Share News

Private Medical Colleges: ప్రైవేటు వైద్య కళాశాలలపై విజిలెన్స్‌ విచారణ

ABN , Publish Date - Jul 28 , 2025 | 04:13 AM

రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో వైద్యవిద్యలో నాణ్యతాప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తాజాగా చర్యలకు ఉపక్రమించింది.

Private Medical Colleges: ప్రైవేటు వైద్య కళాశాలలపై విజిలెన్స్‌ విచారణ

  • వైద్యవిద్యలో నాణ్యత, సదుపాయాలపై ఫిర్యాదులతో సర్కారు నిర్ణయం

  • ఇటీవలే మూడు కాలేజీలపై విచారణ.. అవకతవకలు జరుగుతున్నట్టు గుర్తింపు

  • విద్యార్థుల స్టైపెండ్‌కు ఎగనామం.. అధ్యాపకులు, మౌలిక సదుపాయాల కొరత

  • 17 అంశాలపై వివరాలు ఇవ్వాలని అన్ని ప్రైవేటు కాలేజీలను కోరిన సర్కారు

  • స్పందించని పలు కాలేజీలు.. ప్రభుత్వం సీరియస్‌.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశం

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలపై ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. కళాశాలలపై వచ్చిన ఫిర్యాదులు, ఇప్పటికే కొన్ని కాలేజీల్లో బయటపడిన అవకతవకల నేపథ్యంలో వైద్యవిద్యలో నాణ్యతాప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని తాజాగా చర్యలకు ఉపక్రమించింది. వాస్తవానికి రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్య కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు ముందు నుంచే ఉన్నాయి. అందులో మూడు కాలేజీలపై కొన్నిరోజుల కింద వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. సర్కారు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆ విచారణలో పలు అవకతవకలను విజిలెన్స్‌ గుర్తించింది. అధ్యాపకులు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాల కొరతతోపాటు ఏళ్లుగా వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌ ఇవ్వడం లేదని తేల్చి.. సర్కారుకు నివేదిక ఇచ్చింది. సదరు కాలేజీల్లో సీట్ల కోత, అడ్మిషన్ల రద్దుతోపాటు క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని సిఫారసు చేసింది. ఈ క్రమంలో మిగతా ప్రైవేటు వైద్య కాలేజీలపై వచ్చిన ఫిర్యాదులపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల నుంచి అవసరమైన సమాచారం తీసుకోవాలని వైద్యశాఖను ఆదేశించింది. రంగంలోకి దిగిన వైద్య శాఖ.. ఇన్‌పేషెంట్‌, ఔట్‌ పేషెంట్‌ చికిత్సలు, ప్రసవాలు, శస్త్రచికిత్సలు, డయాగ్నస్టిక్స్‌ సేవలు, పడకలు, ఇతర సదుపాయాలు, వైద్య పరికరాలు, అధ్యాపకుల సంఖ్య, వారి హాజరు, విద్యార్థుల వివరాలు సహా 17 అంశాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని కాలేజీలను కోరింది. ప్రభుత్వం మొత్తం 29 కాలేజీలను ఈ వివరాలివ్వాలని కోరింది.


అందులో 15 కాలేజీలు స్పందించగా, 6 కాలేజీలు కొత్తగా వచ్చామని, నాలుగేళ్ల పూర్తి బ్యాచ్‌లు రాలేదని తెలిపాయి. 4 కాలేజీలు అరకొర సమాచారం ఇవ్వగా, మరో నాలుగు కాలేజీలు వివరాలేవీ ఇవ్వలేదు. అయితే కొన్ని కాలేజీలు తప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా గుర్తించామని వైద్యవర్గాలు తెలిపాయి. ఉదాహరణకు ఓ ప్రైవేటు కాలేజీ బోధనాస్పత్రిలో ఏడాదికాలంలో 4 లక్షల ఓపీ నమోదైనట్టు పేర్కొన్నారు. అందులో 70 వేలు మాత్రమే అబా (ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌) రిజిస్ట్రే్ట్రషన్‌ చేసినట్లు చూపారు. కానీ ఇందులో సగం ఓపీ నకిలీయేనని వైద్యవర్గాలు తెలిపాయి. మరో కాలేజీలో గైనకాలజీ విభాగం లేకపోయినా కూడా పెద్ద సంఖ్యలో డెలివరీలు జరుగుతున్నట్టు చూపారని వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణకు ఆదేశించినట్టు తెలిపాయి. వాస్తవానికి ప్రైవేటు కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వాల పర్యవేక్షణ పెద్దగా ఉండదు. పర్యవేక్షణ అంతా జాతీయ వైద్య కమిషన్‌ చూసుకుంటుంది. కొత్త వైద్య కాలేజీల ఏర్పాటుకు ముందు, సీట్ల పెంపు, కొత్త కోర్సులకు అనుమతుల కోసం.. ప్రభుత్వం ఇచ్చే ‘ఎసెన్షియాలిటీ’ సర్టిఫికెట్‌, ఆరోగ్య యూనివర్సిటీ ఇచ్చే ‘అనుబంధ గుర్తింపు (కన్సెంట్‌ ఆఫ్‌ అఫిలియేషన్‌) అవసరం. మరే సందర్భాల్లోనూ ప్రభుత్వ జోక్యం ఉండదు. దీనితో ప్రైవేటు వైద్య కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలని మెడికోలు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి...

గాజాపై దాడులకు విరామం.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం

కంబోడియా, థాయ్‌లాండ్ తక్షణం చర్చలు చేపట్టేందుకు రెడీ.. డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 28 , 2025 | 04:13 AM