Share News

Harish Rao: కేసీఆర్‌ మాటే వేదం

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:52 AM

బీఆర్‌ఎ్‌సలో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే ఉంటారని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేటీఆర్‌, కవిత మధ్య గ్యాప్‌ అనేది గిట్టనివారి ప్రచారమని కొట్టిపారేశారు.

Harish Rao: కేసీఆర్‌ మాటే వేదం

  • ఆయన ఏ బాధ్యత అప్పగించినా చేపడతా.. ఆయనే మళ్లీ కాబోయే సీఎం

  • అసెంబ్లీ, లోక్‌సభలో గెలిపించి ఉంటే సంకీర్ణంలో తెలంగాణకు మేలయ్యేది

  • రేవంతే ఐదేళ్లుంటే కాంగ్రెస్‌ కనుమరుగు

  • మేం కూడా అదే కోరుకుంటున్నాం

  • ఉపయోగం లేదనే ఎమ్మెల్సీకి పోటీ చేయలే

  • మాకు అహంకారం లేదు.. మాటతీరే అంత

  • కవిత, కేటీఆర్‌ మధ్య ఎడం అబద్ధం

  • మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు

  • ప్రతిపక్షంలో ఉంటేనే పరిణతి చెందుతాం

  • ఏబీఎన్‌ ఇంటర్వ్యూలో హరీశ్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సలో కీలక నేతల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌నే ఉంటారని బీఆర్‌ఎస్‌ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పష్టం చేశారు. కేటీఆర్‌, కవిత మధ్య గ్యాప్‌ అనేది గిట్టనివారి ప్రచారమని కొట్టిపారేశారు. కేసీఆర్‌ తమ నాయకుడని, ఆయన నిర్ణయమే శిరోధార్యమని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటతీరు, తిట్ల దండకం వల్ల ఆయన పార్టీ నేతల నుంచే మద్దతు కరవైందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవం సందర్భంగా హరీశ్‌రావు ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’


కార్యాలయానికి వచ్చి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..

బీఆర్‌ఎస్‌ విఫలమైంది. అదే పేరుతో రజతోత్సవం నిర్వహిస్తున్నారు?

జయాపజయాలు సహజం. పేరు మార్చినంత మాత్రాన విఫలమైందని అనుకోవడం సరికాదు. కేసీఆర్‌ విజన్‌ కరెక్టు. బీజేపీ సొంతంగా అధికారంలోకి రాదని, ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడుతుందని అంచనా వేశారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ పాత్ర కీలకం అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం చంద్రబాబు, నితీశ్‌లపైఆధారపడి కేంద్రం నడుస్తోంది. అసెంబ్లీలో గెలిచి, లోక్‌సభలో పొరుగు రాష్ట్రాలతో కలిసి 30-40 ఎంపీ సీట్లు బీఆర్‌ఎస్‌ గెలిస్తే ఇప్పుడు కేంద్రంలో కీలకం అయ్యే వాళ్లం. తెలంగాణకు ఎంతో మేలు జరిగేది. తెలంగాణ సాధన కోసమే పార్టీ పెట్టాం. ఎవరూ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి అందించాం. అబద్థపు హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఒక పార్టీగా వైఫల్యాలకు ఆత్మవిమర్శ చేసుకోవడం మా బాధ్యత.

సభ ఎలా ఉంటుంది? ప్రభుత్వ వైఫల్యాలా?

మీ పార్టీ ఆత్మవిమర్శా?

ప్రతిపక్షంగా సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తాం. పాలించే అవకాశం వాళ్లకి, ప్రశ్నించే అధికారం మాకు ప్రజలు ఇచ్చారు. కేసీఆర్‌ ఏం మాట్లాడతారో ముందే ఎలా చెబుతాం. పేపర్‌ లీకేజీ అవుతుంది.


కేసీఆర్‌ ఎందుకు అసెంబ్లీకి వెళ్లడం లేదు?

అదో వ్యూహం. ఎన్టీఆర్‌, బాబు, జయలలిత కూడా గతంలో ఒక ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీకి వెళ్లలేదు. సభలో మేం సర్కారును ప్రశ్నిస్తున్నాం. మా లైన్‌ అంతా కేసీఆరే ఇస్తున్నారు. కాంగ్రెస్‌ వచ్చాక పరిపాలన వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. పెట్టుబడులు రావడం లేదు. రియాల్టీ దెబ్బతింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

ఎందుకా పరిస్థితి వచ్చింది?

పోటీ చేయకుండా ఉండటం కూడా ఒక వ్యుహం. ఆ ఒక్క సీటుకు పోటీ చేసినా అందులో గెలిచినా ఉపయోగం లేదు. ప్రభుత్వం పడిపోయేది లేదు. ఎప్పుడు పోటీ చేయాలి ఎప్పుడు వద్దు అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోమని ముందే చెప్పాం.


కేసీఆర్‌ కామెంట్స్‌, నేతల

అహంకారం వల్లే ఓడిపోయారా?

మాలో ఎవరికి అహంకారం లేదు. మాలో కొందరి మాటతీరు, ప్రశ్నించే తీరు వల్ల అలా కనిపించవచ్చు. ప్రజలు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించలేదు. మాకు గౌరవప్రదమైన సీట్లు ఇచ్చారు. ఆయన కామెంట్ల వల్లే మేం ఓడిపోలేదు. ప్రజలు ఆశీర్విదిస్తే పాలిస్తం..లేకుంటా తప్పుకుంటామని కేసీఆర్‌ సహజంగా చెప్పారు. మళ్లీ కేసీఆరే కావాలని రైతులు కోరుకుంటున్నారు.

వారసులు ఎవరు?

కేసీఆరే మా నాయకుడు. మళ్లీ ఆయనే మా సీఎం. కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకున్నా పాటిస్తాం. కట్టుబడి ఉంటాం. కేసీఆర్‌ నాకు ఏ బాధ్యతలు అప్పగిస్తే వాటిని సంతోషంగా స్వీకరిస్తా. నేను కార్యకర్తను. ఉద్యమ కారుడిని. ఇచ్చిన పాత్రకు న్యాయం చేస్తా.


కేటీఆర్‌, కవిత మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోందా?

అదంతా సోషల్‌ మీడియా చేస్తోంది. గిట్టని వాళ్లు దుష్ఫ్రచారం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పాలనపై కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారు. ప్రజలు నమ్మారు.

రేవంత్‌ టార్గెట్‌గా మీ రాజకీయాలు ఉన్నాయి?

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన్ను కాల్చిపారేయాలని రేవంత్‌ అన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే ఆయన భాషలోనే కొందరు సమాధానం చెబుతారు.

కాంగ్రె్‌సలో ఒకరిద్దరు తప్ప మిగతా వారు

రేవంత్‌ను కాచుకోవడం లేదు?

అది కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహరం. రేవంత్‌ కూడా ఆయన పరిధి దాటి మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని ఆయనకు ఆ పార్టీ వాళ్లే చాలాసార్లు చెప్పారు. కాంగ్రె్‌సకు నష్టం చేస్తుందని వాళ్లే చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాదిరిగా మాట్లాడితే వాళ్లేందుకు ఆయన్ను కాపాడుకుంటారు? ప్రజల్ని మోసం చేస్తే వాళ్లేందుకు కాపు కాస్తారు? ఈ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని, రేవంతే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నా. ఐదేళ్లుంటే మళ్లీ 20 ఏళ్లు కాంగ్రె్‌సకు ఓటేయ్యరు.


బీజేపీ, బీఆర్‌ఎస్‌ బంధం ఏంటి?

బీజేపీకి బీఆర్‌ఎస్‌ దగ్గరగా ఉండదు. కేంద్రంలో కీలకంగా ఉండాలనేది మా లక్ష్యం. ఎంపీ జనరల్‌ ఎన్నికల్లో బీజేపీకి దూరంగానే ఉన్నాం. ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్‌ ఎన్నికలు కాంగ్రెస్‌, బీజేపీ అనే పద్ధతిలో జరిగాయి. రెండు పార్టీలు ఎనిమిదేసి చొప్పున గెలిచి ఉపయోగం లేకుండా పోయింది. నిధులు కూడా తీసుకురాలేక పోయారు.

బీఆర్‌ఎ్‌సపై కుంభకోణాల ఆరోపణలకు

వరంగల్‌ సభలో బదులిస్తారా?

సభలో ఏం మాట్లాడాలో మా వ్యుహం మాకుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే కేసులు బయటకు తెస్తున్నారు. కోర్టుల్లో అవి నిలబడవు.


కేటీఆర్‌, కవిత రౌడీలుగా మారామంటున్నారు. మీరేందుకు మారడం లేదు?

పోలీసులు కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఆ వ్యాఖ్యలు చేశారు.

అధికారంలో లేకపోతే ఎలా ఉంది?

సర్కారులో ఉన్నదానికంటే ఉద్యమంలో ఉండటమే ఎక్కువగా సంతృప్తినిచ్చింది. ప్రతిపక్షంలో సమర్థంగా అధికారపక్షాన్ని నిలదీస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకుడిగా పరిణతి చెందుతాం. శాసనసభకు బాగా ప్రిపేర్‌ అయి వెళ్తున్నాం. మంత్రిగా ఉన్నప్పుడు నిద్ర కూడా పోలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాడు అద్దాల మేడలో ఉన్నట్లు ఉండేది. ప్రస్తుతం ప్రజలకు దగ్గరయ్యే గొప్ప అవకాశం లభించింది. ప్రతిపక్ష నేతగా ఎంజాయ్‌ చేస్తున్నా.


ఈ వార్తలు కూడా చదవండి..

సీటీ స్కాన్‌లో బయటపడ్డ షాకింగ్ విషయం..

వృద్ధిరేటులో ఏపీ రాష్ట్రానికి రెండో స్థానం

పేదవారి కళ్లలో.. ఆనందం చూశా

For More AP News and Telugu News

Updated Date - Apr 26 , 2025 | 03:52 AM