అత్యవసరంగా భూసేకరణ ఎందుకు?
ABN , Publish Date - Mar 07 , 2025 | 04:24 AM
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో అత్యవసరంగా భూమిని సేకరించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
లగచర్ల, హకీంపేట భూసేకరణ
నోటిఫికేషన్లపై స్టే విధించిన కోర్టు
హైదరాబాద్/దుద్యాల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట గ్రామాల్లో అత్యవసరంగా భూమిని సేకరించాల్సిన అవసరం ఏముందని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. లగచర్లలో 110 ఎకరాలు, హకీంపేటలో 351 ఎకరాలు సేకరించే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు నోటిఫికేషన్లపై స్టే విధించింది. భూములను అత్యవసరంగా సేకరించాల్సిన అగత్యం ఏంటని నిలదీసింది. లగచర్ల, హకీంపేటలో 461 ఎకరాలు సేకరించే నిమిత్తం గత ఏడాది నవంబరు 29న నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిని సవాల్ చేస్తూ లగచర్లకు చెందిన పత్లావత్ గోపాల్‌నాయక్ మరో 14 మంది, హకీంపేటకు చెందిన కుమ్మరి శివకుమార్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. గతంలో ఫార్మాసిటీ కోసం భూసేకరణ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం వాటిని రద్దు చేసి, మళ్లీ రెండు రోజుల వ్యవధిలోనే మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు పేరుతో నోటిఫికేషన్ జారీచేసిందని తెలిపారు. గ్రామసభ నిర్వహించకుండా, నిపుణులతో సామాజిక ప్రభావ మదింపు చేపట్టకుండా భూసేకరణ చట్టంలోని సెక్షన్ 10(ఏ)ను ఉపయోగించి అత్యవసరంగా భూసేకరణ చేయాలని చూస్తోందని చెప్పారు. 2013 భూసేకరణ చట్టానికి విరుద్ధంగా జారీ చేసిన ఈ నోటిఫికేషన్లను కొట్టివేయాలని కోరారు. స్పందించిన ధర్మాసనం భూసేకరణ నోటిఫికేషన్ల జారీలో అంత అత్యవసరం ఏంటని ప్రశ్నించింది. తదుపరి ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.
రోటిబండతండా, హకీంపేటలో సంబరాలు
కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో హకీంపేట, రోటిబండ తండా, లగచర్ల, పులిచర్లకుంట తండాకు చెందిన రైతులు గురువారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు.