Singer Chinmayi: అసభ్యకరంగా ట్రోలింగ్.. సీపీకి సింగర్ చిన్మయి ఫిర్యాదు
ABN , Publish Date - Nov 06 , 2025 | 10:26 AM
తన పిల్లలను కూడా ట్రోలింగ్‌లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో చిన్మయి పేర్కొన్నారు. మంగళసూత్రానికి సంబంధించి చిన్మయి భర్త రాహుల్ చేసిన కామెంట్స్‌పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు.
హైదరాబాద్, నవంబర్ 6: ప్రముఖ సింగర్ చిన్మయిపై (Singer Chinmayi) మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఆన్‌లైన్‌లో చాటింగ్ చేస్తూ తనని దూషిస్తున్నారని హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు (Hyderabad CP Sajjanr) సింగర్ చిన్మయి ఫిర్యాదు చేశారు. తాను రాయడానికి వీలు లేని పదాలతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆన్‌లైన్ ద్వారా సీపీకి ఫిర్యాదు చేశారు. తన పిల్లలను కూడా ట్రోలింగ్‌లోకి లాగి వారు చనిపోవాలని ట్రోలర్స్ కోరుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మంగళసూత్రం’కు సంబంధించి చిన్మయి భర్త రాహుల్ చేసిన కామెంట్స్‌పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేశాడు. దీనిపైనే చిన్మయి పోలీసులను ఆశ్రయించారు.
అయితే చిన్మయి తరచూ ట్రోలింగ్‌కి గురవుతూనే ఉంటారు. అనేక విషయాల్లో చిన్మయిపై కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారు. అయినా వాటిని పట్టించుకోలేదు. కానీ ఈసారి ఏకంగా తన పిల్లలను కూడా లాగడంతో సింగర్ తట్టుకోలేకపోయారు. వెంటనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఈ విషయంపై హైదరాబాద్ సీపీ దృష్టికి తీసుకెళ్లారు. చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన సీపీ సజ్జనార్.. చిన్మయి చేసిన ఫిర్యాదును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు. అసభ్యంగా ట్రోల్ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీపీ ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. సింగర్ చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను రిలీజ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మంగళసూత్రం’ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మంగళసూత్రం ధరించే విషయంలో తన భార్యను ఫోర్స్ చేయనని.. మంగళసూత్రం ధరించాలా? వద్దా? అనేది చిన్మయి ఎంపిక అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కాస్తా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ కామెంట్స్‌పై రాహుల్, చిన్మయి దంపతులను కొంతమంది నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
బీహార్ అసెంబ్లీ మొదటి దశ పోలింగ్ ప్రారంభం
హైదరాబాద్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News And Telugu News