Best Investment Options: దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూస్తున్నారా.. మీకున్న టాప్ 10 ఆప్షన్స్ ఇవే
ABN , Publish Date - Jul 27 , 2025 | 02:00 PM
ఆర్థిక భద్రత, మంచి రాబడి కోరుకునే భారతీయుల కోసం పలు పెట్టుబడి సాధనాలు ఉన్నాయి. వీటిల్లో టాప్ 10 ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఆర్థిక స్థిరత్వం కోసం స్మార్ట్‌గా పెట్టుబడులు పెట్టాలి. ఇలాంటి పెట్టుబడి సాధనాల కోసం వెతికే భారతీయుల ముందు పలు ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే ధైర్యం, చేతిలో ఉన్న డబ్బు తదితరాల ఆధారం వీటిలో పెట్టుబడులు పెడితే భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. మరి నిపుణులు చెప్పే దాని ప్రకారం, భారత్‌లో టాప్ 10 పెట్టుబడి సాధనాలు ఏవో ఈ కథనంలో చూద్దాం.
విశ్వసనీయ పెట్టుబడి సాధనాల్లో బంగారం ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటుంది. నగలు, గోల్డ్ కాయిన్స్‌తో పాటు గోల్డ్ ఈటీఎఫ్స్, సోవరిన్ గోల్డ్ బాండ్స్ వంటి వాటిపై పెట్టుబడులతో మంచి రాబడి పక్కా. దీర్ఘకాలంలో బంగారం విలువ పెరిగేదే కానీ తరిగేది కాదని నిపుణులు చెబుతున్నారు.
అటు బీమా, ఇటు పొదుపు పథకం లాభాలను ఏకకాలంలో అందించే అనేక పాలసీలను ఎల్ఐసీ అందిస్తోంది. పాలసీ మెచ్యురిటీతో వచ్చే బెనిఫిట్స్‌తో పాటు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇవి ఆర్థిక రక్షణను ఇస్తాయి. వీటిపై పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.
మంచి రాబడులను పక్కాగా అందించే పెట్టుబడి సాధనాల్లో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మించినది లేదు. రిస్క్‌ను ఇష్టపడని ఇన్వెస్టర్లు, సీనియర్ సిటిజన్లు వీటిల్లో డబ్బు మదుపు చేసి మంచి రాబడిని పొందొచ్చు.
స్టాక్స్, బాండ్స్, ఇతర పెట్టుబడి సాధనాలు కలగలిసిన మ్యూచువల్ ఫండ్స్‌లో సహజంగానే రాబడులు ఇతర సాధనాలతో పోలిస్తే కాస్త అధికంగా ఉంటాయి. డెట్, ఈక్విటీ, హైబ్రీడ్ ఫండ్స్ వంటి అనేక ప్రత్యా్మ్నాయాలను ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఇక ఎస్‌ఐపీ లాంటి వాటిల్లో క్రమం తప్పకుండా చేసే పెట్టుబడులు కూడా దాదాపుగా ఇదే ఫలితాన్ని ఇస్తాయి.
ప్రభుత్వ గ్యారెంటీ ఉన్న ఆర్‌బీఐ బాండ్స్‌తో క్రమం తప్పకుండా ఆదాయాన్ని పొందొచ్చు. అయితే, వీటిల్లోని లాకిన్ పీరియడ్ కొందరికి ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉంది.
ఇక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలను ఇష్టపడే వారికి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓ ఉత్తమమైన ప్రత్యామ్నాయం. రికరింగ్ డిపాజిట్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ వంటి రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
రాబడిపై పన్ను వద్దనుకునే వారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఓ మంచి ఆప్షన్. ఇందులో పెట్టుబడులపై అధిక వడ్డీ లభిస్తుంది. అయితే, తొలి 15 ఏళ్లు పెట్టుబడుల ఉపసంహరణకు ఛాన్స్ ఉండదు. పన్ను బాధ లేకుండా సంపదను పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్.
రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు కూడా మంచి రాబడిని ఇస్తాయి. నివాస, పారిశ్రామిక అవసరాలకు డిమాండ్ దాదాపుగా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఈ రంగంలో పెట్టుబడులు భవిష్యత్తుకు భద్రత కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
తమ కూతుళ్ల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే వారికి ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన మంచి ప్రత్యామ్నాయం. అయితే, ఇందులో బాలికల పేరిట పెట్టే పెట్టుబడులను వారికి 21 ఏళ్లు వచ్చే వరకూ వెనక్కు తీసుకునే ఛాన్స్ ఉండదు.
రిటైర్మెంట్ తరువాత ఆర్థిక భద్రత కోసం నేషనల్ పెన్షన్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. పన్నుల నుంచి మినహాయింపుతో పాటు వృద్ధాప్యంలో స్థిరమైన రాబడి కోరుకొనే వారికి ఇది మంచి ఆప్షన్. కాబట్టి, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని తగిన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇవీ చదవండి:
క్రెడిట్ కార్డు క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుందా..
బిలియనీర్‌గా మారిన ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..