Panchayat Elections In Telangana: రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:32 AM
తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ పర్వం శనివారంతో ముగిసింది. నేటి నుంచి రెండో విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
హైదరాబాద్, నవంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. నేటి నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ నామినేషన్లను స్వీకరిస్తారు. 3వ తేదీన ఈ నామినేషన్లను పరిశీలించనున్నారు. డిసెంబర్ 5వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ.. అదే రోజు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన ఈ రెండో దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తారు.
తొలి విడతలో..
ఇక తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు నిన్నటితో అంటే.. నవంబర్ 29వ తేదీతో ముగిసింది. గత అర్థరాత్రి వరకు ఈ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. శనివారం చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు భారీగా అభ్యర్థులు పోట్తెత్తారు. దాఖలైన నామినేషన్లను అధికారులు.. ఈ రోజు అంటే అదివారం పరిశీలించనున్నారు. డిసెంబర్ 11వ తేదీన రాష్ట్రంలో పంచాయతీ తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 31 జిల్లాల్లోని 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులకు పోలింగ్ జరగనుంది. మరోవైపు మూడో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
నవంబర్ 25న..
నవంబర్ 25వ తేదీ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు.. 1,12,242 వార్డులకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో.. ఆ రోజు నుంచి తెలంగాణలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఈ జిల్లాలోని 564 గ్రామపంచాయతీలకు నేటి నుంచి రెండో విడత నామినేషన్లు స్వీకరణ చేపట్టనున్నారు. మొత్తం 4,928వార్డు లకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అందు కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది.
జనగామ జిల్లాలో 4 మండలాల్లో 79 పంచాయతీలు
భూపాలపల్లి జిల్లాలో 4 మండలాల్లో 85 పంచాయతీలు
మహబూబాబాద్‌లో 7 మండలాల్లో 158 పంచాయతీలు
హనుమకొండ జిల్లాలో 5 మండలాల్లో 73 పంచాయతీలు
వరంగల్ జిల్లాలో 4 మండలాల్లో 117 పంచాయతీలు
ములుగు జిల్లాలోని మూడు మండలాల్లో 52 పంచాయతీలు
నల్గొండ జిల్లాలో..
నేటి నుండి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు.. డిసెంబర్ 2వ తేదీతో ముగియనున్న గడువు
ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 630 గ్రామ పంచాయతీలకు 4,994 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు వేశారు. 5,598 వార్డులకు 15,552 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
రెండో విడతలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 613 గ్రామ పంచాయతీలు, 5,378 వార్డులకు నామినేషన్లు వేశారు.
నల్గొండ జిల్లాలో 10 మండలాల్లో 282 గ్రామ పంచాయతీలు, 2,418 వార్డులకు నామినేషన్లు
సూర్యాపేట జిల్లాలో 8 మండలాల్లో 181 గ్రామ పంచాయతీలు1,628 వార్డులకు నామినేషన్స్
యాదాద్రి-భువనగిరి జిల్లాలో 5 మండలాల్లో 150 గ్రామ పంచాయతీలు, 1,332 వార్డులకు నామినేషన్లు
ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ.
ఈ వార్తలు కూడా చదవండి..
ఔటర్ చుట్టూరా.. మెట్రో నిర్మిస్తే ఎంతో ప్రయోజనం
భోజనం తర్వాత ఇలా చేస్తే.. ఈ ప్రయోజనాలు..?
Read Latest TG News and National News