Share News

ED investigation: బెట్టింగ్‌ యాప్స్‌ సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ!

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:48 AM

బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది సినీ, సోషల్‌ మీడియా సెలబ్రిటీల మీద, నాలుగు కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు(ఈసీఐఆర్‌) నమోదు చేశారు.

ED investigation: బెట్టింగ్‌ యాప్స్‌ సెలబ్రిటీలపై రంగంలోకి ఈడీ!

  • 29 మంది సినీ, సోషల్‌ మీడియా ప్రముఖులపై కేసు

  • జాబితాలో విజయ్‌దేవరకొండ, రానా, ప్రకాశ్‌రాజ్‌, సిరి, శ్రీముఖి

  • త్వరలో వీరికి ఈడీ సమన్లు?

  • తాను ప్రచారం చేసినప్పుడు ‘రమ్మీ గేమ్‌’ బెట్టింగ్‌ యాప్‌ కాదన్న ప్రకాశ్‌రాజ్‌

హైదరాబాద్‌, జూలై 10(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది సినీ, సోషల్‌ మీడియా సెలబ్రిటీల మీద, నాలుగు కంపెనీల మీద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్టు(ఈసీఐఆర్‌) నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. ఈడీ జాయింట్‌ డైరెక్టర్‌ రోహిత్‌ ఆనంద్‌ నేతృత్వంలోని బృందం హైదరాబాద్‌లోని పంజాగుట్ట, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మియాపూర్‌, సూర్యాపేట, విశాఖపట్నం తదితర పోలీసుస్టేషన్లలో నమోదైన ఐదు కేసుల ఆధారంగా 29 మందిపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. సినీ రంగానికి చెందిన విజయ్‌ దేవరకొండ, రాణా దగ్గుబాటి, ప్రకాష్‌రాజ్‌, మంచులక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్‌, అనన్య నాగళ్ల, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సిరి హన్మంతు, శ్రీముఖి, వర్షిణి సౌందర్‌రాజన్‌, వాసంతి కృష్ణన్‌, శోభా షెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్‌, పాండు, పద్మావతి, ఇమ్రాన్‌ ఖాన్‌, విష్ణు ప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్‌, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బడారు సుప్రీత, కిరణ్‌గౌడ్‌, అజయ్‌, సన్నీ, సుధీర్‌ లోకల్‌ బాయ్‌ నానీతో పాటు బెట్టింగ్‌ యాప్‌ ఆపరేటర్ల పేర్లను ఈసీఐఆర్‌లో ఈడీ పేర్కొంది.


బెట్టింగ్‌ యాప్స్‌కు ప్రమోషన్‌ చేసి పారితోషికంగా లక్షల రూపాయలను వీరు తీసుకున్నారని, ఇందులో అధిక మొత్తం డబ్బు మనీలాండరింగ్‌ రూపంలో అందినట్లు అనుమానాలు ఉన్నాయని ఈడీ అధికారులు ఈసీఐఆర్‌లో పేర్కోన్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారం బయటపడిన తర్వాత విజయ్‌ దేవర కొండ, రాణా, ప్రకా్‌షరాజ్‌ తదితరులు తమ వివరణను ఇచ్చారు. అనుమతి ఉన్న స్కిల్‌ గేమ్స్‌కు మాత్రమే విజయ్‌ దేవరకొండ ప్రచారం చేశారని ఆయన టీం మీడియాకు అప్పట్లో వివరణ ఇచ్చింది. ఆ తర్వాత బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంపై సిట్‌ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్వాహకులకు ఉన్న అనుమతులు, వారు ఎక్కడి నుంచి ఆపరేట్‌ చేస్తున్నారు? మనీ రూటింగ్‌ ఎలా జరుగుతుంది? వేల కోట్ల రూపాయలు ఏయే ఖాతాల ద్వారా రూట్‌ మారుతున్నాయనే విషయాలపై సిట్‌ దృష్టి సారించింది. ఈ కేసులో పోలీసు శాఖ ఇప్పటికే సేకరించిన పలు ఆధారాలను ఈడీ అధికారులు తీసుకున్నారు. త్వరలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఈడీ సమన్లు జారీ చేసే అవకాశాలున్నాయి.


నోటీసులు రాలేదు: ప్రకాశ్‌రాజ్‌

ఈడీ కేసుపై సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. గురువారం చిత్రజ్యోతితో మాట్లాడారు. ‘‘2017లో నేను, రానా రమ్మీ గేమ్‌ యాప్‌నకు ప్రచారం చేశాం. అప్పుడు అది బెట్టింగ్‌ యాప్‌ కాదు. రెన్యువల్‌ సమయంలో నేను ప్రచారం చేయనని చెప్పాను. తర్వాత దాన్ని కొనసాగించలేదు. మేం ప్రచారం చేసిన కంపెనీ ఆ యాప్‌ను మరో కంపెనీకి విక్రయించింది. ప్రస్తుతం నాకు ఎలాంటి నోటీసులు రాలేదు. యాప్‌ ప్రచారానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలను అధికారులకు అందజేస్తాను’’ అని అన్నారు.


బెట్టింగ్‌ యాప్‌లకు వివాహిత బలి

హైదర్‌నగర్‌, జూలై10 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌ యాప్‌లలో డబ్బులు పెట్టి మోసపోయి మనస్తాపానికి గురైన వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాలకొల్లుకు చెందిన గంగ అనూష(27), వెంకన్నబాబు దంపతులు కొంతకాలంగా కేపీహెచ్‌బీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరులేని సమయంలో అనూష ఉరివేసుకుంది. అనూష బెట్టింగ్‌యా్‌పలో మొదట రూ.100 పెట్టుబడి పెట్టి లాభం రావడంతో లక్షల పెట్టుబడి పెట్టింది. తర్వాత వాటిని రాబట్టుకునేందుకు భర్త వెంకన్న బాబుకు తెలియకుండా బంగారం తాకట్టుపెట్టింది. ఆ డబ్బులు కూడా నష్టపోవడంతో.. భయంతో ఆత్యహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కేపీహెచ్‌బీ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 04:48 AM