Betting Apps Promotion Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు హాజరైన రానా, విష్ణుప్రియ..
ABN , Publish Date - Nov 15 , 2025 | 05:20 PM
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో దగ్గుబాటి రానా సైతం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రానాను ప్రశ్నించారు సీఐడీ అధికారులు.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు (Betting Apps Promotion Case)లో సినీ హీరో దగ్గుబాటి రానా (Rana Daggubati), ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియ విచారణకు హాజరయ్యారు. CID సిట్ అధికారుల ఎదుట వారిద్దరూ హాజరై విచారణ ఎదుర్కొన్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తొలుత విష్ణుప్రియ (Vishnupriya) ఇవాళ(శనివారం) మధ్యాహ్నం సిట్ ముందు హాజరయ్యారు. ఈ మేరకు బ్యాంక్ అకౌంట్ వివరాలతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలనూ సిట్ అధికారులకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై అధికారులు ప్రశ్నించారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన పారితోషికాలపైనా విచారణ చేశారు.
కాగా, తాజ్ 777 బుక్ డాట్ కామ్(Taj777 Book.com) సహా మరో రెండు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు విష్ణు ప్రియ. మరోవైపు.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో దగ్గుబాటి రానా సైతం సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో విచారణకు వచ్చారు. బెట్టింగ్ యాప్‌తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రానాను ప్రశ్నించారు సీఐడీ అధికారులు. కాగా, 2017లో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్‌ను ప్రమోట్ చేశారు రానా. అయితే, స్కిల్ బేస్డ్ గేమ్ యాప్‌ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సీఐడీకి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నరపాటు సీఐడీ అధికారులు రానాను విచారణ చేశారు.
అయితే, విచారణ అనంతరం రానా మీడియాతో మాట్లాడారు. ఒప్పందం చేసుకునే సమయంలో తన లీగల్ టీమ్ అన్ని పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతోనూ తాను ఒప్పందం చేసుకోలేదని పేర్కొన్నారు. తన లీగల్ టీమ్ పూర్తిగా వెరిఫై చేసిందని వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ సిట్ అధికారులకు ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించినట్లు రానా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి: