Share News

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:03 PM

రాజధాని అమరావతి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ భేటీ అయ్యింది. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెల్లడించారు.

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి
Chandra S. Pemmasani

అమరావతి, నవంబర్ 22: రాజధాని రైతుల సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నియమించిన కమిటీ ఈరోజు (శనివారం) భేటీ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కమిటీని సీఎం నియమించారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (Union Minister Pemmasani Chandrasekhar) నేతృత్వంలో రాయపూడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగగా.. రైతుల సమస్యలపై చర్చించారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం 30 వేల మంది రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ఇంత మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత వేగంగా అన్నీ జరగవని చెప్పుకొచ్చారు. 700 ఎకరాల భూమిలో రైతులకు సమస్యలు ఉన్నాయని.. వీటిలో వివిధ కారణాలతో సమస్యలు వచ్చాయని తెలిపారు.


సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని భేటీలో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా జరీబు ల్యాండ్ సమస్యల విషయంలో నిజమైన జరీబు రైతులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. దీనిలో కూడా 180 ఎకరాల్లో మాత్రమే సమస్య వచ్చిందని.. 30 రోజుల్లో నిజనిర్ధారణ చేసి పరిష్కారం చేస్తామని కేంద్రమంత్రి తెలిపారు.


గ్రామకంఠాల విషయంలో గైడ్ లైన్స్ పాటించకుండా చేసినందు వల్ల 36 ఎకరాల్లో సమస్యలు వచ్చాయని కేంద్రమంత్రి వివరించారు. గ్రామ కంఠాలలో ఎవ్వరికైనా ఎక్కువ ఇచ్చినట్టు గుర్తిస్తే వాటిపై రీ సర్వే చేస్తామన్నారు. 30 రోజుల్లో అడిషనల్ కమిషనర్ రిపోర్ట్ తీసుకొని పరిష్కరిస్తామన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో, జగన్ వచ్చాక లంక భూముల విషయంలో కోర్టు చిక్కులు ఏర్పడ్డాయని అన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో అమ్ముకునే అవకాశం ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం కుదరదని చెప్పడంతో ఇబ్బందులు వచ్చాయన్నారు.


90 శాతం మందికిపైగా రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చేసినట్లు తెలిపారు. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ సిద్ధం చేస్తామన్నారు. 2026 జూన్ నాటికి గ్రామాల్లో మౌలికవసతులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. లే ఔట్‌లు ఇచ్చిన చోట సరిహద్దు రాళ్ళుపోయాయన్నారు. దీంతో డిసెంబర్ 5 నుంచి సరిహద్దు రాళ్ళ సమస్య పరిష్కరిస్తామన్నారు. అపోహలు నమ్మొద్దని రైతులకు చెబుతున్నామని.. రెండు వారాలకు ఒకసారి ఈ కమిటీ సమావేశమవుతుందని తెలిపారు. సమస్యలన్నింటినీ ఆరు నెలలలోగా పరిష్కరిస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు.


అందువల్లే ఆలస్యం: మంత్రి నారాయణ

రాజధాని ప్రాంత రైతుల సమస్యలపై సమావేశంలో చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. ఖచ్చితంగా ఆరు నెలల్లో రైతుల సమస్యలకు పరిష్కారం వస్తుందన్నారు. కోర్ట్ కేసులు.. ఇతర కారణాల వల్ల ఆలస్యం అయిందని చెప్పారు. ఒకరిద్దరు వాళ్ల స్వార్ధం కోసం చెప్పే అంశాలను నమ్మవద్దని మంత్రి అన్నారు.


త్వరలో డీపీఆర్ సిద్ధం: ఎమ్మెల్యే శ్రావణ్

రాజధాని ప్రాంతంలో ఉన్న లే ఔట్లలో సరిహద్దు రాళ్లు వేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం రెండు వైపుల మాత్రమే సర్వే రాళ్లు వేయగలిగామన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సెట్ అయ్యాక మిగిలిన రెండు వైపులా సర్వే రాళ్లు వేస్తామని చెప్పారు. రాజధాని గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పైప్ లైన్లు పనికి రావని.. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలని తెలిపారు. రాజధాని గ్రామాల్లో శ్మశానాలు లేవన్నారు. మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని అన్నారు. త్వరలో డీపీఆర్ రెడీ చేస్తామని.. డీపీఆర్ తయారు చేశాక గ్రామ సభలు పెట్టి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

మావోయిస్టులకు బిగ్ షాక్.. భారీగా లొంగుబాటు

రూ.6 లక్షలకు శిశువు విక్రయం.. కరీంనగర్‌లో దారుణం

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 22 , 2025 | 01:05 PM