Cybercrime Awareness: సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత ఉండాల్సిందే: సీపీ సజ్జనార్
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:50 PM
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సీపీ సజ్జనార్ అన్నారు. సైబర్ నేరస్తులు కాల్ చేసి బెదిరిస్తే భయపడవద్దని తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 22: సైబర్ నేరాలను అడ్డుకునేందుకు సరికొత్త కార్యక్రమానికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) శ్రీకారం చుట్టారు. చార్మినార్ వద్ద నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీపీ మీడియాతో మాట్లాడుతూ.. చారిత్రాత్మక చార్మినార్ వద్ద ప్రతి శని, మంగళవారం గడపగడపకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. చార్మినార్ వద్ద ఇవాళ సైబర్ క్రైమ్‌పై అవేర్‌నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశామన్నారు. అవగాహన లేక చాలామంది సైబర్ నేరాల బారిన పడుతున్నారని తెలిపారు.
ఒక్క హైదరాబాద్‌లోనే ప్రతి రోజు కోటి రూపాయలు సైబర్ నేరాల్లో పోగొట్టుకుంటున్నారని వెల్లడించారు. ఓటీపీ ఇన్వెస్ట్‌మెంట్, డిజిటల్ అరెస్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అందరూ అవగాహన, అప్రమత్తత కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరస్తులు కాల్ చేసి బెదిరిస్తే భయపడవద్దన్నారు. భయపడితే అది సైబర్ నేరస్తుల బలం అవుతుందని చెప్పుకొచ్చారు.
ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని.. అలా చేస్తే మిమ్మల్ని ట్రాప్ చేసి మోసం చేసే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ సింబా పేరిట వాలంటరీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చామని.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీపీ సజ్జనార్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
రూ.6 లక్షలకు శిశువు విక్రయం.. కరీంనగర్‌లో దారుణం
Read Latest Telangana News And Telugu News