Share News

Floods: మేడిగడ్డకు భారీ వరద

ABN , Publish Date - Jul 11 , 2025 | 06:13 AM

మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో గోదావరి నది నిండుకుండలా ప్రవహిస్తోంది.

Floods: మేడిగడ్డకు భారీ వరద

  • ప్రాణహితకు 6.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  • ఆసిఫాబాద్‌ జిల్లాలో 11 ఊళ్లకు దారి బంద్‌

  • కాళేశ్వరం, భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

  • జూరాల, శ్రీశైలం, సాగర్‌కు నిలకడగా ప్రవాహం

  • కృష్ణా ప్రాజెక్టుల్లో జల విద్యుత్‌ కాంతులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : మహారాష్ట్రలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో ప్రాణహిత నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో గోదావరి నది నిండుకుండలా ప్రవహిస్తోంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద గురువారం సాయంత్రం 6.65 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో 85 గేట్లను ఎత్తి అంతే నీటిని వదులుతున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి 10.6 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటి మట్టం 25.8 అడుగులకు చేరింది. గద్వాల జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న జూరాల జలాశయానికి 1.07 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. 12 గేట్లు ఎత్తి, విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ, కాల్వల ద్వారా 1.13 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. 9 టీఎంసీల సామర్థ్యానికిగాను ప్రాజెక్టులో 7.4 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు 1.75 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. మూడు గేట్లను పది ఫీట్ల మేర ఎత్తడంతో పాటు విద్యుదుత్పత్తి చేస్తూ, పోతిరెడ్డిపాడు, ఎంజీకేఎల్‌ఐ ద్వారా 1,70,347 క్యూసెక్కులను వదులుతున్నారు. ప్రాజెక్టులో 203.4 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్‌కు 1,20,191 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. వరద ఇలాగే కొనసాగితే శుక్రవారం సాయంత్రం ప్రాజెక్టు నీటి మట్టం (546 అడుగులు) గేట్లను తాకనుంది. సాగర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు(312టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 541.20 అడుగులు(190.8 టీఎంసీలు)గా ఉంది. ఎడమ కాల్వ ద్వారా 3,202 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,500 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 4,204 క్యూసెక్కులు.. మొత్తంగా 8,906 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణాకు వరద పోటెత్తుతుండటంతో ఆ నదిపై ఉన్న జలవిద్యుత్‌ కేంద్రాల్లో గురువారం 26 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది.


ఆదిలాబాద్‌ జిల్లాలో జోరు వాన..

ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి సాయంత్రం ముసురు వాన పడింది. అత్యధికంగా భీంపూర్‌ మండలంలో 76.8 మి.మీ, జైనథ్‌లో 76.1, సాత్నాలలో 68.3, ఇంద్రవెల్లిలో 52.1, బోరజ్‌లో 51.0, నార్నూర్‌లో 47.4, బేలలో 45.4, ఆదిలాబాద్‌ అర్బన్‌లో 38.5 మి.మీ వర్షం కురిసింది. గాదిగూడ మండలంలో ఖడ్గి వాగు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రాణహితకు వరద పోటెత్తడంతో నది సరిహద్దున ఉన్న సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, పెంచికల్‌పేట, దహెగాం మండలాల్లో బ్యాక్‌వాటర్‌ ముంచెత్తడంతో వాగులు, ఒర్రెలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో బెజ్జూరు మండలంలోని 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత తీరంలో సుమారు 1,500 ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు నీట మునిగాయి. కుమరంభీం ప్రాజెక్టులోకి 850 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో రెండు గేట్లు ఎత్తి 880 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 06:13 AM