GST Scam: సోమేశ్ ఆదేశించారు.. వారు పాటించారు!
ABN , Publish Date - Feb 21 , 2025 | 03:45 AM
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్‌లు చేసి ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో.. ఎవరెవరి పాత్ర ఏంటి? ఏమేం వ్యవహారాలు నడిచాయి? అన్నదానిపై నివేదిక సిద్ధమైంది.

జీఎస్టీ కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక సిద్ధం
స్కాంలో ఎవరెవరి పాత్ర ఎంత అన్నది తేల్చిన నివేదిక!
సోమేశ్‌కుమార్ సహా నలుగురు అధికారుల ఫోన్ల స్వాధీనం
‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ వాట్సాప్ గ్రూప్‌లోని సందేశాల రిట్రీవ్
మొత్తం 1100 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు నిర్ధారణ!
ముడిసరుకులు కొనకుండానే కొన్నట్లు దొంగ ఇన్వాయి్‌సలు
ఈ-బైక్‌లు తయారు చేయకుండానే అమ్మినట్లు రికార్డులు
జీఎస్టీ చెల్లించినట్లు చూపి.. దొంగ ఇన్వాయి్‌సలతో రిఫండ్
విచారణకు ఫోరెన్సిక్ నివేదిక ఉపకరిస్తుందన్న అభిప్రాయం
ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కుంభకోణంలో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తయింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడం, దొంగ క్లెయిమ్‌లు చేసి ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం నుంచే డబ్బులు లాగేసిన కేసులో.. ఎవరెవరి పాత్ర ఏంటి? ఏమేం వ్యవహారాలు నడిచాయి? అన్నదానిపై నివేదిక సిద్ధమైంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండడంతోపాటు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ బాధ్యతలను కూడా తన దగ్గరే ఉంచుకున్న సోమేశ్‌కుమార్, మరో ఇద్దరు అధికారులు, ఒక సాంకేతిక నిపుణుడిపై ఈ కుంభకోణంలో గతంలోనే కేసు పెట్టారు. ఈ నలుగురు కలిసి అప్పట్లో ‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రూప్‌లో అప్పటి వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వర్‌రావు, డిప్యూటీ కమిషనర్ శివరాంప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్‌బాబు ఉన్నారు. గ్రూప్‌లో సోమేశ్‌కుమార్ ఇచ్చే ఆదేశాలను మిగిలిన ముగ్గురు పాటించేవారు. జీఎస్టీ పన్నులకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ తయారీలో సహకరించిన ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ కుంభకోణంలో పాలుపంచుకుంది. దీంతో అప్పట్లో సోమేశ్‌కుమార్ వాడిన ఫోన్‌తోపాటు మిగిలిన ముగ్గురి ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆ ఫోన్లలో పాత వాట్సాప్ సందేశాలన్నింటినీ తొలగించారు.
వాట్సాప్ గ్రూప్‌ను కూడా తీసేశారు. అయితే ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపులో సోమేశ్‌కుమార్‌కు, మిగిలిన వారికి మధ్య జరిగిన పరస్పర సందేశాలన్నింటినీ రిట్రీవ్ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ నివేదికను ప్రభుత్వానికి, న్యాయస్థానానికి కూడా సమర్పించే అవకాశాలున్నాయి. జీఎ్‌సటీ కుంభకోణంలో సుమారు రూ.1100 కోట్ల అక్రమాలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. రూ.3 వేల కోట్ల మేర పన్నుల ఎగవేతకు సంబంధించి వివిధ సంస్థలకు నోటీసులిచ్చి విచారించగా.. చివరకు ఈ మేరకు తేలినట్లు సమాచారం. ఈ విషయంపై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో వెలుగుచూసిన సందేశాలు బలంగా ఉపకరిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కుంభకోణంలో రెండు రకాల అక్రమాలున్నాయి. ఒకటి.. ఎలాంటి వస్తువులు విక్రయించకపోయినా విక్రయించినట్లు కొందరు డీలర్లు దొంగ ట్యాక్స్ ఇన్వాయి్‌సలు సృష్టించారు. వారి నుంచి.. వస్తువులను ఉత్పత్తి చేసేందుకు ముడిసరుకులు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయి్‌సలు సృష్టించి, ఆ ముడిసరుకులపై పన్నులు చెల్లించినట్లు చూపించి, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసి.. జీఎస్టీ కౌన్సిల్ నుంచి రీఫండ్ రూపంలో సొమ్ములు లాగేశారు. అయితే వారు నిజంగా ముడిసరుకులు కొన్నారా? లేదా? అన్నది తేల్చాల్సింది వాణిజ్యపన్నుల శాఖలోని సాఫ్ట్‌వేర్. కానీ, దానిలో సుమారు 76 సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని చేర్చకుండా ఈ కుంభకోణానికి సహకరించారు. మరో కేసులో ఎలక్ర్టానిక్ బైక్‌లు తయారు చేయకపోయినా.. తయారు చేసినట్లు వ్యవహారం నడిపించారు. ఒక ఈ-బైక్‌ను అమ్మితే ఐదు శాతం జీఎ్‌సటీ చెల్లించాలి. అది ప్రభుత్వానికి చెల్లించారు. కానీ, ఆ బైక్‌ల తయారీకి ఉపయోగించే స్పేర్‌పార్ట్‌లు, పరికరాలపై 12 నుంచి 18 శాతం జీఎ్‌సటీ చెల్లించాల్సి ఉంటుంది.
బైక్‌లను తయారు చేయకుండానే..
బైక్‌లను తయారు చేయకపోయినా తయారు చేసినట్లు చూపించి.. ఆ మేరకు ఐదుశాతం జీఎ్‌సటీ కట్టేసి, స్పేర్‌పార్ట్‌లు, పరికరాల కొనుగోలుపై ఉన్న 12నుంచి 18శాతం జీఎ్‌సటీ చెల్లించినట్లు చూపించారు. అంటే ఒక బైక్ అమ్మేటప్పుడు చెల్లించిన 5శాతం జీఎ్‌సటీ కంటే చాలా ఎక్కువగా.. ఆ బైక్‌ను తయారుచేసే క్రమంలో కొనుగోలు చేసే స్పేర్‌పార్ట్‌లు, పరికరాలకు జీఎ్‌సటీ చెల్లించినట్లు దొంగ రికార్డులు తయారు చేశారు. ఇలా అధికంగా చెల్లించినట్లు తయారుచేసిన దొంగ రికార్డులు, నకిలీ ఇన్వాయి్‌సల ఆధారంగా.. అధికంగా చెల్లించిన జీఎ్‌సటీ మొత్తాన్ని ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకున్నారు. ఈ వ్యవహారాలపై సీసీఎస్ పోలీసులు తొలుత కేసు నమోదు చేసి, ఆ తర్వాత సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి పర్యవేక్షణ కమిటీ దీనిపై విచారణ చేపట్టింది. ఈ కమిటీకి టి.కె.శ్రీదేవి చైర్‌పర్సన్‌గా ఉండగా.. మరికొందరు అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇటీవలే ఈ కమిటీ పన్ను ఎగవేసిన సంస్థలకు నోటీసులు జారీచేసి వడ్డీతో సహా పన్ను కట్టాలని ఆదేశించింది. కొన్ని కంపెనీలు ఇప్పటికే వాటిని చెల్లించాయి కూడా. అయితే ఉద్దేశపూర్వకంగా చేసిన కుంభకోణం కావడంతో.. ముఖ్యంగా ఈ బైక్‌లు తయారు చేసినట్లు చూపించి జీఎ్‌సటీ రీఫండ్ కాజేసిన కంపెనీతోపాటు, మరో నాలుగు కంపెనీలపై గతంలోనే పోలీసు కేసులు పెట్టి అరెస్టు కూడా చేశారు. పన్ను ఎగవేతదారుల నుంచి పన్నులు వసూలు చేయడం, కావాలని కుంభకోణం చేసినవారిపై పోలీసు కేసులు ముందుకు వెళ్లేందుకు ఇప్పుడు చేసిన ఫోరెన్సిక్ ఆడిట్ ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్నీ తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: ఈసీ కన్నా జగన్ గొప్పవాడా?
Also Read: ఎమ్మెల్యేకి తీవ్ర అనారోగ్యం.. ఆసుపత్రిలో చేరిక
Also Read: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కీలక మార్పులు..
Also Read: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష.. హైకోర్టు కీలక తీర్పు
Also Read: రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆప్ ఎంపీ ప్రత్యక్షం
For Telangana News And Telugu News