Share News

SR Shankaran: ఓ ఐఏఎస్‌ ఎలా ఉండాలో చూపిన మహనీయుడు శంకరన్‌

ABN , Publish Date - Mar 01 , 2025 | 03:54 AM

జవాబుదారీతనం, దయాగుణం, నిజాయితీ, నైతిక స్థైర్యం ప్రతి ఐఏఎ్‌సకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. ఈ విలువలను ఎస్‌ఆర్‌ శంకరన్‌ విశ్వసించి ఆచరించారు.

SR Shankaran: ఓ ఐఏఎస్‌ ఎలా ఉండాలో చూపిన మహనీయుడు శంకరన్‌

  • ప్రముఖ గాంధేయవాది హర్షమందర్‌

  • మావోయిస్టులతో శాంతి చర్చల్లో శంకరన్‌ది కీలకపాత్ర

  • పద్మ భూషణ్‌ పురస్కారాన్ని సున్నితంగా తిరస్కరించారు

  • ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘జవాబుదారీతనం, దయాగుణం, నిజాయితీ, నైతిక స్థైర్యం ప్రతి ఐఏఎ్‌సకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. ఈ విలువలను ఎస్‌ఆర్‌ శంకరన్‌ విశ్వసించి ఆచరించారు. ఓ సివిల్‌ సర్వీస్‌ అధికారి ఎలా ఉండాలో జీవించి చూపారు’ అని ప్రఖ్యాత గాంధేయవాది హర్ష మందర్‌ పేర్కొన్నారు. తెలంగాణ పల్లె పల్లెకూ తిరిగి వెట్టి చాకిరీ విముక్తిని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడు అని కొనియాడారు. తాను నమ్మిన విలువల కోసం రాజకీయ ఒత్తిళ్లను సైతం లెక్కచేయలేదన్నారు. సఫాయి కర్మచారీ ఆందోళన్‌, స్కూల్‌ ఫర్‌ డెమోక్రసీ సంయుక్తంగా ప్రజల ఐఏఎ్‌సగా చరితార్థుడైన ఎస్‌ఆర్‌ శంకరన్‌ సంస్మరణ సభ శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హర్ష మందర్‌ మాట్లాడుతూ.. ఇవాళ్టి పరిస్థితుల్లోనూ శంకరన్‌లా ఐఏఎ్‌సలు రాజ్యాంగ విలువలు ప్రామాణికంగా ప్రజల కోసం పని చేయొచ్చు కానీ చాలామంది సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు వ్యక్తిగత ప్రయోజనాలు, అధికార పీఠాలకు లొంగిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


‘ప్రజాస్వామిక వాతావరణం, శాంతి, సామరస్యం కోసం చర్చల ఆవశ్యకత’ అంశంపై ప్రముఖ సామాజికవేత్త ఆచార్య హరగోపాల్‌ కీలకోపన్యాసం చేశారు. ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలు జరగడంలో శంకరన్‌ ముఖ్యపాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. పద్మ భూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించినా శంకరన్‌ సున్నితంగా తిరస్కరించారని గుర్తుచేశారు. బహుశా శాంతి చర్చలు విఫలమవడమే అవార్డు స్వీకరించకపోవడానికి ప్రధాన కారణమని తాను భావిస్తున్నట్లు హరగోపాల్‌ చెప్పారు. రాజ్యహింస పెచ్చరిల్లుతున్న ప్రస్తుత సమయంలో శంకరన్‌ స్ఫూర్తితో ప్రాణ నష్టం జరగకుండా చర్చించడం అవసరమన్నారు. కార్యక్రమంలో ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, ఉద్యమకారిణి వసంత కన్నబిరాన్‌, ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి అరుణారాయ్‌, సఫాయి కర్మ చారి ఆందోళన్‌ ఉద్యమ కారుడు బెజవాడ విల్సన్‌, మానవ హక్కుల వేదిక జాతీయ నాయకుడు జీవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2025 | 03:54 AM