Harish Rao: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:08 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, నవంబర్ 10: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎన్నికల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈరోజు (సోమవారం) హరీష్ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌ను (సీఈవో) బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పోలీసులు, అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ పంపిణీ చేస్తోన్న చీరలు, మద్యం పంపిణీ వీడియోలను ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిపారు. యూసుఫ్‌గూడాలో పోలింగ్ కేంద్రం పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయన్నారు. రెండేళ్ళుగా ఆరు గ్యారెంటీల అమలుపై రివ్యూ చేయని సీఎం.. ఈరోజే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ ఓటమిని అంగీకరించారు... అందుకే ఆరు గ్యారెంటీలపై రివ్యూ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఓటర్లను మభ్యపెడ్తున్నారని ఆరోపించారు.
ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారని తెలిపారు. ఎన్నికల విధుల కోసం సీఆర్పీ బలగాలను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. బైపోల్స్‌లో వేల ఫేక్ ఐడీ కార్డులు ఎలా వచ్చాయని నిలదీశారు. ఓటర్ ఐడీ కార్డును బయటనే గుర్తించి ఓటర్‌ను లోపలకు పంపాలని అన్నారు. ఆశా, అంగన్ వాడీ, మహిళా పోలీసులతో మహిళల కోసం ప్రత్యేక కౌంటర్లు ఉంచాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాగా.. చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌ను కలిసి వారిలో బీఆర్ఎస్ నేతలు హరీష్, తలసాని, కొప్పుల ఈశ్వర్, కౌశిక్ రెడ్డి, జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి...
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
Read Latest Telangana News And Telugu News