Share News

Sheep Distribution Fraud: గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్ల స్కాం!

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:38 AM

గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో.. రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది.

Sheep Distribution Fraud: గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్ల స్కాం!

  • 7 జిల్లాల్లో కాగ్‌ నివేదికలో పేర్కొన్న నష్టం కేవలం రూ.254 కోట్లు

  • మొత్తం 33 జిల్లాల లెక్కలు తీస్తే రూ.వెయ్యి కోట్లు దాటే అవకాశం

  • మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్‌ కుమార్‌దే క్రియాశీలపాత్ర

  • ప్రైవేటు ఖాతాలకు నిధుల బదిలీ: ఈడీ

హైదరాబాద్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో.. రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గుర్తించింది. కేవలం 7 జిల్లాల్లో కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) అధ్యయనం చేస్తేనే రూ.253.93 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు లెక్కతేలిందని.. మొత్తం 33 జిల్లాల లెక్కలు తీస్తే ప్రభుత్వానికి కలిగిన నష్టం రూ.వెయ్యి కోట్ల దాకా ఉంటుందని ఈడీ వెల్లడించింది. గొల్ల, కురుమ లబ్ధిదారులకు వెళ్లాల్సిన ప్రభుత్వ నిధులు, ప్రైవేటు వ్యక్తుల బ్యాంకు ఖాతాలకు బదిలీ అయినట్లు ఈడీ విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా.. హైదరాబాద్‌లో జరిపిన సోదాల్లో 200 డమ్మీ బ్యాంకు ఖాతాలు బయటపడినట్టు, ఖాళీ చెక్‌ బుక్స్‌, పాస్‌బుక్స్‌, డెబిట్‌ కార్డులు, 31 మొబైల్‌ ఫోన్లు, 20 పైగా సిమ్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇటీవల పెరిగిన బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంలోనూ ఈ ఖాతాలు, ఫోన్లను వాడినట్లు వారు గుర్తించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.


ఇదీ నేపథ్యం..

గొర్రెల పంపిణీ పథకంలో నిధులు దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఓఎస్డీ జి. కల్యాణ్‌ కుమార్‌తోపాటు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, వ్యాపారులు, దళారుల ఇళ్లల్లో (మొత్తం ఎనిమిది చోట్ల) జూలై 30న సోదాలు నిర్వహించినట్లు హైదరాబాద్‌ జోనల్‌ ఈడీ అధికారులు శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ అంశంపై తొలుత అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కల్యాణ్‌ కుమార్‌ పశు సంవర్థక శాఖ కార్యాలయానికి వెళ్లి రికార్డులు మాయం చేసినట్లు, కొన్ని ఫైళ్లు దహనంచేసినట్లు, బీరువాల తాళాలు పగులగొట్టి సాక్ష్యాలు మాయం చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు వచ్చింది. లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా... ప్రైవేటు వ్యక్తుల ఖాతాలకు రూ. 2.1 కోట్ల ప్రభుత్వ సొమ్మును బదిలీ చేసినట్లు ఒక గొర్రెల వ్యాపారి కూడా ఫిర్యాదు చేశారు.


దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆ నగదు బదిలీలో సంబంధిత శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్ల హస్తం ఉన్నట్లు కూడా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. దీనికితోడు.. ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’(కాగ్‌) 2021 మార్చిలో విడుదల చేసిన నివేదికలోనూ.. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాల గురించి ఉంది. అయితే కేవలం 7 జిల్లాల్లో చేపట్టిన విచారణ మేరకే ‘కాగ్‌’ నివేదిక సమర్పించింది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలతో దాదాపు రూ.254 కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం కలిగినట్లు నివేదికలో పేర్కొంది. ఆ గణాంకాలనే ఈడీ అధికారులు ఉటంకించారు. ఈడీ దర్యాప్తులో కూడా.. నకిలీ వ్యాపారులకు భారీగా ప్రభుత్వ నిధులు బదిలీ అయినట్లు వెల్లడైంది. పథకం ప్రారంభానికి ముందే.. గొర్రెల వ్యాపారంలో లేనివారికి డబ్బు చెల్లించినట్లు, అసలు గొర్రెల కొనుగోలు, అమ్మకాలు జరగకుండానే ప్రభుత్వ సొమ్మును ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేసినట్లు, లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డుల్లో పేర్కొన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరంపై పీసీ ఘోష్ నివేదిక.. సీఎం రేవంత్‌రెడ్డికి సమర్పణ

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌పై కొనసాగుతున్న విచారణ.. కస్టడీలో డాక్టర్ నమ్రత

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 02 , 2025 | 03:38 AM