Ibomma Ravi Arrest: వందల కోట్ల సంపాదన... విలాసవంతమైన లైఫ్.. ఇదీ రవి చరిత్ర
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:34 PM
పైరసీతో సినీ పరిశ్రమకు తవ్ర నష్టాన్ని కలిగిస్తున్న ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఈ క్రమంలో రవి గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 17: ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో భారత పౌరసత్వాన్ని వదులుకున్న రవి.. అదే సంవత్సరం కరేబియన్ పౌరసత్వాన్ని తీసుకున్నారు. దాదాపు రూ.80 లక్షలు చెల్లించి మరీ రవి కరేబియన్ పౌరసత్వం పొందినట్లు తెలుస్తోంది. ఇక 2022 నుంచే రవి కరేబియన్ దీవుల్లో ఉంటున్నారు. భారత్‌లో ఉన్న ఆస్తులను అమ్ముకోవడానికి మూడు రోజుల క్రితమే భారత్‌లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, వైజాగ్‌లో ఉన్న ఆస్తులను అమ్మే యోచనలో రవి ఉన్నట్లు సమాచారం. ఇందు కోసం ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.
అలాగే 2022కు ముందు ఓ ముస్లిం అమ్మాయిని వివాహం చేసుకున్నారు. టెక్నాలజీ పరంగా దిట్ట కావడంతో ఐబొమ్మను క్రియేట్ చేసిన రవి ఓటీటీ కంటెంట్‌ను డీఆర్‌ఎమ్ టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్‌లోడ్ చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్‌డీలోకి మార్చాడు. దాదాపు 60 వెబ్‌సైట్లు క్రియేట్ చేసి పైరసీ కంటెంట్‌ను రవి పోస్టు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు రూ.వందల కోట్లు సంపాదించినట్లు సమాచారం. కరేబియన్ దీవుల్లో రవి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
కాగా.. ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముందుగా సీసీఎస్‌కు తరలించి కీలక సమాచారం సేకరించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా.. రవికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో ప్రస్తుతం రవి చంచల్‌గూడ జైలులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
పత్తి కొనుగోళ్లపై గందరగోళం.. ఆందోళనలో అన్నదాతలు
కొంపల్లి ఫ్లైఓవర్ ఆలస్యంపై ఎంపీ సీరియస్
Read Latest Telangana News And Telugu News