Hyderabad: భూ సమీకరణకు కొత్త చట్టం.. సరికొత్త నిబంధనలతో రూపకల్పన
ABN , Publish Date - Jul 02 , 2025 | 09:53 AM
భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు చేయనుంది.

- మార్గదర్శకాలకు త్వరలోనే ప్రతిపాదనలు
- విస్తరిత హెచ్‌ఎండీఏ పరిధిలో అమలు
హైదరాబాద్ సిటీ: భూ సమీకరణ పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీమ్)కు మరిన్ని సంస్కరణలను జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విస్తరిత హెచ్‌ఎండీఏ(HMDA) పరిధిలో అమలు చేయనుంది. భూ సమీకరణ పథకం-2017తో ఆశించిన ప్రయోజనాలు నెరవేరకపోవడంతో ఆస్థానంలో సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. సరికొత్త నిబంధనలు, మార్గదర్శకాలతో ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్ (ఎల్‌పీఏడీ) అనే ముసాయిదా చట్టాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఓ కన్సల్టెన్సీని నియమించేందుకు హెచ్‌ఎండీఏ టెండర్లను ఆహ్వానించింది.
పట్టాభూములకే అవకాశం
అభివృద్ధి అనేది ఒకే ప్రాంతానికి పరిమితమవ్వకుండా ఔటర్ అవతల మినీ నగరాలు, టౌన్‌షి్‌పలను తీసుకొచ్చేందుకు అప్పటి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్-2017 తీసుకువచ్చింది. అయితే దానికి ఆశించిన స్పందన రావడం లేదు. ఉప్పల్ భగాయత్ లేఅవుట్‌ను 733 ఎకరాలతో ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టగా, అదే తరహాలో స్వరాష్ట్రంలోనూ ఎనిమిదేళ్ల క్రితం తీసుకొచ్చారు. నాటి చట్టం ప్రకారం ఇన్ముల్ నర్వ (95 ఎకరాలు), లేమూరు (84 ఎకరాలు)లో లే అవుట్‌లు అభివృద్ధి చేయగా, ప్రతాపసింగారం (110 ఎకరాలు)లో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఈ స్కీమ్ వచ్చిన ఎనిమిదేళ్లలో మూడు ప్రాంతాల్లో 289 ఎకరాలే సేకరించారు. 2017లో ఉన్న కొన్ని నిబంధనలు ప్రభుత్వానికి, రైతులకు ఇబ్బందికరంగా మారాయి. కేవలం పట్టా భూములకే అవకాశం కల్పించారు. అసైన్డ్, సీలింగ్ భూములు సేకరించే అవకాశం లేదు.
ఇతర రాష్ట్రాల్లో ఉపయుక్తంగా..
దేశంలోని పలు నగరాల్లోని డెవల్‌పమెంట్ అథారిటీలకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ వరంగా మారింది. ప్రధానంగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్(Maharashtra, Rajasthan, Gujarat) తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు నోటిఫికేషన్ వేయగానే రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చి పరిహారంగా మరోచోట అభివృద్ధి చేసిన మరింత భూమిని తీసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు పెద్దఎత్తున ల్యాండ్ బ్యాంకు అందుబాటులోకి వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌కు రైతులు, ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుండడంతో 2017లో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను తెలంగాణలో అమలు చేసేందుకు మార్గదర్శకాలతో ఉత్తర్వులిలిచ్చింది. కానీ ఇప్పటి వరకు కేవలం హెచ్‌ఎండీఏ పరిధిలో మినహా రాష్ట్రంలో ఎక్కడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను అమలు చేయలేదు. హెచ్‌ఎండీఏ పరిధిలో కూడా ఆశించిన ప్రయోజనాలు నెరవేరలేదు.
కొత్త నిబంధనలతో చట్టం
రాష్ట్రం మొత్తం కాకుండా విస్తరించిన హెచ్‌ఎండీఏ పరిధి 10,472 చదరపు కిలోమీటర్లలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి అధికారులు సరికొత్త సంస్కరణలను తీసుకొస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ల్యాండ్‌పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్ (ఎల్‌పీఏడీ) ముసాయిదా చట్టాన్ని తీసుకురావాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. హెచ్‌ఎండీఏ పరిధిలో జాతీయ, రాష్ట్రీయ రహదారులతో పాటు ప్రధాన ప్రాంతాల రహదారుల వెంట ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి తీసుకురావాలని భావిస్తోంది.
ఈ చట్టానికి అవసరమైన నియమాలు, మార్గదర్శకాలు రూపొందించడానికి ఓ కన్సల్టెన్సీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు ఆదేశాలిచ్చింది. విస్తరించిన హెచ్‌ఎండీఏ పరిధిని ఆధారంగా చేసుకొని ల్యాండ్‌పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్ ముసాయిదా చట్టం ఉండాలని, ఈ చట్టానికి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మార్గదర్శకాలు, నియమాలను జోడించాలని సూచించినట్లు తెలిసింది.
ముసాయిదా చట్టానికి అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కన్సల్టెన్సీ నియామకానికి చర్యలు చేపట్టారు. ఆరు నెలల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టెండర్ నోటిఫికేషన్‌లో నిర్ణయించారు. శివారు ప్రాంతాల్లో ల్యాండ్ బ్యాంక్ పెంచడానికి, టౌన్‌షి్‌పలను తీసుకురావడానికి ల్యాండ్ పూలింగ్ ఏరియా డెవల్‌పమెంట్ (చట్టం) ఉపయుక్తంగా మారుతుందని హెచ్‌ఎండీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలి
Read Latest Telangana News and National News