Harish Rao: సిగాచి యాజమాన్యంతో రేవంత్ కుమ్మక్కు
ABN , Publish Date - Jul 29 , 2025 | 04:25 AM
సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు.

ఇంకా చర్యలెందుకు తీసుకోలేదు
వెంటనే పరిహారమివ్వాలి: హరీశ్‌రావు
సంగారెడ్డి/హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్‌రెడ్డి కుమ్మక్కయ్యారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఘటన జరిగి నెలరోజులు కావొస్తున్నా యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయడం లేదని మండిపడ్డారు. ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంగారెడ్డి కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని వెంటనే చెల్లించాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. మృతులకు రూ.కోటి పరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
పరిశ్రమలో 46 మంది చనిపోతే ఇప్పటివరకు కేవలం 15 మందికి, అది కూడా రూ.10లక్షల చొప్పున మాత్రమే ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గల్లంతైనట్లుగా ప్రకటించిన 8 మందిని కూడా చనిపోయినట్లుగా ధ్రువీకరించి వారి కుటుంబాలకు కూడా రూ.కోటి పరిహారం అందించాలని హరీశ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మరోవైపు, సిగాచిలో ప్రమాదానికి గల కారణమేంటనేది తేల్చడంతో పాటు నిర్వాహకులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే సిగాచి పరిశ్రమ ముందే టెంటు వేసుకొని దీక్ష చేపడతామని హెచ్చరించారు. కాగా, సిగాచి కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాల ఆవేదన వింటుంటే గుండె తరుక్కుపోతోందని.. గుండెలవిసేలా రోదిస్తున్న వారి ఆవేదన రేవంత్‌రెడ్డికి కనబడటం లేదా.. అని హరీశ్‌రావు ఎక్స్‌లో పోస్టు చేశారు. వారిని ఓదార్చాలంటే మాటలు కూడా రావడం లేదన్నారు.