రేవంత్..కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమా?:ఈటల
ABN , Publish Date - Feb 28 , 2025 | 04:30 AM
రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..? అని ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్‌కు సవాల్ చేశారు. కేంద్రం నిధులతోనే పంచాయతీలు, మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని..

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..? అని ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్‌కు సవాల్ చేశారు. కేంద్రం నిధులతోనే పంచాయతీలు, మునిసిపాలిటీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. చివరకు పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి కూడా ఆర్థిక సంఘం నిధుల నుంచే జీతాలు చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
అమృత్ స్కీం, ప్రజలు కడుతున్న పన్నులతోనే మునిసిపాలిటీల పాలన సాగుతోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. గడచిన పదేళ్లలో జరిగిన కుంభకోణాలు బయటకు రాకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో జరిగిన కుంభకోణాలను సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు.