Kishan Reddy on Telangana Govt: అప్పుడు కేసీఆర్ చేసినట్లే.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది..
ABN , Publish Date - Oct 31 , 2025 | 08:03 PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అధికార దుర్వినియోగంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలవాలని ప్రయత్నిస్తోందన్నారు.
హైదరాబాద్: దేశంలో ప్రస్తుతం రికార్డు స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగుతోందని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి (G. Kishan Reddy) తెలిపారు. దేశవ్యాప్తంగా 500 గిగావాట్ల ఉత్పత్తిలో 74 శాతం థర్మల్ పవర్ స్టేషన్ల ద్వారా ఉత్పత్తి అవుతోందని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్ కేంద్రాల వద్ద 22 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులు తమ పొలాల్లోనే సోలార్ పంప్ సెట్లతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని తెలిపారు. అలాగే, గృహ అవసరాల కోసం లక్షలాది కుటుంబాలు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, ఉత్పత్తి అయిన విద్యుత్‌ను గ్రిడ్ కు అనుసంధానం చేసుకుని, విక్రయించుకునే వీలు కలుగుతుందన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో కనీస మద్దతు ధర (MSP) ను భారీగా పెంచామని, యూరియా వంటి ఎరువుల ధరలు పెరిగినా సబ్సిడీ ధరకే రైతులకు అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణకు కేంద్రం సహకారం
తెలంగాణ రాష్ట్రానికి 450 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లకు అనుమతి ఇచ్చామని, అలాగే 40 వేల సోలార్ రూఫ్‌టాప్ యూనిట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో 20,000 యూనిట్లు మొదటి విడతలో ఇన్‌స్టాల్ చేస్తామని వివరించారు. రామగుండం ఎన్టీపీసీలో 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను దశలవారీగా నిర్మిస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో రూ.12,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2023లో ప్రారంభించారని, రెండో విడతలో 3800 మెగావాట్ల ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇందులో ఉత్పత్తి చేసే విద్యుత్‌లో 80 శాతం తెలంగాణకే కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మొత్తం విద్యుత్ కొనుగోలు చేయకుండా మూడో వంతు మాత్రమే తీసుకుంటోందని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌ను కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
సోలార్ ప్రాజెక్టులు – పెట్టుబడులు
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు పూర్తయ్యాయని, మరో 56 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. రామగుండంలో 121 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. నైవేలీ కార్పొరేషన్ లిమిటెడ్ (NLC) సంస్థ తెలంగాణలో రూ.10,000 కోట్ల పెట్టుబడులతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించి, ఈ పెట్టుబడులకు సహకరించాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ సంవత్సరానికి సగటున 9.8 శాతం పెరుగుతోందని.. 2030 నాటికి రాష్ట్రానికి 33,773 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని చెప్పారు. అయితే, రాష్ట్రంలోని డిస్కంలు (విద్యుత్ పంపిణీ సంస్థలు), పవర్ ప్రొడక్షన్ యూనిట్లు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టిందని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో కొనసాగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు రూ.30,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తు చేశారు.
సింగరేణి కంపెనీ బకాయిలు
రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీకి రూ.42,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలు చెల్లించకపోవడం వల్లే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలంటే ప్రభుత్వం వెంటనే చెల్లింపులు ప్రారంభించాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్లుగా మైనారిటీలకు అన్యాయం చేసి, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దృష్ట్యా ఓట్ల కోసం ఆ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తున్నారని అన్నారు. అజారుద్దీన్‌పై, మైనారిటీలపై ప్రేమ ఉంటే రెండు సంవత్సరాల క్రితం ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.