Fake Liquor: ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే!
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:13 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనకు ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది.

కల్తీ కల్లు విక్రయాలకు బాధ్యులు వారే!
హైదరాబాద్‌లో 90 శాతం కల్లు కల్తీయే
కూకట్‌పల్లి ఘటనకు ముందు 20 కల్లు నమూనాలు పరీక్షిస్తే అన్నిట్లో అల్ర్పాజోలం
అయినా.. కళ్లు మూసుకున్న ఆబ్కారీ శాఖ
దుర్ఘటన తర్వాత పరీక్షల్లోనూ అల్ర్పాజోలమే
కఠిన చర్యలు తీసుకునే యోచనలో సర్కారు
పదికి చేరిన ‘కల్తీ కల్లు’ మృతుల సంఖ్య!
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనకు ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పలుచోట్ల ప్రమాదకరమైన మత్తు పదార్థాలతో కల్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. అందుకే కల్లీ కల్లు విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, కూకట్‌పల్లిలో 8 మంది ప్రాణాలు కోల్పోయేందుకూ ఇదే కారణమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 8న ఈ ఘటన జరగడానికి కొన్ని నెలల ముందే ఆబ్కారీ అధికారులు హైదరాబాద్ నగరంలో 20 కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అక్కడ జరిపిన కెమికల్ ఎగ్జామినేషన్‌లో ఈ నమూనాల్నింట్లోనూ ప్రమాదకరమైన ఆల్ర్ఫాజోలం ఉన్నట్లు తేలింది. అయినా.. ఎక్సైజ్ అధికారులు ఈ ల్యాబ్ నివేదికలను తమ వద్దనే పెట్టుకున్నారు తప్ప.. కల్తీ కల్లు వ్యాపారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. దాంతో కల్తీ కల్లు విక్రయం నిరాటంకంగా కొనసాగింది. చివరికి 8 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన తరువాత కూడా ఈ నెల 8న, 11న ఎస్టీఎఫ్ బృందాలు హైదరాబాద్‌లో మళ్లీ 20 కల్లు నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించాయి. కెమికల్ ఎగ్జామిన్‌లో వీటన్నింటిలోనూ ఆల్ర్ఫాజోలం ఉన్నట్లు తేలిందని తెలుస్తోంది. అయినా.. కల్లు తాగేవారి తనువంతా విషంతో నింపుతున్న వారిపై ఎటువంటి చర్యలూ తీసుకోలేని పరిస్థితుల్లో ఎక్సైజ్ శాఖ ఉంది.
విక్రయదారులకు లొసుగులు చెప్పి మరీ..
కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఎక్సైజ్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, చట్టంలోని లొసుగులను విక్రయదారులకు చెప్పి మరీ అమ్మకాలు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్లు కల్తీ జరిగిందని గుర్తిస్తే కనీసం సొసైటీ పాలకవర్గాన్ని తప్పించి.. కొత్త పాలకవర్గం ద్వారా దానిపై ఆధారపడిన సభ్యులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, పాలకవర్గాన్ని కనీసం హెచ్చరించే సాహసం కూడా ఆబ్కారీ శాఖ చేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కల్తీ కల్లు విక్రయాలకు అడ్డే లేకుండా పోయిందని అంటున్నారు. హైదరాబాద్‌లో తయారవుతున్న కల్లు 90 శాతం కల్తీయేనని అధికారులు ఇప్పటికే గుర్తించారని, అయినా.. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వమే కఠిన చర్యలు తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కల్లు తాగిన వారి నమూనాలు పరిశీలిస్తే..
రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో రెండు జిల్లాలు తప్ప.. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో కల్తీ విక్రయం యథేచ్చగా సాగుతోందన్న ఆరోపణలున్నాయి. కల్లు తాగి అనారోగ్యాల బారిన పడుతున్న వ్యక్తుల నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని ప్రయోగశాలలో టాక్సికాలజీ పరీక్షలు చేస్తే.. అందులో క్లోరోహైడ్రేట్, డైజోఫాం, ఆల్ర్ఫాజోలం వంటి కల్తీ పదార్థాల అవశేషాలు ఉన్నాయో లేదో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ, ఈ విషయంపై ఆబ్కారీ శాఖ ఏనాడూ కసరత్తు చేసిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి. దీంతో ప్రమాదకర మత్తు పదార్థాలను కల్లులో మోతాదుకు మించి కలిపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మెథనాల్, కొన్ని రకాల బ్యాటరీ ఆమ్లాలు కూడా కలుపుతున్నారు. ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్న ఈ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో కల్తీ కల్లు తాగే వారి ఆయుస్సు 20 ఏళ్లు తగ్గిపోతుందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకు కల్తీ కల్లు
రాష్ట్రంలో వాటర్ బాటిల్ కంటే కూడా తక్కువ ధరకు కల్లు సీసా దొరుకుతుండడం గమనార్హం. తాగునీరు లీటర్ ధర రూ.20 ఉంటుండగా.. 650 మిల్లీ లీటర్ల కల్లు సీసా రూ.11కే దొరుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సీసా ధర గరిష్ఠంగా రూ.15 ఉంటే.. హైదరాబాద్ లాంటి చోట్ల మాత్రం అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తాటి, ఈత చెట్లు లేని చోట సైతం వేల లీటర్ల కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. చెట్లున్నా.. వాటిని గీసేవాళ్లే లేరు. అయినా అక్కడ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కిలో ఆల్ర్ఫాజోలం ధర దాదాపు రూ.15 లక్షల వరకు పలుకుతుండగా.. 10 గ్రాములతో దాదాపు 100 పెట్టెలు అంటే.. 1200 సీసాల కల్లు తయారవుతుంది. ఈ ఆల్ర్ఫాజోలం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తోంది. ఇటీవల ట్రెండ్ మార్చి కూడా దీనిని సరఫరా చేస్తున్నారు. రెండురోజుల క్రితం ముషీరాబాద్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాప్‌లో రూ.42 లక్షల విలువైన ఆల్ర్ఫాజోలంతో తయారైన 12లక్షల ట్యాబ్‌లెట్లు ఎక్సైజ్ అధికారుల తనిఖీలో దొరికాయి. క్లోరోహైడ్రేట్ ఎక్కువగా కర్ణాటక నుంచి దిగుమతి అవుతుంది. కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరికీ తెలిసినా మౌనంగానే ఉంటున్నారు. వాస్తవానికి 650 మి.లీ. కల్లు అసలైనది. దానిని గరిష్ఠంగా రూ.100 వరకు విక్రయించే అవకాశం ఉంది. కానీ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా రూ.11 నుంచి రూ.50కి మించి ధర లేదు. ఇంత తక్కువకే ఎలా విక్రయిస్తున్నారనే అనుమానాలు అందరిలో ఉన్నా.. యంత్రాంగం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. కల్తీ కల్లుతో ఎవరివైనా ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే ఎక్సైజ్‌శాఖదాడులు చేస్తూ చేతులు దులుపుకొంటోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
వికసిత్ తెలంగాణ బీజేపీకే సాధ్యం
Read Latest Telangana News And Telugu News