తమ సేవలను అందించడానికి ప్రయత్నిస్తారు. పారిశ్రామిక వేత్తలు, సినీతారలు, రియల్టర్లు లాంటి వారితో పాటుగా కఠినమైన డైట్‌ అనుసరించే వారికి షెఫ్‌ల అవసరం పడుతుంది. ఇటీవలనే ఓ క్లయింట్‌ గర్భవతి అయితే ఆదిలాబాద్‌ నుంచి గిరిజన షెఫ్‌లను తీసుకువచ్చి మహువా(ఇప్పపువ్వు) లాంటివి అందించాం. మహువాతో సత్తువ రావడంతో పాటు కాళ్ల నొప్పులు లాంటివి తగ్గుతాయి. మా షెఫ్‌లలో గ్రామీణ రుచులను అందించే వారి నుంచి బ్యాంకాంక్‌లో మిష్లిన్‌ షెఫ్‌ల వరకూ ఉన్నారు.

- గోపి బైలుప్పల, సీఈవో, కలినరీ లాంజ్‌


ఈ వార్తలు కూడా చదవండి..

టాలీవుడ్‌లో షూటింగ్స్ బంద్..

కాళేశ్వరం కమిషన్ నివేదికపై కీలక భేటీ.. ఎందుకంటే..

ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 04 , 2025 | 05:41 AM