Hyderabad: ప్రపంచశ్రేణి మెట్రో హబ్‌గా జేబీఎస్!
ABN , Publish Date - Jan 20 , 2025 | 03:35 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నార్త్‌సిటీ మెట్రో కారిడార్లను వినూత్నంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంల్) అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

30 ఎకరాల్లో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఏర్పాటు!.. ప్రైవేటు ఆస్తుల సేకరణను తగ్గించే విధంగా చర్యలు
‘నాగోల్-ఎయిర్‌పోర్టు’ అనుసంధానంగా మేడ్చల్, శామీర్‌పేట్ రూట్లు
బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద 600 మీటర్ల సొరంగం
హెచ్‌ఏఎంఎల్ అధికారుల పరిశీలన
హైదరాబాద్ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నార్త్‌సిటీ మెట్రో కారిడార్లను వినూత్నంగా తీర్చిదిద్దేందుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంల్) అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు జూబిలీ బస్ స్టేషన్ (జేబీఎ్‌స)ను ప్రపంచ స్థాయి మెట్రో హబ్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి హైదరాబాద్ మహా నగరానికి వచ్చే ప్రజలతోపాటు ప్రస్తుతం నార్త్‌సిటీ నిర్వాసితుల రాకపోకలు, ఇతర అవసరాలను తీర్చేందుకు జేబీఎ్‌సను మెట్రో హబ్‌గా మార్చనున్నారు. ఈ మేరకు జేబీఎస్ పరిసరాల్లో రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ శాఖకు చెందిన సుమారు 30 ఎకరాల భూమిని సమీకరించాలని భావిస్తున్నారు. ప్రధానంగా ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎస్- శామీర్‌పేట్ మార్గాలను నాగోల్-ఎయిర్‌పోర్టు కారిడార్‌కు అనుసంధానంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు.
మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా పార్ట్-ఏ కింద నాగోల్-ఎయిర్‌పోర్టు (36.8 కి.మీ.), రాయదుర్గ్- కోకాపేట్ నియోపొలిస్(11.6 కి.మీ.), ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ నగర్-హయత్‌నగర్ (7.1 కి.మీ.) ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అలాగే పార్ట్-బీ కింద శంషాబాద్-ఎయిర్‌పోర్టు (40 కి.మీ.), జేబీఎ్‌స-శామీర్‌పేట్ (22 కి.మీ.), ప్యారడైజ్-మేడ్చల్ (23 కి.మీ.) ప్రతిపాదించారు. ఉత్తర ప్రాంత వాసుల డిమాండ్ మేరకు మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్లను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం మూడు నెలల్లోపు రెండింటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను తయారు చేయాలని హెచ్‌ఏఎంఎల్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో వారు వడివడిగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం హెచ్‌ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఆనంద్‌మోహన్, జనరల్ మేనేజర్లు బీఎన్ రాజేశ్వర్, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలకృష్ణ, డిప్యూటీ సీఈ (రైల్వేస్) జేఎన్ గుప్తా, ఇతర సీనియర్ అధికారులు రెండు కారిడార్లలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు.
పరిశీలనలో గుర్తించిన అంశాలు
బేగంపేట విమానాశ్రయ సరిహద్దు వెంబడి ప్యారడైజ్ నుంచి బోయినపల్లివరకు రోడ్డు వం పు ఎక్కువగా ఉండడంతోపాటు విమానాశ్రయ అధికారుల ఆంక్షల కారణంగా హెచ్‌ఎండీఎ తన ఎలివేటెడ్ మార్గాన్ని కొంతదూరం పాటు భూగర్భ మార్గంగా మార్చుకున్నట్లు గుర్తించారు. ఈ అలైన్‌మెంట్‌ను విమానాశ్రయం రన్‌వే కింద 600మీటర్ల సొరంగం ద్వారా తీసుకువెళ్తుంది.
హెచ్‌ఎండీఏ మార్గానికి అనుసంధానంగా రెండు లెవల్స్ పైన ఉండే డబుల్ ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని ఈ భూగర్భ సొరంగంలోకి దింపి, మళ్లీ రెండు లెవల్స్ ఎలివేటెడ్ మార్గంగా పైకి తీసుకురావడం అనేది ఇంజనీరింగ్ పరంగా అనేక సమస్యలను సృష్టిస్తుంది.
సీఎం రేవంత్ సూచనల ప్రకారం మేడ్చల్, శామీర్‌పేట్ కారిడార్ల ప్రారంభ స్థానాన్ని జేబీఎస్ వద్ద కలపనున్నారు. ఇక్కడ ప్రపంచస్థాయి మెట్రో హబ్‌ని ఏర్పాటు చేయనున్నారు.
బేగంపేట విమానాశ్రయం కింద భూగర్భంలో అలైన్‌మెంట్‌ను తీసుకువెళ్లే ఆవశ్యకతను నివారించేలా ప్రైవేట్ ఆస్తుల సేకరణను వీలైనంత తగ్గించే విషయంపై అధ్యయనం చేశారు.
ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎ్‌స-శామీర్‌పేట కారిడార్ల అలైన్‌మెంట్లను వీలైనన్ని ఎక్కువ నివాస కాలనీలకు, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా తీర్చిదిద్దాలని భావించారు. ఇక్కడ ఖాళీగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ/రక్షణ భూములను సేకరించి ప్రయాణికులకు మెరుగైన పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించాలని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
జేబీఎస్ వద్ద ప్రారంభంలో రెండు మెట్రో కారిడార్లను కలిపితే బేగంపేట విమానాశ్రయం దిగువన సొరంగం ద్వారా మెట్రో అలైన్‌మెంట్‌ను తీసుకెళ్లాల్సిన పరిస్థితిని నివారించవచ్చని గుర్తించారు. బోయినపల్లి రోడ్డు చివరన ఉన్న జాతీయ రహదారి జంక్షన్ వద్ద అలైన్‌మెంట్‌ను అనుసంధానించవచ్చని, అక్కడ నుంచి ఇప్పటికే విస్తరించిన ఎన్‌హెచ్ సర్వీ్‌సలేన్‌పై మెట్రో స్తంభాలు, వయాడక్టును జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లకు అంతరాయం కలగకుండా నిర్మించవచ్చని, మేడ్చల్-జేబీఎ్‌స-ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట- విమానాశ్రయ లింక్ కూడా దీనికి ఏర్పడుతుందని గుర్తించారు. తద్వారా60 కిలోమీటర్ల సుదీర్ఘ మెట్రో కారిడార్ ఏర్పాటు సాధ్యమవుతుందని వెల్లడించారు.
జేబీఎ్‌స-శామీర్‌పేట్ మెట్రో అలైన్‌మెంట్‌లో భాగంగా సికింద్రాబాద్ క్లబ్ సమీపంలో ఉన్న ప్రస్తుత మొదటి మెట్రో పిల్లర్ నుంచి డబుల్ ఎలివేటెడ్ స్ట్రక్చర్‌గా కరీంనగర్ హైవేపై హెచ్‌ఎండీఏ నిర్మించబోయే ఎలివేటెడ్ కారిడార్‌పైకి నేరుగా పొడిగించవచ్చని ఎండీ చెప్పారు.