Osmania Hospital: ఉస్మానియా నూతన ఆస్పత్రికి సీఎం శంకుస్థాపన
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:27 PM
Osmania Hospital: నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేశారు. మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు.

హైదరాబాద్, జనవరి 31: నూతనంగా నిర్మించనున్న ఉస్మానియా ఆస్పత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం (Telangana Govt) నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఎం భూమి పూజ చేశారు. మొత్తం 26.3 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 2 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రి నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
రూ.2400 కోట్లతో 14 అంతస్తుల్లో ఆస్పత్రి భవన నిర్మాణం జరుగనుంది. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో 30 విభాగాలలో వైద్య సేవలు అందించనున్నారు. కొత్త ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కొత్త ఆస్పత్రికి డిజైన్ చేశారు. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ గదిలో గాలి, వెలుతులు ఉండేలా డిజైన్లు చేశారు. అత్యాధునిక టెక్నాజీలతో కూడిన మార్చరీ ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నలువైపులా రోడ్లు వేయనున్నారు. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇందులో ఉండేలా ఏర్పాటు చేస్తారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి. ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులను నిర్మిస్తారు. ప్రస్తుతం అఫ్జల్‌గంజ్‌లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రి శిథిలావస్థకు చేరడంతో కొత్త ఆస్పత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించాలని నిర్ణయించారు.
భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, కే కేశవరావు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ,రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
వీడియో చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం..
Read Latest Telangana News And Telugu News