GST Scam: 3000 కోట్లు రాబట్టొచ్చు..
ABN , Publish Date - Feb 11 , 2025 | 04:06 AM
వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణంలో అక్రమార్కుల నుంచి రూ.3,000 కోట్ల వరకు వసూలు చేయాలని ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది.

జీఎస్టీ స్కాంపై ఉన్నతస్థాయి కమిటీ అంచనా
పన్ను ఎగవేత, పెనాల్టీలు, ఐటీసీ క్లెయిమ్‌లు
డీలర్ల నుంచి 3 రకాలుగా డబ్బు రాబట్టే చాన్స్
ఇప్పటికే 76 కంపెనీలు, డీలర్లకు నోటీసులు
ఏకంగా రూ.21 కోట్లు చెల్లించిన ఓ కంపెనీ
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కుంభకోణంలో అక్రమార్కుల నుంచి రూ.3,000 కోట్ల వరకు వసూలు చేయాలని ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. ఇప్పటికే ఓ కంపెనీ నుంచి రూ.21 కోట్లను వసూలు చేసినట్లు సమాచారం. రకరకాలుగా జరిగిన అక్రమాలన్నింటినీ కమిటీ తవ్వి తీసి, అవకతవకలకు పాల్పడిన కంపెనీలు, డీలర్లకు నోటీసులు జారీ చేసిందని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎలాంటి వస్తువులు విక్రయించక పోయినా విక్రయించినట్లు కొంత మంది డీలర్లు దొంగ ‘ట్యాక్స్ ఇన్వాయి్‌స’లను సృష్టించి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ)ను కొల్లగొట్టినట్లు ఏడాది కిందట రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనరేట్ గుర్తించింది. మరో కేసులో ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేయకపోయినా తయారు చేసినట్లు, బైక్‌లను అమ్మకపోయినా అమ్మినట్లు తప్పుడు రిటర్నులు దాఖలు చేసి, ముడి సరుకుపై ఎక్కువ మొత్తంలో ఐటీసీని క్లెయిమ్ చేసి, ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడిచారు. ఇలా జీఎ్‌సటీలో జరిగిన రకరకాల మోసాలకు సంబంధించి రూ.1,400 కోట్లకు పైగా కుంభకోణం చోటు చేసుకున్నట్లు అప్పట్లో ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా, ఈ కేసుతో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు, మరో ఇద్దరు వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. కేసు గాఢతను పరిశీలించిన ప్రభుత్వం... దీనిని మొదట సిటీ క్రైమ్ స్టేషన్(సీసీఎ్‌స)కు అప్పగించింది. అనంతర కాలంలో సీఐడీకి బదిలీ చేసింది. పన్నుల ఎగవేత, తక్కువ పన్ను చెల్లింపు, దొంగ ఇన్వాయి్‌సలతో ఐటీసీని కొల్లగొట్టడం వంటి అక్రమాలను తేల్చడానికి అప్పటి వాణిజ్య పన్నుల రాష్ట్ర కమిషనర్, ప్రస్తుత పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. కమిటీలో వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్లు దీపారెడ్డి, ఏడుకొండలు, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఐఐసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తిలను సభ్యులుగా నియమించింది.
ఇలా అక్రమాలు
సాధారణంగా ఒక రాష్ట్రంలోని డీలర్లు, మరో రాష్ట్రంలోని డీలర్లకు విక్రయించే వస్తువులపై ‘ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(ఐజీఎ్‌సటీ)’ను కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి, వస్తువులను కొనుగోలు చేసిన రాష్ట్రానికి చెరో 50 శాతం మేర సొమ్ము వెళుతుంది. తెలంగాణలో కొంత మంది డీలర్లు... ఇతర రాష్ట్రాల వారికి వస్తువులను విక్రయించినట్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయి్‌సలను సృష్టించారు. ప్రధానంగా 18 శాతం ట్యాక్స్ ఉన్న ఇనుము, ఇత్తడి, రాగి స్ర్కాప్ వంటి వాటిని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు లెక్కలు సమర్పించారు. భౌతికంగా ఈ వస్తు రవాణా జరగకపోయినా జరిగినట్లు చూపి, ఇన్వాయి్‌సలను ఇతర రాష్ట్రాల డీలర్లకు పంపించారు. ఈ ఇన్వాయి్‌సలను ఆధారంగా చేసుకుని ఇతర రాష్ట్రాల డీలర్లు 18 శాతం ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జీఎ్‌సటీ కౌన్సిల్ నుంచి క్లెయిమ్ చేశారు. ఈ సొమ్మును ఇతర రాష్ట్రాల డీలర్లతో పాటు వస్తువులను సరఫరా చేసిన తెలంగాణ డీలర్లు పంచుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అప్పట్లో గుర్తించారు. ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి, బైక్‌లను తయారు చేసినట్లు ముడిపదార్థాలపై కొంత మంది ఆటోమొబైల్ డీలర్లు ఎక్కువ మొత్తంలో ఐటీసీని క్లెయిమ్ చేసుకున్నారని తేలింది.
బైక్‌ల అమ్మకాలపై ఉన్న 5 శాతం జీఎ్‌సటీని ప్రభుత్వానికి జమ చేస్తూ... ముడి పదార్థాలపై ఉన్న 12, 18 శాతాల జీఎ్‌సటీని ఐటీసీ రూపంలో క్లెయిమ్ చేసుకున్నారని గుర్తించారు. ఇలా పన్ను వ్యత్యాసాలను ఆధారంగా చేసుకుని, ఐటీసీ మోసాలకు పాల్పడ్డారు. ఇలాంటి రకరకాల పన్ను మోసాలకు సంబంధించి దాదాపు రూ.1,400 కోట్లకు పైగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు అప్పట్లో అంచనా వేశారు. అయితే సోమేశ్ కుమార్ హయాంలోనే ఐజీఎ్‌సటీ, స్టేట్ జీఎ్‌సటీ(ఎ్‌సజీఎ్‌సటీ), సెంట్రల్ జీఎ్‌సటీ(సీజీఎ్‌సటీ)లకు సంబంధించి పన్ను ఎగవేతలు, బకాయిలు వంటి వాటిని గుర్తించడానికి వాణిజ్య పన్నుల శాఖ ఐఐటీ-హైదరాబాద్‌తో ఒక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించింది. అయినప్పటికీ రూ.1,400 కోట్ల కుంభకోణం జరిగింది. ఎందుకు కనిపెట్టలేక పోయారని అంతర్గత ఆడిటింగ్ బృందం తవ్వగా ఐజీఎ్‌సటీ ఎగవేతలు, ఐటీసీ క్లెయిమ్‌లను గుర్తించే స్ర్కూటినీ మాడ్యూల్‌ను సాఫ్ట్‌వేర్ డేటా బేస్‌లో కనిపించకుండా మాస్క్ చేసి పెట్టినట్లుగా తేలింది. సోమేశ్ కుమార్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ‘స్పెషల్ ఇనీషియేటివ్స్’ వాట్సాప్ గ్రూపు ద్వారా ఇచ్చిన సందేశాలను అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాంప్రసాద్, ఐఐటీ-హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు అనుసరించి, ఐజీఎ్‌సటీ మాడ్యూల్ పని చేయకుండా చేశారన్న ఆరోపణలు వెలువడ్డాయి. దాంతో ఈ నలుగురితో పాటు సాఫ్ట్‌వేర్‌కు సాంకేతిక సహకారం అదించిన ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కాశీ విశ్వేశ్వరరావు, శివరాంప్రసాద్‌లను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు పంపించింది.
రూ.3000 కోట్ల వరకు అంచనా
సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేయడం, తర్వాత సీఐడీకి బదిలీ కావడం వంటి సంఘటనల నేపథ్యంలో టీకే శ్రీదేవి చైర్‌పర్సన్‌గా ఉన్న ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ పన్ను ఎగవేతలు, ఐటీసీ క్లెయిమ్‌లకు సంబంధించి విచారణ చేపట్టింది. ఎవరెవరు ఎంత మొత్తంలో పన్నును ఎగవేశారు, దానికి ఫెనాల్టీతో కలిపి ఎంత మొత్తమవుతుందన్న వివరాలు సేకరించింది. దొంగ ఇన్వాయి్‌సలతో ఐటీసీని క్లెయిమ్ చేసిన కంపెనీలు, డీలర్లను కూడా గుర్తించింది. వీరందరి నుంచి ఐటీసీ, ఎగవేసిన పన్ను, ఫెనాల్టీలన్నింటినీ వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.3000 కోట్లు సమకూరుతాయని అంచనా వేసింది. ఇప్పటికే ఈ అక్రమాలకు సంబంధించిన 76 కంపెనీలు, డీలర్లకు కమిటీ నోటీసులు పంపించిందని సమాచారం. వెంటనే సొమ్మును చెల్లించాలని సూచించినట్లు తెలిసింది. ఈ సమాచారాన్ని సీఐడీకి కూడా అందించినట్లు సమాచారం.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
For Telangana News And Telugu News