Share News

Test Tube Baby Scam: వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..

ABN , Publish Date - Jul 27 , 2025 | 02:13 PM

టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల నిర్వాకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం అక్రమాలపై ఇప్పటికే పోలీసులు కొరడా ఝుళిపించగా.. తాజాగా ఇండియన్ స్పర్మ్ టెక్‌పై గోపాలపురం పోలీసులు దాడులు నిర్వహించారు.

Test Tube Baby Scam: వెలుగు చూస్తున్న టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల అక్రమాలు..
Indian Sperm Tech

సికింద్రాబాద్: టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రాల నిర్వాకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం అక్రమాలపై ఇప్పటికే పోలీసులు కొరడా ఝుళిపించగా.. తాజాగా ఇండియన్ స్పర్మ్ టెక్‌పై గోపాలపురం పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఐవీఎఫ్ విధానాలను అనుసరిస్తున్నారని గుర్తించి ఏడుగురిని అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. కాగా, రెజిమెంటల్ బజార్‌లోని ఇండియన్ స్పర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ సోనీని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఇండియన్ స్పర్మ్ టెక్‌లో అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యం, అండాలను సేకరిస్తున్నట్లు దాడుల్లో గుర్తించారు. గత కొంతకాలంగా ఈ కేంద్రానికి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


అనధికారికంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ కేంద్రాన్ని నడుపుతున్నట్లు కనిపెట్టారు. ఈ మేరకు పంకజ్, సంపత్, శ్రీను, జితేందర్, శివ, మణికంఠ, బోరోను అరెస్టు చేశారు. వీరంతా వీర్యకణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్‌లోని పలు ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. యువతీయువకులకు డబ్బులు ఎరగా వేసి వీర్యం, అండాలను క్లినిక్ నిర్వాహకులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. క్లినిక్ సిబ్బంది పోర్న్ వీడియోలు చూపించి మరీ స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మేరకు క్లినిక్‌లో ఉన్న పలువురు యువకులను సైతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


మరోవైపు 16మంది వీర్య శాంపిల్స్‌ని ఆరోగ్య శాఖ అధికారులు సీజ్ చేశారు. సరోగసి కోసం ఈ స్పర్మ్‌ను వినియోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సృష్టి ఫెర్టిలిటీ నిర్వాకం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముగ్గురి నిందితులకు ఇవాళ(ఆదివారం) 14 రోజుల రిమాండ్ విధించింది మారేడుపల్లి కోర్టు. అనంతరం వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఏ-1 నమ్రత ఉండగా.. భారీ మెుత్తంలో డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 02:15 PM