Share News

MP Chamala Kiran Kumar Reddy: బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఎంపీ చామల ప్రశ్నలు

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:40 PM

హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ డిమాండ్ చేశారు. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలంటూ హితవు పలికారు.

MP Chamala Kiran Kumar Reddy: బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఎంపీ చామల ప్రశ్నలు
MP Chamala Kiran Kumar Reddy

హైదరాబాద్, నవంబర్ 16: కేంద్రమంత్రి అనే హోదాను మర్చిపోయి మాట్లాడటం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు అలవాటుగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హిందువులంతా ఏ పార్టీలో ఉన్నా బీజేపీలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందని బండి సంజయ్ అంటున్నారని.. ఇది దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు.

కేంద్ర క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి ఎంపీగా ఉన్న సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ గల్లంతైందని.. అసెంబ్లీ ఎన్నికల కంటే, తాజా ఉప ఎన్నికలో బీజేపీకి ఓట్లు తగ్గాయని ఎంపీ ఎద్దేవా చేశారు. బీజేపీ లోపాయికారిగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిందా?.. దీనిపై బండి సంజయ్ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.


'బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చారో లేదో బండి సంజయ్‌కు తెలియకపోతే, పార్టీలో ఇంటర్నల్‌గా చర్చ చేసుకోండి. బండి సంజయ్ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాష్ట్రంలో ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ఒక కులం, ఒక మతం ఓట్లతో గెలవలేదు. అన్ని వర్గాల వారు ఓట్లు వేశారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో బీసీ బిడ్డకు టిక్కెట్ ఇచ్చారు. ప్రజలు ఆదరించారు. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కోసం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం పదే పదే ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. గత పాలకులు దౌర్జన్యంగా దోచుకున్న తెలంగాణను కాపాడాలి. మోదీ, అమిత్ షాపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తేవాలి. హైదరాబాద్ మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. బండి సంజయ్ కులాలు, మతాల ప్రస్తావన పక్కన పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడాలి. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపాలి' అని చామల డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: రండి బాబూ రండి.. చౌక ధర.. ఐదొందలు టికెట్‌ కొనుక్కో.. ఐదు కోట్ల ఇంటిని సొంతం చేసుకో..

KTR petition: తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్‌.. రేపు విచారణ

Updated Date - Nov 16 , 2025 | 09:52 PM