Share News

Hyderabad: ఆశ.. నిరాశే.. గ్రేటర్‌ ప్రాజెక్టులకు నిధులు కరువు..

ABN , Publish Date - Feb 02 , 2025 | 09:26 AM

కేంద్ర బడ్జెట్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)కు నిరాశే ఎదురైంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు, మురుగు సీవరేజ్‌ నిర్వహణ మాస్టర్‌ ప్లాన్‌ కోసం రూ.17,212 కోట్లు కోరితే రూపాయి కూడా విదల్చలేదు. మెట్రో రెండో దశ డీపీఆర్‌కు అనుమతి ఇచ్చి రూ.24,269 కోట్లలో తనవంతు వాటా 18 శాతం నిధుల ఊసెత్తలేదు.

Hyderabad: ఆశ.. నిరాశే.. గ్రేటర్‌ ప్రాజెక్టులకు నిధులు కరువు..

- ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు గుండు సున్నా

- ప్రస్తావన లేని మూసీ పునరుజ్జీవం, మెట్రో రెండో దశ డీపీఆర్‌

- ఆర్‌ఆర్‌ఆర్‌, ఫ్యూచర్‌సిటీ ఊసెత్తని వైనం

- మురుగు సీవరేజ్‌ నిర్వహణ మాస్టర్‌ ప్లాన్‌పై నిర్లక్ష్యం

- ఐటీ జీవులకు ఊరట.. గిగ్‌ వర్కర్లకు చేయూత

హైదరాబాద్‌ సిటీ: కేంద్ర బడ్జెట్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad)కు నిరాశే ఎదురైంది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు, మురుగు సీవరేజ్‌ నిర్వహణ మాస్టర్‌ ప్లాన్‌ కోసం రూ.17,212 కోట్లు కోరితే రూపాయి కూడా విదల్చలేదు. మెట్రో రెండో దశ డీపీఆర్‌కు అనుమతి ఇచ్చి రూ.24,269 కోట్లలో తనవంతు వాటా 18 శాతం నిధుల ఊసెత్తలేదు. హైదరాబాద్‌ ఏఐ సిటీ, ఫ్యూచర్‌సిటీ ప్రస్తావన లేదు. కొత్త పన్ను విధానంతో వేతన జీవులకు ఊరట, ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా గుర్తింపు కార్డులు, రిజిస్ట్రేషన్‌, ఆరోగ్య యోజన కింద వైద్య సేవలతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ సర్వీసుల ద్వారా ఉపాధి పొందుతున్న గిగ్‌ వర్కర్లకు ఊతం తప్పితే సిటీకి చేసిన మేలు లేదు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్టు.. విచారణ చేస్తున్న పోలీసులు..


రాజేంద్రనగ: కేంద్ర బడ్జెట్‌లో జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్‌ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)కు ఒక్క పైసా నిధులు కేటాయింపులు జరగలేదు. దీంతో రాజేంద్రనగర్‌లోని ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. 2024-25 వార్షిక బడ్జెట్‌లో రూ.73కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ ఏడాది కేటాయింపులు లేకపోవడంతో తమ పరిస్థితి ఏంటని ఆ సంస్థ అకాడమిక్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సంస్థలో పనిచేస్తున్న 222మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు, మూడు వందల మందికి పైగా పెన్షనర్లు వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఈ నిర్ణయంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పునరాలోచించి ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌కు నిధులు కేటాయించాలని లేఖ రాసినట్లు తెలిపారు. తమకు న్యాయంచేయాలని కోరుతూ ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ ఉద్యోగులు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు.


రూ.7031కోట్లకు రూపాయీ ఇవ్వలే!

కేంద్ర బడ్జెట్‌లో మహానగరానికి మొండి చేయి చూపారు. నాలాల అభివృద్ధి, విస్తరణ పనులకు సంబంధించిన రూ.7031 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపినా జీహెచ్‌ఎంసీకి నిరాశే ఎదురైంది. వంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికీ బల్దియా రూపొందించిన ప్రతిపాదనలకు గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. ఆయా ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. అయితే, బడ్జెట్‌లో బల్దియాకు పైసా కేటాయింపులు దక్కలేదు.


‘మూసీ’కి మొండిచేయి

మూసీనది పునర్జీవానికి కేంద్రం నయా పైసా కేటాయించలేదు. నగర నడిబొడ్డున ప్రవహిస్తున్న మూసీనదిలోకి మురుగు చేరకుండా 55కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. దాంతో పాటు మురుగు మళ్లింపు నిర్మాణాలు, మురుగును శుద్ధి చేసేందుకు సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు ఇలా మురుగును కట్టడి చేసేందుకు రూ.4వేల కోట్లతో డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రికి సైతం ప్రాజెక్టు గురించి వివరించినా బడ్జెట్‌లో నిధులు దక్కలేదు.


మెట్రో రెండో దశకు చుక్కెదురు

నగరంలో మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో చుక్కెదురైంది. నిధుల కేటాయింపులు జరగకపోవడంతో అధికారులు, నగర వాసులు నిరుత్సాహానికి గురయ్యారు. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులో పార్ట్‌-ఏ కింద 5 కారిడార్లలో 76.4 కిలోమీటర్లను, పార్ట్‌-బీ కింద మూడు కారిడార్లలో 85 కిలోమీటర్ల పనులను ప్రతిపాదించింది. కాగా, పార్ట్‌-ఏ కింద నిర్మిస్తున్న 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల అంచనా వ్యయాన్ని రూపొందించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 కింద జాయింట్‌ వెంచర్‌గా ప్రాజెక్టును నిర్మించేందుకు నిర్ణయించినా.. బడ్జెట్‌లో డీపీఆర్‌కు నిధుల కేటాయింపులపై గ్రీన్‌సిగ్నల్‌ లభించలేదు. అయితే, బడ్జెట్‌తో సంబంధం లేకుండా మెట్రో ప్రాజెక్టుకు నిధుల మంజూరు, డీపీఆర్‌ను ఆమోదించవచ్చని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇంకా అధ్యయనం చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, రెండో దశ విస్తరణ డీపీఆర్‌ ఆమోదానికి వచ్చే మార్చి వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


‘పింక్‌ బుక్‌‘ తెరిచేదెన్నడు..!

- నేడో, రేపో రైల్వేకు కేటాయింపులు!

కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు కేటాయింపుల గురించి ఉత్కంఠగా ఎదురుచూసిన ఉన్నతాధికారులకు శనివారం నిరాశే మిగిలింది. బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా రైల్వేలకు సంబంధించిన ప్రస్తావన లేదు. అయితే.. మొత్తం బడ్జెట్‌లో రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల గురించి రైల్వే మంత్రిత్వ శాఖ పింక్‌బుక్‌ను రూపొందించినట్లు తెలిసింది. శనివారం పింక్‌బుక్‌ను రైల్వేశాఖ ఉన్నతాధికారులు తెరవకపోవడంతో నేడో,రేపో వివరాలను వెల్లడించే అవకాశం ఉందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. గతంలో రాష్ట్రానికి ప్రకటించిన ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుతో పాటు నగరంలో ఎంఎంటీఎస్‌ సెకండ్‌ఫేజ్‌ విస్తరణకు నిధులు, రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సమాంతరంగా రీజినల్‌ రింగ్‌ రైల్వేలైన్‌ సర్వేకు అనుమతి..తదితర అంశాలు పింక్‌బుక్‌లో తెరిచాక వెల్లడించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు నగరం నుంచి చెన్నైకి వందేభారత్‌, ఇతర నగరాలకు నమో ర్యాపిడ్‌ రైళ్లు, వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లను ఏ మేరకు ప్రకటిస్తారోనని అటు ప్రయాణికులు, ఇటు రైల్వే ఉన్నతాధికారులు ఎదురుచూస్తున్నారు.


వార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1

ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!

ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి

ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్

Read Latest Telangana News and National News

Updated Date - Feb 02 , 2025 | 09:29 AM