Kishan Reddy-Jubilee Hills: జూబ్లీహిల్స్ వెనుకబాటుకు బీఆర్ఎస్ కూడా బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Nov 06 , 2025 | 01:51 PM
ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ‘ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు గౌరవం లేదా? ఎర్రగడ్డలో ఖబరస్థాన్ కోసం స్థలం ఇచ్చేందుకు మనసొచ్చింది కానీ, పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాలు..
హైదరాబాద్, నవంబర్ 6: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గ్రామస్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్‌లో లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఏ పార్టీకి ఓటు వేయాలనే దానిపై ఓటర్లు ఇంకా నిర్ణయానికి రాలేదని.. అందుకే సర్వేల్లో కూడా స్పష్టత లేదని కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కిషన్ రెడ్డి కోరారు.
జూబ్లీహిల్స్ వెనుకబాటుకు BRS కూడా బాధ్యత వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని, గ్యారెంటీలపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంలో మెజార్టీ వాటా కేంద్రానిదేనని కిషన్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
దీనికి సంబంధించి ఒక పోస్ట్ ను కూడా కిషన్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు. 'ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ‘ఇజ్జత్’ అంటావు, మరి హిందువులు ఇజ్జత్ కాదా మిస్టర్ రేవంత్ రెడ్డి? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు గౌరవం లేదా? ఎర్రగడ్డలో ఖబరస్థాన్ కోసం స్థలం ఇచ్చేందుకు మనసొచ్చింది కానీ, బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాలు స్థలం ఇవ్వడం ఎందుకు కుదరలేదు. హిందువులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవు. ఎన్నాళ్లు మజ్లిస్‌ను భుజాన ఎక్కించుకోని తిరుగుతావో తిరుగు. ప్రజలే నీకు గట్టి బుద్ధి చెబుతారు.'అంటూ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.