Baby Sale: రూ.6 లక్షలకు శిశువు విక్రయం.. కరీంనగర్‌లో దారుణం
ABN , Publish Date - Nov 22 , 2025 | 10:57 AM
కన్న బిడ్డ పట్ల తల్లి దారుణంగా ప్రవర్తించింది. పుట్టిన బిడ్డను ఎంతో అపురూపంగా చేసుకోవాల్సిన ఆ తల్లి.. ఏకంగా బిడ్డను అమ్మకానికి పెట్టేసింది.
కరీంనగర్, నవంబర్ 22: పుట్టిన బిడ్డపై తల్లికి అపారమైన ప్రేమ ఉంటుంది. తల్లి ప్రేమకు మించింది ఇంకోటి లేదంటారు. బిడ్డకు జన్మనివ్వడం అంటే మరుజన్మగా భావిస్తుంటారు. తొమ్మిది నెలలు మోసి, ఎంతో బాధను అనుభవించి మరీ బిడ్డను కంటారు. బిడ్డ పుట్టాక అప్పటి వరకు పడిన బాధను మొత్తం మరిచి పసిబిడ్డ బోసి నవ్వులు చూస్తూ మురుస్తుంటుంది మాతృమూర్తి. కానీ.. ఈ మధ్య కాలంలో శిశువు విక్రయాలు ఎక్కువయ్యాయి. అక్రమసంబంధం ద్వారా పుట్టిన బిడ్డను అమ్మేసేందుకు ప్రయత్నిస్తుంటారు కొందరు మహిళలు. మరికొన్ని చోట్ల బిడ్డను పోషించే స్తోమత లేక అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే మహిళ కూడా ఇలాంటి దారుణానికే పాల్పడింది. అప్పుడే పుట్టిన బిడ్డను విక్రయించేందుకు ప్రయత్నించి చివరకు ఊచలులెక్కబెడుతోంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో యువతి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ యువతి ఓ వ్యక్తిని ప్రేమించింది. ప్రేమికుడి కారణంగా గర్భవతి అయిన యువతి.. మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ అతడు మోసం చేయడంతో బిడ్డను ఎలా పోషించాలో తెలియక దారుణ నిర్ణయిం తీసుకుంది. తనకు పుట్టిన బిడ్డను అమ్మకానికి పెట్టింది. ఏకంగా ఆరు లక్షలకు శిశువును విక్రయించేందుకు బేరం కుదిరింది. బిడ్డను విక్రయించేందుకు కొంతమంది మధ్యవర్తులుగా వ్యవహరించారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకినివానిపల్లెకి చెందిన రాయమల్లు, లత దంపతులకు శిశువు విక్రయానికి ఒప్పందం కుదిరింది. విషయం తెలిసిన బాలల పరిరక్షణ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన కరీంనగర్ టూ టౌన్ పోలీసులు.. శిశువు విక్రయాన్ని అడ్డుకున్నారు. శిశువును అమ్మేందుకు సహకరించిన 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
మాజీ కేంద్రమంత్రి కొడుకును మోసం చేసిన మోస్ట్ వాంటెడ్ ఫ్రాడ్ అరెస్ట్
మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు
Read Latest Telangana News And Telugu News