Hyderabad: ట్రాఫిక్ జామ్ అయితే.. 3 కి.మీ. ముందే గూగుల్ చెప్తుంది!
ABN , Publish Date - Jun 21 , 2025 | 04:46 AM
ఎప్పటిలాగానే రోజూ ఆఫీసు సమయానికి గంట ముందే ఇంటి నుంచి బయల్దేరుతాం! కానీ.. దారి మధ్యలో ట్రాఫిక్ రోజూ కన్నా ఎక్కువగా జామ్ అయిపోతుంది! కారణం ఏంటో తెలియదు.

సిగ్నలింగ్ వ్యవస్థ, ట్రాఫిక్ నిర్వహణకు అత్యాధునిక టెక్నాలజీ
గూగుల్ మ్యాపింగ్‌తో ఐటీఎంఎస్ అనుసంధానం
ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న హైదరాబాద్ పోలీసులు
నగరం రోడ్లపైకి ప్రతి రోజు 1600 కొత్త వాహనాలు
91లక్షలకు చేరిన వాహనాల సంఖ్య.. ఇప్పటికే డ్రోన్లు,
హై రైజ్ కెమెరాలతో ట్రాఫిక్ చిక్కులకు చెక్: సీవీ ఆనంద్
హైదరాబాద్ సిటీ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగానే రోజూ ఆఫీసు సమయానికి గంట ముందే ఇంటి నుంచి బయల్దేరుతాం! కానీ.. దారి మధ్యలో ట్రాఫిక్ రోజూ కన్నా ఎక్కువగా జామ్ అయిపోతుంది! కారణం ఏంటో తెలియదు. ఆ ట్రాఫిక్ ఎప్పటికి క్లియర్ అవుతుందో అంతకన్నా తెలియదు!! భాగ్యనగరంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇది. కానీ.. ఇకపై ఆ సమస్య ఉండదని.. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో సమూల మార్పులు తెస్తామని సిటీ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. గూగుల్ ప్రతినిధులతోపాటు.. ట్రాఫిక్ జా యింట్ సీపీ జోయల్ డేవి్‌సతో కలిసి బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం సిటీ పోలీసులు ఐసీసీసీ నుంచి అమలు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం(ఐటీఎంఎస్) డేటాను.. గూగుల్‌తో అనుసంధానం చేసి, ట్రాఫిక్ నిర్వహణలో వినూత్న మార్పులు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘‘నగరంలోని ట్రై కమిషనరేట్స్ పరిధిలో.. రోజుకు 1600 కొత్త వాహనా లు రోడ్డుమీదకు వస్తున్నాయి. ఇప్పటికే సిటీలో వాహనాల సంఖ్య 91లక్షలకు చేరింది. ఈ క్రమంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పోలీసులకు కత్తిమీద సాములా మారింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిటీలో ట్రాఫిక్ ఇబ్బందులపై ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం తెలుసుకోవడానికి రెండు డ్రోన్స్ కొనుగోలు చేశామని, వాటి విజువల్స్ ఆధారంగా.. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే ప్రాం తాలను గుర్తించి క్లియర్ చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా.. సిటీలో 25 ప్రాంతాల్లో ఎత్తైన భవనాలకు 100కు పైగా హై రైజ్ కెమెరాలు ఇన్‌స్టాల్ చేశామని.. వాటితో 360 డిగ్రీల రేడియ్‌సలో ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిం చి, క్షేత్రస్థాయిలో ఇబ్బందులను చక్కదిద్దుతున్నామని చెప్పారు. అలాగే.. ప్రస్తు తం ట్రాఫిక్ కూడళ్ల వద్ద 80ు సిగ్నల్స్ ఆటోమేటిక్ విధానంలో పనిచేస్తున్నాయని.. గూగుల్‌తో అనుసంధానం తర్వాత దాన్ని 90 శాతానికి పెంచి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తామని సీపీ తెలిపారు.
ఇప్పుడు ఇలా..
సిటీలో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య తెలత్తితే వాహనదారులు అక్కడికి వెళ్లేవరకు తెలియని పరిస్థితి ప్రస్తుతం ఉంది. ముందు సిగ్నల్‌లో ఉన్న క్షేత్రస్థాయి పోలీసులకు సైతం సమస్య ఏమిటో చాలాసేపటి వరకూ తెలియట్లేదు. ఐసీసీసీలో ఐటీఎంఎ్‌సను మానిటరింగ్ చేస్తున్న అధికారులు.. వారిని అప్రమత్తం చేసి ట్రాఫిక్ మళ్లింపునకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడట్లేదు. కానీ ఐటీఎంఎస్ డేటాను గూగుల్‌తో అనుసంధానం చేస్తే.. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటే గూగుల్ ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టి, ఆ దారిలో వచ్చే వాహనదారులు ఆ ప్రదేశానికి 3 కిలోమీటర్లు దూరంలో ఉన్నప్పుడే వారిని అప్రమత్తం చేస్తుంది. ‘‘ఫలానా ప్రాంతంలో, ఫలానా కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. మీరు వేరే దారిలో వెళ్లడం మంచిది’’ అని చెప్తుంది. దాంతో వాహనదారులు జాగ్రత్తపడడానికి అవకాశం ఉంటుంది. సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు, వీఐపీ మూమెంట్స్, ఇతరత్రా సమస్యల సత్వర పరిష్కారానికి గూగుల్ అత్యాధుని క టెక్నాలజీ ఉపయోగపడుతుందని సీపీ తెలిపారు.
ప్రైవేటుగా.. ట్రాఫిక్ మార్షల్స్..
కొన్ని ఐటీ కంపెనీలు, పెద్ద ఆస్పత్రులు, ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రైవేట్ సంస్థల వద్ద.. ప్రత్యేకంగా ట్రాఫిక్ మార్షల్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సీపీ తెలిపారు. ఉదాహరణకు, అపోలో వంటి పెద్ద ఆస్పత్రుల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటోందని.. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తతెత్తకుండా రోజూ ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం కష్టమని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రాంతాల్లో ఆయా సంస్థల యాజమాన్యాలే చర్యలు తీసుకోవాలని.. సీఎ్‌సఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంతా కొంతమంది సిబ్బందిని నియమించుకుని, వారిని ట్రాఫిక్ పోలీసులకు అనుసంధానం చేయాలని సూచించారు. వారికి తాము శిక్షణఇచ్చి ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్ మార్షల్స్‌గా నియోగిస్తామని తెలిపారు. అలాగే.. నగరంలో ట్రాఫిక్ జామ్‌లకు కారణమవుతున్న ఆర్టీసీ బస్టాపులనూ గుర్తించామని, వాటిని అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు సూచించామని చెప్పారు. ప్రైవేట్ వాహనాల దూకుడుకు కళ్లెం వేస్తామని, వాటికి ప్రత్యేక స్టాపులను కేటాయిస్తామని ఆయన తెలిపారు.
వర్షాకాల ప్రణాళిక..
వానాకాలంలో ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నట్లు సీపీ తెలిపారు. గూగుల్‌తో అనుసంధానం చేసుకొని ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టడంతో పాటు.. డీఆర్‌ఎఫ్, పోలీస్, హైడ్రా, ఇతర విభాగాల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తారని చెప్పారు. ఇప్పటికే గుర్తించిన వాటర్ లాగింగ్ (రహదారులపై నీరు నిలిచిపోయే) పాయింట్ల వద్ద నీరు నిల్వ కాకుండా తగిన ప్రణాళికలు రూపొందించామన్నారు. అవసరమైన పరికరాలను సిబ్బందికి అందజేశామని సీపీ తెలిపారు.