Fire Accident: యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:31 AM
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్) యూనిట్-1లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది.

ఆయిల్ పైప్‌లైన్ లీకై అంటుకున్న మంటలు
దామరచర్ల, హైదరాబాద్, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (వైటీపీఎస్) యూనిట్-1లో ఆదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ యూనిట్లో 800 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తికి సంబంధించి ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో ఆయిల్ పైప్‌లైన్ లీకైంది. చిమ్నీ దిగువన అత్యంత వేడిగా ఉండే భాగాలపై ఈ ఆయిల్ పడటంతో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది కాసేపట్లోనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే సుమారు 30 మీటర్ల ఎత్తులోని కేబుల్ కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు.
లక్షల్లో ఆస్తినష్టం ఉండవచ్చని అంచనా వేశారు. యూనిట్-1 నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో.. వచ్చే నెలలో జాతికి అంకితం చేయనున్నారు. కాగా, వైటీపీఎ్‌సలో అగ్ని ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సోమవారం జెన్‌కో సీఎండీ సందీ్‌పకుమార్ సుల్తానియా, బీహెచ్‌ఈఎల్ సీఎండీ సదా శివమూర్తి, జెన్‌కో, బీహెచ్‌ఈఎల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. రెండు రోజుల్లో మరమ్మతులు పూర్తిచేసి, పనులు పునః ప్రారంభించాలని ఆదేశించారు. కాగా.. ఆయిల్ లీకేజీ ప్రమాదానికి కారణమని, యూనిట్-1 ఇంకా నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్ ఆధీనంలోనే ఉందని జెన్‌కో యాదాద్రి ప్రాజెక్టు డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్(కన్‌స్ట్రక్షన్) ఒక ప్రకటనలో తెలిపారు.