Share News

High Court: ..వారి వల్లే సంధ్య థియేటర్‌ దుర్ఘటన

ABN , Publish Date - Jan 07 , 2025 | 03:57 AM

పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన కేసులో నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.

High Court: ..వారి వల్లే సంధ్య థియేటర్‌ దుర్ఘటన

  • అల్లు అర్జున్‌ మేనేజర్‌, సెక్యూరిటీకి ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

  • హైకోర్టులో పోలీసుల వాదన

హైదరాబాద్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): పుష్ప-2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట జరిగిన కేసులో నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. వీటిపై జస్టిస్‌ కే సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది. అల్లు అర్జున్‌ మేనేజర్‌ ఎ.శరత్‌చంద్ర నాయుడు, వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది చెరుకు రమేశ్‌, శ్రీరాముల రాజులకు ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పల్లె నాగేశ్వర్‌రావు కోరారు. ఓ మహిళ మృతి, ఓ చిన్నారి చావుబతుకుల మధ్య ఉండటానికి నిందితులు కారణమయ్యారని పేర్కొన్నారు. పిటిషనర్‌ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ..అది అనుకోకుండా జరిగిన దుర్ఘటన అని, ఆ ఘటన జరగాలని ఎవరూ కోరుకోలేదని తెలిపారు. ఆ ఘటనతో వారికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ స్పందిస్తూ తొక్కిసలాట జరగడానికి పిటిషనర్‌లు కారణమయ్యారని పేర్కొన్నారు.


మొత్తం 19 మంది నిందితుల్లో 10 మందిని అరెస్ట్‌ చేశామని తలిపారు. పది మంది వాంగ్మూలాలు నమోదు చేశామని పేర్కొన్నారు. థియేటర్‌ ఉద్యోగులు, సాక్షులు చెప్పినదాని ప్రకారం.. అల్లు అర్జున్‌ వస్తే అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ వారు పట్టించుకోలేదని తెలిపారు. ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోలేదని చెప్పారు. అల్లు అర్జున్‌ వ్యక్తిగత సిబ్బంది సైతం తోపులాటకు కారణమయ్యారని తెలిపారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు పోలీసులు సయితం వెళ్లిపోయారు.. అక్కడ ఎవరూ లేరు అన్న అరోపణలు అబద్ధాలని పేర్కొన్నారు. బాధితులకు పోలీసులే సీపీఆర్‌ చేశారని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనానికి సమర్పించారు. అల్లు అర్జున్‌కు సైతం హైకోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో పిటిషనర్లు ముందస్తు బెయిల్‌కు అర్హులు కాదని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.


పాడి కౌశిక్‌రెడ్డికి స్వల్ప ఊరట..

ఎన్నికల సందర్భంగా ‘మా శవ యాత్రకు రండి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై నమోదు చేసిన కేసులో హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. దిగువ కోర్టులో ప్రత్యక్ష హాజరునుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. తన వ్యాఖ్యలపై కమలాపూర్‌ పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై జస్టిస్‌ కే లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. వివరణ ఇవ్వాలని ఫిర్యాదుదారు, పోలీసులకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది.

Updated Date - Jan 07 , 2025 | 03:57 AM